logo

తాడేపల్లి కేంద్రంగా తనూజ కేసు విచారణ

గుంటూరు ఏటీ ఆగ్రహారానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని తనూజ అనుమానాస్పద మృతి కేసును తాడేపల్లి కేంద్రంగా విజయవాడ మాచవరం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మాచవరం సీఐ ప్రభాకర్‌

Published : 22 Jan 2022 03:34 IST

కుంచనపల్లి సర్వీసు రోడ్డులో ఆనవాళ్లు

కుంచనపల్లి (తాడేపల్లి), న్యూస్‌టుడే: గుంటూరు ఏటీ ఆగ్రహారానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని తనూజ అనుమానాస్పద మృతి కేసును తాడేపల్లి కేంద్రంగా విజయవాడ మాచవరం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మాచవరం సీఐ ప్రభాకర్‌ నేరపరిశోధన బృందంతో కలిసి శుక్రవారం రాత్రి కుంచనపల్లి వద్ద విచారణ చేపట్టారు. తన మేనమామ ఇంటికి వెళ్లాలని ద్విచక్ర వాహనంపై తనను వదిలి వెళ్లాల్సిందిగా స్నేహితుడిని కోరినట్లు విచారణలో బయటపడినట్లు సమాచారం. ఆమెను కుంచనపల్లి మార్గంలో వదిలి వెళ్లిన వ్యక్తిని అదుపులో తీసుకొని విచారించిన పోలీసులు కేసులో కొంత పురోగతి సాధించారు. అతను ఇచ్చిన సమాచారంతో కేఎల్‌యూ రోడ్డులో ఆమె కదలికలను గుర్తించిన పోలీసులకు, తర్వాత మరో కెమెరాలో కుంచనపల్లి సర్వీసు రోడ్డు నుంచి ఆమె జాతీయ రహదారిపైకి నడుచుకుంటూ వెళ్లినట్లు గుర్తించారు. దీంతో గుంటూరు నుంచి నేరుగా తాడేపల్లి ప్రాంతానికి వచ్చిన తర్వాతనే ఆమె మృతి చెందినట్లుగా అనుమానిస్తున్న పోలీసులు ఆ దిశగా ఆరా తీస్తున్నారు. జాతీయ రహదారిపై ఆమెను ఏదైనా కారు ఢీకొని ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఆమె శరీరంపై రక్తగాయాలు లేకపోవడంతో అపస్మారక స్థితికి చేరి ఉంటుందన్న ఉద్దేశంతో బాధ్యులు వైద్యశాలకు తీసుకెళ్లడానికి ప్రయత్నించి ఉంటారని పోలీసులు అంటున్నారు. మార్గమధ్యలో తనూజ చనిపోవడంతో ప్రమాద కారకులు భయంతో విజయవాడలో మృతదేహాన్ని వదిలేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఏ వాహనం ఢీకొట్టిందనే అంశంపై దృష్టి సారించిన పోలీసులు కుంచనపల్లి, తాడేపల్లి ప్రాంతంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆమె కదలికలు గుర్తించిన ప్రాంతంలోనే ఆధారాలు దొరుకుతాయని భావించిన పోలీసులు ఆయా ప్రాంతాల్లో విచారణ వేగవంతం చేశారు. ప్రమాదం చేసిందెవరు? విజయవాడ వరకు ఆమెను తెచ్చిందెవరు? ఎందుకు మృతదేహాన్ని వదిలి పారిపోయారన్న ప్రశ్నలకు సమాధానాలు దొరికితే కేసు మిస్టరీ వీడినట్లేనని పోలీసులు అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని