logo

లారీ క్లీనర్‌ అనుమానాస్పద మృతి

ఉంగుటూరు మండలం పొణుకుమాడులో కటారి శివయ్య(45) శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఉయ్యూరు పట్టణానికి చెందిన కటారి శివయ్య లారీ క్లీనర్‌గా పని చేస్తూంటాడు.

Published : 23 Jan 2022 03:39 IST

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: ఉంగుటూరు మండలం పొణుకుమాడులో కటారి శివయ్య(45) శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఉయ్యూరు పట్టణానికి చెందిన కటారి శివయ్య లారీ క్లీనర్‌గా పని చేస్తూంటాడు. అతడికి పొణుకుమాడుకు చెందిన ఓ వివాహితతో 2005లో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. తర్వాత పెదఓగిరాలకు చెందిన చెల్లుబోయిన రాంబాబు అనే మరో వ్యక్తిని పరిచయం చేసుకున్న ఆమె.. శివయ్యను వదిలేసింది. మూడ్రోజుల క్రితం ఆమె పొణుకుమాడు వచ్చింది. ఈ నేపథ్యంలో శివయ్య మృతదేహం శుక్రవారం ఉదయం ఇంటి ముందు ప్రత్యక్షమవడంతో స్థానికులు ఏమైందని ఆమెను ప్రశ్నించగా.. ఆరోగ్యం బాగోలేక పోతే ఉంగుటూరు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ మరణించినట్లు పేర్కొంది. శనివారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు శివయ్య మృతి వివరాలపై ఆరా తీశారు. అసలు భర్తకు దూరంగా ఉంటున్న ఆమె ఇద్దరితో సహజీవనం చేస్తున్నట్లు, రాంబాబుతో కలిసి రెండేళ్లుగా హైదరాబాద్‌, ఇతర ప్రాంతాల్లో సంచరించినట్లు.. ఎవరి దగ్గర ఉంటే భర్తగా వారి పేర్లతో ఎప్పటికప్పుడు నూతన ఆధార్‌ కార్డులు మారుస్తున్నట్లు గుర్తించారు.  శివయ్య కుటుంబీకులు అతడి మృతికి ఆమె కారణమంటూ ఆరోపించారు. శివయ్యది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన ఉంగుటూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

లాడ్జిలో వ్యక్తి..

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే : లాడ్జిలో దిగిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు గవర్నర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణలంకకు చెందిన మల్లికార్జునరావు గవర్నర్‌పేట ప్రకాశం రోడ్డులో ఒక లాడ్జి నిర్వహిస్తున్నారు. ఈ నెల 17వ తేదీ సాయంత్రం ఎస్‌.ప్రసాద్‌ (50) అనే వ్యక్తి లాడ్జికి వచ్చి, మడత మంచం అద్దెకు తీసుకున్నాడు. తాను హోటల్‌లో సర్వర్‌గా పని చేస్తుంటానని, తన ఊరు రాజమండ్రి అని చెప్పాడు. రోజూ పనికి వెళ్లి, రాత్రికి వచ్చి లాడ్జిలో పడుకునే వాడు. ఈ నెల 21వ తేదీ ఉదయం పనికి వెళ్లి, రాత్రి 7 గంటలకు తిరిగి వచ్చాడు. 9.30 గంటల సమయంలో ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పటంతో 108 వాహనానికి ఫోన్‌ చేశారు. వారు వచ్చి చూడగా, అప్పటికే ప్రసాద్‌ చనిపోయినట్లు ధ్రువీకరించారు. లాడ్జి నిర్వాహకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 0866-2576023 నెంబరులో సంప్రదించాలని పోలీసులు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు