logo

రైతు ‘బంద్‌’..!

కర్షకులకు రైతుబంధు పథకం ఓ వరం వంటిది. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించని పక్షంలో రైతులు వాటిని మార్కెట్‌యార్డు గిడ్డంగుల్లో నిల్వ చేసుకుంటే సరకును బట్టి రుణాలు కూడా మంజూరు చేస్తారు.

Updated : 22 Jan 2022 04:42 IST

రెండేళ్లుగా నిలిచిపోయిన పథకం

రుణాల కోసం అన్నదాతల ఎదురు చూపులు

పొన్నూరు, న్యూస్‌టుడే

ఆరబెట్టిన ధాన్యం

కర్షకులకు రైతుబంధు పథకం ఓ వరం వంటిది. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించని పక్షంలో రైతులు వాటిని మార్కెట్‌యార్డు గిడ్డంగుల్లో నిల్వ చేసుకుంటే సరకును బట్టి రుణాలు కూడా మంజూరు చేస్తారు. వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా రబీ సాగుకు పెట్టుబడిని ఈవిధంగా పొందే అవకాశాలున్నాయి. అయితే జిల్లాలో గత రెండేళ్లుగా ఈ సేవలు కాగితాలకే పరిమితమయ్యాయి. రుణాలు మంజూరు చేయడానికి ప్రతి ఏటా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నారు. అయినా పుడమిపుత్రులకు పథకం ఫలాలు అందని ద్రాక్షగానే మారాయి.

ధాన్యాన్ని నిల్వ చేసుకునే వెసులుబాటు లేకపోవడంతో కొంతమంది రైతులు ప్రైవేటు గోదాములను ఆశ్రయిస్తున్నారు. వాటి నిర్వాహకులు చెప్పిన అద్దె చెల్లించాల్సిన పరిస్థితి.. మరికొంతమంది కర్షకులు ధాన్యం నిల్వ చేసుకునే వెసులుబాటు లేకపోవడంతో చేలల్లోనే సరకును అమ్మేస్తున్నారు. అకాల వర్షాల భయంతో ఆరుబయట ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు రైతులు వెనుకాడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి కొంత ధాన్యం తడిసి ముద్దయింది.  

* వేమూరు, తెనాలి, బాపట్ల వ్యవసాయ మార్కెట్‌యార్డుల్లో కొన్ని గోదాములను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అద్దె ప్రాతిపదికపై ప్రైవేటు వ్యాపారులకు అప్పగించారు.  మరికొన్నింటినీ ప్రైవేటు వ్యాపారులకు అద్దెకు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్టు అధికారులు చెప్పారు. గోదాములో నిల్వ చేసిన పంటపై 75 శాతం వరకు రుణం మంజూరు చేస్తారు. తీసుకున్న రుణానికి 180 రోజుల వరకు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. గిట్టుబాటు ధర లభించని పక్షంలో 181 నుంచి 270 రోజుల వరకు తీసుకున్న రుణంపై నామమాత్రపు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. పొన్నూరులో సుమారు 3,  తెనాలిలో 3.50,  వేమూరులో 1.50, బాపట్లలో  2.50 కోట్ల రూపాయల వరకు ఆయా మార్కెట్‌యార్డుల్లో ఈ పథకం కింద రైతులకు రుణాలు ఇచ్చే వెసులుబాటు ఉంది.

సరైన మార్గదర్శకాలేవి?

రుణాలు ఇచ్చేందుకు అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి సరైన మార్గదర్శకాలు వెలువడకపోవడంతో రైతుల ఆశలు అడియాసలవుతున్నాయి. గత ఖరీఫ్‌ సీజన్‌లో అధిక వర్షాలు కురవడం వల్ల పంటలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంటలకు గిట్టుబాటు ధర లభించక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ పథకం కింద ధాన్యం రైతులకు రుణాలు మంజూరు చేస్తే వారికెంతో ఊరటనిస్తుందంటున్నారు.

గత సీజన్‌లో రూ.13 వేలు అద్దెగా చెల్లించా

గత ఏడాది రైతుబంధు పథకం కింద రుణాలు మంజూరు చేయలేదు. ధాన్యం నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో ప్రైవేటు గోదాముల్లో 300 బస్తాలు నిల్వ చేసి, రూ.13 వేలు అద్దెకింద చెల్లించా. ఈ ఏడాది 20 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేశా. ఈ సారైనా ధాన్యాన్ని నిల్వ చేసుకునే అవకాశం కల్పించాలి.

- పొన్నగంటి వాసుబాబు, కౌలు రైతు, నిడుబ్రోలు

అందుబాటులో నిల్వ, రుణ సౌకర్యాలు: ఈ అంశంపై సంయుక్త మార్కెటింగ్‌ సంచాలకులు కె.శ్రీనివాస్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా మార్కెట్‌యార్డుల్లో రైతులు ధాన్యాన్ని నిల్వ చేసుకోవచ్చునని, రైతుబంధు పథకం కింద రుణాలు కూడా మంజూరు చేస్తామని చెప్పారు. ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఇప్పటికే మార్కెట్‌యార్డులకు అనుగుణంగా బడ్జెట్‌ను కూడా కేటాయించామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని