logo

రివర్స్‌ పీఆర్సీ రద్దు చేయాలని డిమాండ్‌

రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన రివర్స్‌ పీఆర్‌సీని రద్దు చేయాలంటూ ఉపాధ్యాయులు కదం తొక్కారు. ఫ్యాప్టో పిలుపు మేరకు ఉపాధ్యాయులు జిల్లా కలెక్టరేట్‌ ముట్టడికి గురువారం భారీగా తరలివచ్చారు. కలెక్టరేట్‌ పరిసరాలు ఎటు చూసినా ఆందోళనకారులతో నిండిపోయాయి. కలెక్టరు బంగ్లా రోడ్డు, హిందూ కళాశాల రోడ్డు, కంకరగుంట బ్రిడ్జి రోడ్డు ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులతో కిక్కిరిసోయాయి.

Published : 21 Jan 2022 04:19 IST

కలెక్టరేట్‌ను దిగ్బంధించిన ఉపాధ్యాయులు

వేలమందితో ఆందోళనకు దిగిన ఉద్యోగులు

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-జిల్లాపరిషత్తు

రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన రివర్స్‌ పీఆర్‌సీని రద్దు చేయాలంటూ ఉపాధ్యాయులు కదం తొక్కారు. ఫ్యాప్టో పిలుపు మేరకు ఉపాధ్యాయులు జిల్లా కలెక్టరేట్‌ ముట్టడికి గురువారం భారీగా తరలివచ్చారు. కలెక్టరేట్‌ పరిసరాలు ఎటు చూసినా ఆందోళనకారులతో నిండిపోయాయి. కలెక్టరు బంగ్లా రోడ్డు, హిందూ కళాశాల రోడ్డు, కంకరగుంట బ్రిడ్జి రోడ్డు ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులతో కిక్కిరిసోయాయి.

మూడువైపులా కమ్మేశారు

జిల్లా కలెక్టరేట్‌ ముట్టడిని పోలీసులు అడ్డుకుంటారన్న ఉద్దేశంతో ఉపాధ్యాయులు ప్రత్యేక వ్యూహం అమలుచేశారు. పల్నాడు ప్రాంతం నుంచి వచ్చేవారు జిల్లా పరిషత్‌ ప్రాంగణం, తెనాలి, మంగళగిరి, రేపల్లె, పొన్నూరు నుంచి వచ్చేవారు ఎన్జీవో కల్యాణమండపం, గుంటూరు పరిసరప్రాంతాలు, సత్తెనపల్లి, పెదకూరపాడు నుంచి వచ్చేవారు రెవెన్యూ కల్యాణమండపం చేరుకునేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకు అనుగుణంగా ఆయా ప్రాంతాల నుంచి రైళ్లు, బస్సులు, ప్రైవేటు వాహనాల్లో వచ్చిన ఉపాధ్యాయులు వారికి కేటాయించిన ప్రాంగణాలకు చేరుకున్నారు. ఉదయం 9.30గంటలకు మూడువైపులా నుంచి ఒకేసారి ఉపాధ్యాయులు కలెక్టరేట్‌ ప్రాంగణానికి బయలుదేరారు. వందల మంది ఒక్కసారిగా వస్తుండటంతో పోలీసులు అడ్డుకోలేకపోయారు

నినాదాలు చేస్తున్న ఉపాధ్యాయురాలు

నోటీసులను ఖాతరు చేయకుండా..

నోటీసులను ఖాతరు చేయకుండా ఉపాధ్యాయులు ఆందోళనకు తరలివచ్చారు. ప్రాథమిక పాఠశాలల నుంచి ఇద్దరు, ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి ముగ్గురు, జడ్పీ, మున్సిపల్‌, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి పది మంది చొప్పున ఉపాధ్యాయులు ఆందోళనకు వచ్చారు. భార్యాభర్తలు ఇద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు కలసి కలెక్టరేట్‌ ముట్టడికి రావటం విశేషం. . కలెక్టరేట్‌ రోడ్డులోని డివైడర్లు, కాసు వెంగళరెడ్డి విగ్రహం పరిసరాలు, జిల్లా పోలీస్‌ కార్యాలయం, పోలీసు కవాతు మైదానం, డీఎంహెచ్‌వో కార్యాలయం, తంతీ తపాలా కార్యాలయం, డీఈవో కార్యాలయాల ముందు భాగంలో ఉపాధ్యాయులు బైఠాయించటంతో ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడింది. వాహనదారులకు దారి ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించగా ఉపాధ్యాయులు మానవహారంగా ఏర్పడేందుకు సిద్ధమయ్యారు. ఆందోళనకు ఇబ్బంది లేకుండా వాహనదారులను ప్రత్యామ్నాయ మార్గంలో పంపుతామని పోలీసు అధికారులు చెప్పటంతో ఉపాధ్యాయులు దారి ఇచ్చారు. ఆందోళనలో పాల్గొన్న ముఖ్య నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని నగరంపాలెం పోలీసుస్టేషన్‌కు తరలించారు. జిల్లా ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పలువురు మహిళా టీచర్లను పోలీసు వాహనాల్లో ఎక్కించి స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ సమయంలో సీఎం జగన్‌ డౌన్‌ డౌన్‌ అని నినాదాలు చేశారు. మధ్యాహ్నం 1.30 గంటలకు డీఎస్పీలు సీతారామయ్య, సుప్రజ, సీఐలు ఆందోళనకారులను ఖాళీ చేయించి పంపటంతో ముట్టడి కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్‌ తిరుమలేశ్‌, జిల్లా సెక్రటరీ జనరల్‌ ఫైజుల్లా, కో-ఛైర్మన్లు కళాధర్‌, పెదబాబు, చాంద్‌బాషా, వేళాంగిణిరాజు, కార్యవర్గసభ్యులు ప్రేమ్‌కుమార్‌, చంద్రజిత్తుయాదవ్‌, బసవ లింగరావు, నరసింహారావు, అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

పలు ఉద్యోగ సంఘాల నాయకుల మద్దతు

ఉపాధ్యాయుల ఆందోళనకు ఫ్యాప్టో రాష్ట్ర ఛైర్మన్‌ జోసఫ్‌ సుధీర్‌బాబు సంఘీభావం తెలిపారు. ఏపీ పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జె.పూర్ణచంద్రారెడ్డి, రాష్ట్ర నాయకుడు కె.మెహనరావు, ఏపీ ఎన్జీవో పట్టణ అధ్యక్షుడు సుకుమార్‌, ఏపీ ఎన్జీవోల సంఘం జిల్లా సహ అధ్యక్షుడు రాంబాబు, ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి, బ్రహ్మారెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి ఎం.ఎన్‌.మూర్తి, ఏఎన్‌ఎంల సంఘం జిల్లా నాయకరాలు శైలజ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని