logo

స్కూళ్ల మ్యాపింగ్‌పై మళ్లీ మొదటికే!

ఒకవైపు పీఆర్సీపై ప్యాప్టో ఆందోళనలకు పిలుపునివ్వటంతో చాలా వరకు ఉపాధ్యాయులు విధులకు దూరంగా ఉంటున్నారు. కానీ జిల్లా విద్యాశాఖపై పాఠశాలల మ్యాపింగ్‌కు సంబంధించి ఉన్నత స్థాయి నుంచి విపరీతమైన ఒత్తిడి ఉంది. ఇప్పటికే ఒకసారి కసరత్తు నిర్వహించారు. తాజాగా నిబంధనలు మార్చటంతో అది పనికిరాకుండా పోయింది

Published : 21 Jan 2022 04:33 IST

ఈనాడు-అమరావతి


స్కూళ్ల మ్యాపింగ్‌ మార్పులను వివరిస్తున్న డీఈఓ గంగాభవాని, అదనపు సంచాలకులు పార్వతి, డీవైఈఓలు నారాయణరావు, రవిసాగర్‌, శ్రీనివాసరావు

ఒకవైపు పీఆర్సీపై ప్యాప్టో ఆందోళనలకు పిలుపునివ్వటంతో చాలా వరకు ఉపాధ్యాయులు విధులకు దూరంగా ఉంటున్నారు. కానీ జిల్లా విద్యాశాఖపై పాఠశాలల మ్యాపింగ్‌కు సంబంధించి ఉన్నత స్థాయి నుంచి విపరీతమైన ఒత్తిడి ఉంది. ఇప్పటికే ఒకసారి కసరత్తు నిర్వహించారు. తాజాగా నిబంధనలు మార్చటంతో అది పనికిరాకుండా పోయింది. దీంతో స్కూళ్ల మ్యాపింగ్‌ అనేది మళ్లీ మొదటికి వచ్చినట్లు అయింది. శుక్రవారం నాటికల్లా మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తి కావాలని ఇంతకు ముందే పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి, కమిషనర్‌లు స్పష్టం చేశారు. రెండు రోజుల నుంచి ఉపాధ్యాయులు పీఆర్సీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూ విధులకు సరిగా హాజరుకావటం లేదు. దీంతో ప్రధానోపాధ్యాయులు సహచార ఉపాధ్యాయుల సహకారం లేకుండా దాన్ని పూర్తి చేయలేమని చెప్పటంతో గురువారం జిల్లాలోని గుంటూరు, సత్తెనపల్లి, తెనాలి, నరసరావుపేట, బాపట్ల డివిజన్ల డీవైఈఓ, ఎంఈఓ, హెచ్‌ఎంలతో జిల్లా విద్యాశాఖ అధికారి గంగాభవానీ గుంటూరు నగరంలో సమావేశమయ్యారు. ఈ కసరత్తు పూర్తికి జిల్లాకు ప్రత్యేక పరిశీలకులుగా అదనపు సంచాలకులు పార్వతిని నియమించటంతో ఆమె కూడా ఈ సమీక్షకు హాజరై రానున్న రెండు రోజుల్లో పూర్తిచేసి వివరాలను పంపాలని ఆదేశించారు. ఇకమీదట గడువు పొడిగించేది లేదని స్పష్టం చేశారు.

గతంలో చేసిందంతా

జిల్లాలో ఇప్పటికే 250 మీటర్లు, ఒక కిలోమీటరు పరిధిలో ఉన్నత పాఠశాలకు సమీపంగా ఎన్ని ప్రాథమిక పాఠశాలలు ఉంటే ఆ మొత్తాన్ని సమీపంలోని ఉన్నత పాఠశాలకు మ్యాపింగ్‌ చేయాలని ఆదేశాలు అందటంతో అప్పట్లో ఆ కసరత్తు చేశారు. ప్రస్తుతం ఆ కసరత్తు అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. తాజాగా ఒక ఉన్నత పాఠశాలకు 3 కిలోమీటర్ల లోపు ఉన్న అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను మ్యాపింగ్‌ చేయాలని ఆదేశించారు. రెండు, మూడు ఉన్నత పాఠశాలలు ఉన్నా వాటిల్లో ఏ పాఠశాలలో వసతులు, సౌకర్యాలు ఉన్నాయో పరిశీలించి వాటికి మ్యాపింగ్‌ చేయాలని, అదేవిధంగా ఆయా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఏది దగ్గర ఉంటే ఆ ఉన్నత పాఠశాలకే కలిపి ప్రతిపాదనలు పంపాలని గురువారం జరిగిన సమీక్షలోనూ స్పష్టం చేశారు. ఈ కసరత్తులో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేదని అధికారులు సూచించారు. పురపాలికల పరిధిలో ఉన్న జడ్పీ, ఎంపీపీ పాఠశాలలను పరిగణనలోకి తీసుకున్నారు. అదేవిధంగా ఉర్దూ మీడియం పాఠశాలలను మ్యాపింగ్‌ చేయాలని స్పష్టత ఇచ్చారు. పిల్లల సంఖ్య, తరగతి గదులు, టీచర్లు వారిలో సెకండరీగ్రేడ్‌, స్కూల్‌ అసిస్టెంట్లు ఇలా క్యాడర్ల వారీగా వివరాలు పంపాలని కోరారు. అదేవిధంగా ఉన్నత పాఠశాలల్లో దేనిలో టీచర్లు ఎక్కువ ఉన్నారు? ఎందులో సౌకర్యాలు బాగున్నాయో కూడా విడివిడిగా వివరాలు సమర్పించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని