logo

పరీక్ష కేంద్రాలపై కొరడా

కొవిడ్‌ మూడో దశ ఉద్ధృతమవుతున్న సమయంలో ప్రైవేటు ల్యాబ్‌ల నిర్వాహకులు విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడుతున్నారు. దీనిపై బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో కృష్ణా జిల్లా వైద్యారోగ్యశాఖ, రెవెన్యూ సిబ్బంది

Published : 22 Jan 2022 04:12 IST

ఆర్‌టీపీసీఆర్‌కు అధిక వసూళ్లు చేసేవారికి జరిమానాలు

ఈనాడు, అమరావతి

నగరంలోని ఓ ప్రైవేటు ల్యాబ్‌లో డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుహాసిని తనిఖీలు

కొవిడ్‌ మూడో దశ ఉద్ధృతమవుతున్న సమయంలో ప్రైవేటు ల్యాబ్‌ల నిర్వాహకులు విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడుతున్నారు. దీనిపై బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో కృష్ణా జిల్లా వైద్యారోగ్యశాఖ, రెవెన్యూ సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విజయవాడ నగరం, చుట్టుపక్కల ఉన్న ప్రైవేటు ల్యాబ్‌లపై ఏకకాలంలో ఏడు బృందాలుగా దాడులు నిర్వహించారు. జిల్లా వైద్యారోగ్య అధికారిణి డాక్టర్‌ ఎం.సుహాసిని ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. కొవిడ్‌ నిర్థరణ కోసం నిర్వహించే ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షకు రూ.350 మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం ధరను నిర్ణయించింది. అంతకుమించి వసూళ్లు చేస్తున్నట్టు గురించి.. పలు ల్యాబ్‌ల నిర్వాహకులకు జరిమానాలు విధించారు. మొదటి తప్పుగా భావించి జరిమానాలు విధిస్తున్నామని, ఇలాగే మళ్లీ కొనసాగిస్తే.. లైసెన్స్‌లను రద్దు చేస్తామని వైద్యారోగ్యశాఖ అధికారులు హెచ్చరించారు.

విజయవాడ నగరంలోని అపోలో, రెమిడీస్‌, ఏబీసీ డయాగ్నస్టిక్స్‌, ఐరిస్‌ ల్యాబ్స్‌, ఓమిక్రాన్‌ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌, సాయి బాలాజీ, కామినేని సహా పలు ప్రైవేటు వైద్య కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. వీటిలో మూడు ల్యాబ్‌లు నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్టు గుర్తించామని డీఎంహెచ్‌వో సుహాసిని తెలిపారు. ఒమిక్రాన్‌, సాయి బాలాజీ, కామినేని ఈ మూడు ఒక్కొక్కరి వద్దా అధికంగా రూ.149 వరకు వసూలు చేస్తున్నట్టు గుర్తించామన్నారు. అధికంగా వసూలు చేసిన డబ్బులను తిరిగి బాధితులకు ఇచ్చేసి.. ఆ చెల్లింపుల పత్రాలను తమకు సమర్పించాలని సూచించామన్నారు. ఇది మొదటి తప్పుగా వీరికి హెచ్చరించినట్టు తెలిపారు. అపోలో సాధారణ ల్యాబ్‌ లైసెన్స్‌ పొంది.. హైఎండ్‌ ల్యాబరేటరీని నిర్వహిస్తుండడంతో వారికి రూ.20వేలు జరిమానా విధించామన్నారు. మరో రూ.10వేలు చెల్లించి అనుమతి పొందాలని సూచించినట్టు సుహాసిని వెల్లడించారు. తనిఖీలు చేసిన బృందంలో మోతిబాబు, రవికుమార్‌, సుధాప్రసుజా, వేణుగోపాలకృష్ణ, ఇందుమతి, సుమన్‌ తదితర వైద్యులు పాల్గొన్నారు.  

రూ.350కు మించి వసూలు చేయకూడదు..

ఆర్‌టీపీసీఆర్‌కు ప్రభుత్వం నిర్ణయించిన రూ.350 కంటే అధికంగా ఏ ప్రైవేటు ల్యాబ్‌ కూడా వసూలు చేయకూడదని డీఎంహెచ్‌వో సుహాసిని హెచ్చరించారు. బాధితులు 1902కు ఫిర్యాదు చేస్తే వెంటనే తనిఖీలు నిర్వహించి చర్యలు చేపడతామని తెలిపారు. తాజాగా కొత్త రుసుములు నిర్ణయించిందని, అయినా కొందరు పాత ఫీజులనే తీసుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని