logo

నగర కమిషనర్‌గా నిశాంత్‌కుమార్‌

గుంటూరు నగరపాలక కమిషనర్‌గా ఐఏఎస్‌ అధికారి నిశాంత్‌కుమార్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన అనంతపురం జిల్లా సంయుక్త పాలనాధికారి

Published : 22 Jan 2022 03:34 IST

అనంతపురం జేసీగా ఉంటూ బదిలీపై రాక

ఎట్టకేలకు ఐఏఎస్‌ నియామకం

నిశాంత్‌కుమార్‌

ఈనాడు-అమరావతి: గుంటూరు నగరపాలక కమిషనర్‌గా ఐఏఎస్‌ అధికారి నిశాంత్‌కుమార్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన అనంతపురం జిల్లా సంయుక్త పాలనాధికారి(రైతు భరోసా అండ్‌ రెవెన్యూ)గా పనిచేస్తూ ఇక్కడికి బదిలీపై వస్తున్నారు. 2014 బ్యాచ్‌కు చెందిన ఈయన స్వస్థలం రాజస్థాన్‌. గతంలో తిరుపతి సబ్‌కలెక్టర్‌గా, రంపచోడవరం పీఓగా పనిచేశారు. సుమారు రెండేళ్ల నుంచి అనంతపురంలో జేసీగా పనిచేస్తున్నారు ఆయనకు భార్య, మూడేళ్ల పాప ఉన్నారు. ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది.

రాజధాని అమరావతిలో విజయవాడ తర్వాత రెండో అతిపెద్ద నగరపాలక సంస్థ గుంటూరే. అయితే విజయవాడతో పోలిస్తే ఇక్కడ అభివృద్ధి అంతగా లేదు. మరోవైపు రెండేళ్ల నుంచి భూ గర్భ డ్రైనేజీ పనులు పూర్తిగా పడకేశాయి. నగరంలో రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. కీలకమైన గాంధీ, మానససరోవరం పార్కుల పనులు సవ్యంగా సాగటం లేదు. ఈ నేపథ్యంలో ఐఏఎస్‌ అధికారి అయితేనే ఇవన్నీ గాడినపడతాయని భావించిన ప్రభుత్వం ఎట్టకేలకు ఐఏఎస్‌ నియామకం వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. దశాబ్దంన్నర తర్వాత కౌన్సిల్‌ ఏర్పాటైంది. పలువురు కార్పొరేటర్లు యంత్రాంగంపై కర్రపెత్తనం చేస్తున్నారని ప్రజా సమస్యల పరిష్కారంలో యంత్రాంగానికి జవాబుదారీతనం కొరవడిందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. పట్టణ ప్రణాళిక విభాగంలో చాలా మంది అధికారులను ప్రజాప్రతినిధులు నియంత్రిస్తూ భవన అనుమతుల వ్యవహారాలను చక్కబెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. గ్రాంట్ల కింద చేపట్టిన పనులకు బిల్లుల చెల్లింపుల్లోనూ పారదర్శకత కొరవడింది. చాలా వరకు ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులే కొలువుదీరడంతో కొంత స్పష్టత లోపిస్తోంది. తొలుత కమిషనర్‌ పేషీ నుంచే మార్పులకు శ్రీకారం చుట్టాలని కొందరు ఉద్యోగులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని