logo

జాప్యం లేకుండా ధాన్యం సొమ్ము జమ

జిల్లాలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి ఎలాంటి జాప్యం లేకుండా నగదు చెల్లింపులు చేయాలని సంబంధిత అధికారులను జేసీ కె.మాధవీలత ఆదేశించారు.

Published : 23 Jan 2022 03:39 IST

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జిల్లాలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి ఎలాంటి జాప్యం లేకుండా నగదు చెల్లింపులు చేయాలని సంబంధిత అధికారులను జేసీ కె.మాధవీలత ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల విషయమై నగరంలోని విడిది కార్యాలయం నుంచి శనివారం ‘డయల్‌ యువర్‌ జాయింట్‌ కలెక్టర్‌’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కనీస మద్దతు ధర, హామాలీ ఛార్జీలు, గోనె సంచులు తదితర సౌకర్యాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్పటి వరకు 52,415 మంది రైతుల నుంచి రూ.919.80 కోట్ల విలువైన 4,70,260 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు తెలిపారు.  సీతారామరెడ్డి (ఉంగుటూరు మండలం), వీర కోటేశ్వరరావు (మొవ్వ), గోపాలకృష్ణ (పెనమలూరు), గాంధీ (గుడివాడ), వెలగపూడి హారిక, రామకోటేశ్వరరావు, శ్రీనివాసరావు (విజయవాడ గ్రామీణ), సాంబశివరావు (కంకిపాడు)లు మాట్లాడుతూ.. తమకు నగదు జమ కాలేదని తెలిపారు. దీనిపై జేసీ స్పందిస్తూ.. నగదు చెల్లింపునకు ఆమోదం పొందారని, ఎస్‌టీవో జనరేట్‌ చేసిన తర్వాత 21 రోజుల్లో సొమ్ము జమవుతుందని పేర్కొన్నారు. గూడూరు నుంచి సాయిబాబు, రెడ్డిగూడెం నుంచి రామకోటిరెడ్డి, ఇబ్రహీంపట్నం నుంచి సాంబశివరావు మాట్లాడుతూ.. తమకు నగదు జమ కాలేదని విన్నవించారు. ఈ విషయమై జేసీ వివరణ ఇస్తూ.. రామకోటిరెడ్డికి ఈ నెల 12న, సాయిబాబు, సాంబశివరావులకు 21వ తేదీన నగదు జమ అయినట్టు చెప్పారు. విజయవాడ గ్రామీణ మండలానికి చెందిన శ్రీనివాసరావు, ఇబ్రహీంపట్నం నుంచి భవానీశంకర్‌లు మాట్లాడుతూ.. తమకు నగదు జమ కాలేదని, బ్యాంకులు తిరస్కరించినట్టు తెలిపారు. జేసీ స్పందిస్తూ.. ఆధార్‌తో బ్యాంకు ఖాతాలు అనుసంధానం కాకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడిందని, తక్షణమే అనుసంధానం చేయించుకోవాలని సూచించారు. తమ వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు శ్రీనివాసరావు (గుడ్లవల్లేరు), శివయ్య (నూజివీడు మండలం), సురేష్‌ (నందిగామ) తెలుపగా, వీరి నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్వాహకులను జేసీ ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని