logo

ఉర్దూ పాఠశాలల విలీనంపై అభ్యంతరం

ఉర్దూ మీడియం పాఠశాలలను ఉర్దూ యేతర పాఠశాలల్లో విలీనం చేయొద్దని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. సాధారణ పాఠశాలల్లో కలిపి బోధన చేస్తే తమ పిల్లలకు ఉర్దూ రాకుండా పోతుంది. ఉర్దూ నేపథ్యంతో

Published : 22 Jan 2022 03:34 IST

ఈనాడు-అమరావతి

యథావిధిగానే కొనసాగించాలంటున్న తల్లిదండ్రులు

నులకపేటలోని ఉర్దూ మీడియం పాఠశాల

ఉర్దూ మీడియం పాఠశాలలను ఉర్దూ యేతర పాఠశాలల్లో విలీనం చేయొద్దని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. సాధారణ పాఠశాలల్లో కలిపి బోధన చేస్తే తమ పిల్లలకు ఉర్దూ రాకుండా పోతుంది. ఉర్దూ నేపథ్యంతో దక్కించుకునే ఉపాధ్యాయ పోస్టులకు దూరం కావాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా హైస్కూల్‌కు 3 కి.మీ.లోపు ఉన్న అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను దానికి మ్యాపింగ్‌ చేసి వాటిల్లో ఉండే 3, 4, 5 తరగతుల పిల్లలకు సబ్జెక్టు టీచర్లతో బోధన చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా తక్షణం పాఠశాలల మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు అందటంతో జిల్లాలో ఉర్దూ మాధ్యమ పాఠశాలల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ పాఠశాలల విలీనంపై విద్యార్థులు, తల్లిదండ్రులు డీఈవో గంగాభవానీను కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లాలో 269 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయి. గుంటూరులో 2, ఫిరంగిపురం మండలం అమీనాబాద్‌, మేడికొండూరు మండలం తురకపాలెం, వినుకొండలో ఒక్కొక్కటి చొప్పున ఐదు ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిల్లో ఉర్దూ అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను సమీపంలోని ఉన్నత పాఠశాలకు మ్యాపింగ్‌ చేయాలని మార్గదర్శకాలు జారీ చేయటంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో కేవలం ఐదే ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మిగిలిన 269 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను సమీపంలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తే ఆ పాఠశాలల విద్యార్థులకు ఉర్దూ ఎవరు బోధిస్తారనేది ప్రశ్నార్థకమవుతోంది. 3, 4, 5 తరగతులకు చెందిన పిల్లలతో పాటు ఒక సబ్జెక్టు టీచర్‌ ఉన్నత పాఠశాలకు వెళితే మిగిలిన పిల్లలకు ఎవరు బోధన చేయాలని, ఈ ప్రక్రియ నుంచి ఉర్దూ మీడియం పాఠశాలకు వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. భవిష్యత్తులో ఉర్దూ మీడియం పాఠశాలలకు వచ్చే ఉపాధ్యాయ పోస్టులను కోల్పోవటంతో పాటు ఈ భాషకు ప్రాధాన్యం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మా పాఠశాలల జోలికి రావొద్దు

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముస్లిం, మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి తమకు విద్యా, ఉద్యోగావకాశాలు పొందటానికి వెసులుబాటు కల్పించారు. ఆయన తనయుడు అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఒక్క ఉర్దూ పాఠశాలను కూడా ఇతర పాఠశాలల్లో కలపకుండా తక్షణమే మార్గదర్శకాలు ఇవ్వాలి. మసీదుల పక్కనే చాలా వరకు తమ పాఠశాలలు ఉన్నాయి. ఈ మీడియంలో చదవటం వల్ల తమ పిల్లలకు మసీదు తదితర ప్రార్థనా మందిరాల్లో పని చేసుకోవటానికి సరిపడా తర్ఫీదు ఇస్తారు. సాధారణ పాఠశాలల్లో ఇలాంటివి సాధ్యపడవు. దయచేసి తమ పాఠశాలల జోలికి రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.

-షేక్‌ జిలాని, పేరెంట్స్‌ కమిటీ ఛైర్మన్‌, నులకపేట ఉర్దూ మీడియం పాఠశాల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని