logo

పోలీసులపై కరోనా పంజా

వేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి బారిన పెద్ద సంఖ్యలో పోలీసులు పడుతున్నారు. మూడు వారాల వ్యవధిలోనే దాదాపు 180 మంది అధికారులు, సిబ్బందికి కొవిడ్‌ సోకింది. వారి కుటుంబ సభ్యుల్లో కూడా చాలా

Published : 22 Jan 2022 04:13 IST

ఈనాడు - అమరావతి

వేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి బారిన పెద్ద సంఖ్యలో పోలీసులు పడుతున్నారు. మూడు వారాల వ్యవధిలోనే దాదాపు 180 మంది అధికారులు, సిబ్బందికి కొవిడ్‌ సోకింది. వారి కుటుంబ సభ్యుల్లో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటి వరకు మొత్తం మూడు దశలలో దాదాపు వెయ్యి మంది వరకు దీని బారిన పడ్డారు. సుమారు ఏడుగురు మరణించారు. సకాలంలో పరీక్షలు నిర్వహించడం, మందులు అందించడం వంటి చర్యలను ఉన్నతాధికారులు ప్రారంభించారు. వీటిని పర్యవేక్షించడానికి ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు.

బెజవాడ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో మొత్తం నాలుగు వేల మంది వరకు అధికారులు, సిబ్బంది ఉన్నారు. శాంతి, భద్రతలు, ట్రాఫిక్‌, క్రైం, దిశ, ఏఆర్‌, టాస్క్‌ఫోర్స్‌, సైబర్‌, ఏసీపీ, డీసీపీ కార్యాలయాలు, స్టేషన్లు అన్నీ కలిపి 40 వరకు ఉన్నాయి. వీటికి నిత్యం అనేక మంది ఫిర్యాదుదారులు, పిటిషనర్లు వస్తుంటారు. నేరుగా క్షేత్రస్థాయిలో పనిచేసే లా అండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్‌ పోలీసులు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. రోజుకు కనీసం 15 నుంచి 20 మంది వరకు సోకుతోంది. ఇటీవల ఒకే రోజు అత్యధికంగా 50 మందికి పాజిటివ్‌గా తేలింది. పలువురు రెండు, మూడు సార్లు కూడా వచ్చిన వారు ఉన్నారు. వీరికి ఇంకా ఆరోగ్య సమస్యలు వెన్నాడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం 150 వరకు క్రియాశీలక కేసులు ఉన్నాయి. సీపీ కాంతిరాణా టాటా ప్రత్యేక సెల్‌ను ప్రారంభించారు. లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించడం, ఫలితాన్ని బట్టి వైద్యం అందించడం వంటివి ఈ సెల్‌ పర్యవేక్షిస్తోంది. పాజిటివ్‌ వచ్చిన వారికి మందుల కిట్లు, నిత్యవసర సరకులు, కూరగాయలను సరఫరా చేస్తున్నారు. చికిత్స అవసరమైన వారికి ఆసుపత్రులకు తరలించేందుకు వీలుగా ముందస్తుగా మూడు కార్పొరేట్‌ ఆసుపత్రులలో బెడ్లను కూడా ఉంచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని