AP News: రండి చర్చిద్దాం.. పీఆర్సీ సాధన సమితి నేతలకు మంత్రుల ఫోన్‌

పీఆర్సీ జీవోలపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళనలు కొనసాగిస్తు్న్న వేళ.. పీఆర్సీ సాధన సమితి నేతలతో చర్చలకు ప్రభుత్వం..

Updated : 24 Jan 2022 06:04 IST

ప్రతిపాదనను తిరస్కరించిన ఉద్యోగ సంఘాల నేతలు

అమరావతి: పీఆర్సీ జీవోలపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళనలు కొనసాగిస్తున్న వేళ.. పీఆర్సీ సాధన సమితి నేతలతో చర్చలకు ప్రభుత్వం ఆహ్వానించింది. ఉద్యోగ సంఘాల నేతలకు మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని ఫోన్‌ చేసి సంప్రదింపులకు రావాలని కోరారు. విజయవాడ రెవెన్యూ భవన్‌లో ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు సమావేశమై రేపు సీఎస్‌కు ఇవ్వనున్న సమ్మె నోటీసు, ఉద్యమ కార్యాచరణ సహా ఇతర అంశాలపై చర్చించారు. ఈ సమయంలోనే మంత్రుల నుంచి ఉద్యోగ సంఘాల నేతలకు ఫోన్‌ వచ్చింది. సమ్మె నోటీసు ఇవ్వొద్దని.. సామరస్య పూర్వకంగా ప్రభుత్వంతో సంప్రదింపులకు రావాలని బొత్స సత్యనారాయణ, పేర్ని నాని కోరారు. ఈ ప్రతిపాదనను ఉద్యోగ సంఘాల నేతలు తిరస్కరించారు. పీఆర్సీ జీవోలను రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని మంత్రులకు తేల్చి చెప్పారు.

ప్రారంభమైన స్టీరింగ్‌ కమిటీ సమావేశం..

మరోవైపు పీఆర్సీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం ప్రారంభమైంది. సమ్మె నోటీసు, ఉద్యమ కార్యాచరణపై సంఘాల నేతలు చర్చిస్తున్నారు. ఈ భేటీలో ఉద్యోగ సంఘాల అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  స్టీరింగ్‌ కమిటీ సమావేశం అనంతరం రేపటి సమ్మె నోటీసు వివరాలు సహా భవిష్యత్‌ కార్యాచరణను వెల్లడించే అవకాశముంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని