logo

జ్వరం.. వైరస్‌ బారిన జనం

జిల్లాలో జనం జ్వరాల బారిన పడుతున్నారు. మూడు రోజుల నుంచి కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతూ పరీక్షల కోసం వస్తున్న వారి సంఖ్య బాగా పెరిగిందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఐసీఎంఆర్‌

Updated : 22 Jan 2022 04:41 IST

ఈనాడు, అమరావతి

జిల్లాలో జనం జ్వరాల బారిన పడుతున్నారు. మూడు రోజుల నుంచి కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతూ పరీక్షల కోసం వస్తున్న వారి సంఖ్య బాగా పెరిగిందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుతం వైరస్‌ నిర్ధారణకు ఆర్టీపీసీఆర్‌ నమూనాలనే ప్రామాణికంగా తీసుకోవాలని స్పష్టమైన మార్గదర్శకాలు ఉండటంతో ఈ పరీక్షలకు బాగా రద్దీ పెరిగింది. గుంటూరు ప్రభుత్వ  వైద్య కళాశాలలోని వీఆర్‌డీఎల్‌ ప్రయోగశాలలో టెక్నీషియన్లు సరిపడా లేక ఫలితాల వెల్లడిలో జాప్యమవుతోంది. కొన్నిచోట్ల 30 గంటలు గడిచినా ఫలితం రావటం లేదని, ఈ లోపే వైరస్‌ తీవ్రత తగ్గి నెగిటివ్‌ వస్తోందని బాధితులు చెబుతున్నారు. గుంటూరు జీజీహెచ్‌తో పాటు తెనాలి జిల్లా ఆసుపత్రి, నరసరావుపేట ప్రాంతీయ వైద్యశాలలోనూ కొవిడ్‌ పరీక్ష కేంద్రాలున్నాయి. అన్ని మండల కేంద్రాల్లోని పీహెచ్‌సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు కొన్నిచోట్ల సచివాలయాల్లోనూ కిట్లు అందుబాటులో ఉంచటంతో ఒక్కసారిగా పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య బాగా పెరిగింది. గత వారం రోజుకు వెయ్యిలోపే పరీక్షలు ఉండేవి. ఐదు రోజుల నుంచి పరిశీలిస్తే సగటున రోజుకు నిర్వహిస్తున్న పరీక్షలు 5-6 వేల దాకా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే   కేసులు వేలల్లో వస్తున్నాయి.  

తగ్గిన హాజరు శాతం : సంక్రాంతి సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభమయ్యాక విద్యార్థుల హాజరుశాతం బాగా తగ్గింది. చాలామంది కరోనా భయంతో పాఠశాలలకు వెళ్లటం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో హాజరు తగ్గినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది తల్లిదండ్రులు పిల్లలను స్కూళ్లకు పంపటం లేదు.

పెద్ద సంఖ్యలో ఉద్యోగులు

క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకయ్యే పోలీసు, వైద్య, ఆరోగ్యం, నగరపాలక, మున్సిపల్‌, పాఠశాల ఉపాధ్యాయులు, రెవెన్యూశాఖలకు చెందిన ఉద్యోగులే ఎక్కువగా వైరస్‌ బారిన పడుతున్నారు. వారి ద్వారా కుటుంబీకులకు వ్యాప్తి చెంది కేసులు పెరుగుతున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ భావిస్తోంది. గుంటూరు జీజీహెచ్‌లో ఇప్పటికే పీజీ వైద్యులు, హౌస్‌ సర్జన్లు, నర్సులు, నాలుగో తరగతి ఉద్యోగులు 30మందికి పైగా వైరస్‌ బారినపడి సెలవు పెట్టేశారు. కాటూరి, ఎన్నారై వైద్య కళాశాలలోనూ చాలామంది వైద్యులు, పీజీలు, హౌస్‌ సర్జన్లు కరోనా సోకి ఇళ్ల వద్దే ఉంటున్నారు. ప్రస్తుతం జీజీహెచ్‌లో 135 మంది రోగులు ఉన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా పదుల సంఖ్యలోనే ఉన్నారు. నగరపాలకలో పలువురు పారిశుద్ధ్య కార్మికులు, సుమారు 20 మంది టీచర్లు దాని బారిన పడ్డారు. శుక్రవారం రేపల్లె మండలం యేలేటిపాలెం పాఠశాల, తుళ్లూరు కేవీఆర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు, ఇద్దరు విద్యార్థినులకు కరోనా నిర్ధారణ అయింది. ఈ పరిణామంతో సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన చెందారు.

ఫలితాల వెల్లడిలో జాప్యం

జిల్లాలో శుక్రవారం 1054 కేసులు వచ్చాయి. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలకు కొన్నిచోట్ల కిట్ల కొరతగా ఉంది. నగర, పురపాలికల్లో పట్టణ ఆరోగ్య కేంద్రాలు, సచివాలయాల్లోనూ పరీక్షలు చేస్తున్నారు. దీంతో ఇక్కడ ఫలితం కూడా త్వరగానే వస్తోంది. గ్రామీణ, మండల కేంద్రాల్లో అయితే వైరస్‌ నిర్దారణ పరీక్ష చేయించుకున్నాక రోజున్నర నుంచి రెండు రోజుల దాకా ఫలితం కోసం వేచి చూడాల్సి వస్తోంది. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఏడు ప్రైవేటు ల్యాబ్‌లకు అనుమతులు ఇవ్వగా అక్కడ పరీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రుసుములు అమలు కావటం లేదు. కొన్నిల్యాబ్‌ల్లో రూ.600 నుంచి 750 మరికొన్నిచోట్ల రూ.750 నుంచి వెయ్యి దాకా వసూలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలు, విదేశాలకు వెళ్లే వారికైతే రూ.2 వేల నుంచి 3 వేల దాకా సొమ్ము చేసుకుంటున్నారు.

కిట్ల కొరత లేదు

డిమాండ్‌ మేరకు పరీక్షలు నిర్వహించటానికి ఆర్టీపీసీఆర్‌ కిట్లు జిల్లాలో బాగానే ఉన్నాయి. ఎక్కడైనా కొరత ఉంటే వైద్యులు వెంటనే డీఎంహెచ్‌వో కార్యాలయాన్ని సంప్రదించాలి. ప్రతి రోజు కావాలన్నా పంపుతాం. నమూనాల సేకరణకు పంపే వాహనాల్లోనే కిట్లు పంపిస్తున్నాం. పరీక్షలు ఒక్కసారిగా పెరగటంతో ఎక్కడైనా కొరత ఏర్పడి ఉండొచ్చు. అది తాత్కాలికమే. పరీక్షలు ఎక్కువగా నిర్వహించటానికి, సకాలంలో ఫలితాలు ఇవ్వటానికి త్వరలోనే తెనాలి, నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రుల్లో ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకొస్తాం. నిర్దేశిత రుసుములు కన్నా అదనంగా వసూలు చేసే ల్యాబ్‌లను బ్లాక్‌లిస్టులో పెడతాం. ల్యాబ్‌లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం.

- డాక్టర్‌ జె.యాస్మిన్‌, డీఎంహెచ్‌వో, గుంటూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని