logo

గారపాడులో ప్రొటోకాల్‌ వివాదం

పెదకూరపాడు మండలం గారపాడులో ప్రోటోకాల్‌ వివాదం నెలకొంది. తనకు తెలియకుండా ఈ నెల 20న సమావేశం నిర్వహించారంటూ గ్రామ సర్పంచి మేడా రమణ ఎంపీడీవోకు ఫిర్యాదు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Published : 23 Jan 2022 04:01 IST

ఎంపీడీవో రాజేష్‌కు సమస్య వివరిస్తున్న సర్పంచి మేడా రమణ, ఉపసర్పంచి రమాదేవి, వార్డు సభ్యులు నాగభూషణమ్మ, శివపార్వతి, మహాలక్ష్మి

పెదకూరపాడు, న్యూస్‌టుడే: పెదకూరపాడు మండలం గారపాడులో ప్రోటోకాల్‌ వివాదం నెలకొంది. తనకు తెలియకుండా ఈ నెల 20న సమావేశం నిర్వహించారంటూ గ్రామ సర్పంచి మేడా రమణ ఎంపీడీవోకు ఫిర్యాదు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఆమె మీడియాకు తెలిపిన వివరాల మేరకు ‘ఎస్టీ కులానికి చెందిన తాను తెదేపా మద్దతుతో సర్పంచిగా విజయం సాధించాను. అప్పటి నుంచి స్థానిక వైకాపా నేతలు రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. అభివృద్ధి, సంక్షేమానికి అడ్డుతగులుతున్నారు. అకారణంగా కార్యదర్శి సురేష్‌ను విధుల నుంచి తప్పించారు. అధికార పార్టీకి అనుకూలమైన వ్యక్తిని ఇన్‌ఛార్జి కార్యదర్శిగా నియమించుకున్నారు. ఈ నెల 20న అత్యవసర సమావేశం ఉందంటూ ఇన్‌ఛార్జి కార్యదర్శి సాతులూరి రమేష్‌ వార్డు సభ్యులకు 19వ తేదీ రాత్రి నోటీసులు అందజేశారు. తనకు కనీస సమాచారం ఇవ్వలేదు. ప్రోటోకాల్‌ పాటించకుండా తనను అవమానానికి గురిచేశారంటూ’ శుక్రవారం రాత్రి వార్డు సభ్యులతో కలిసి ఎంపీడీవో రాజేష్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక వైకాపా నేతలు అనుసరిస్తున్న వైఖరిపై గతంలో డీపీవో కేశవరెడ్డి, డీఎల్‌పీవో లక్ష్మణరావును కలిసి మొర పెట్టుకున్నా ఫలితం లేదని వాపోయారు. చెక్‌ పవర్‌ రద్దు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై గారపాడు గ్రామ ఇన్‌ఛార్జి కార్యదర్శి రమేష్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం 90 రోజుల లోపు పంచాయతీ సమావేశం నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ నెల 20న సమావేశం ఉందంటూ వార్డు సభ్యులకు నోటీసులు అందజేయగా కొందరు తిరస్కరించారని తెలిపారు. సర్పంచి అజెండా ఇస్తే మరోమారు సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని