logo

గుంటూరు వాహినిలో మునిగి ఇద్దరు బాలురు మృతి

సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత పాతమంగళగిరి దిగుడుబావి వద్ద నివాసం ఉంటున్న కుటుంబాలకు చెందిన ముగ్గురు పిల్లలు గుంటూరు వాహిని వద్దకు వెళ్లారు. రత్నాలచెరువు ప్రాంతంలో

Published : 24 Jan 2022 04:12 IST

మంగళగిరి, న్యూస్‌టుడే: సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత పాతమంగళగిరి దిగుడుబావి వద్ద నివాసం ఉంటున్న కుటుంబాలకు చెందిన ముగ్గురు పిల్లలు గుంటూరు వాహిని వద్దకు వెళ్లారు. రత్నాలచెరువు ప్రాంతంలో వంతెనకు దిగువున కాలువలో ఈతకు దిగారు. కొద్ది సేపటికే వారు నీటి ఉద్ధృతికి కొట్టుకుపోతుండగా అక్కడే ఉన్న ట్రాన్స్‌జెండర్స్‌ వీరిని కాపాడే ప్రయత్నం చేశారు. ఒక బాలుడ్ని క్షేమంగా బయటకు తీశారు. షేక్‌ మస్తాన్‌(13), షేక్‌ మున్సూర్‌ అక్మల్‌ (12)లు గల్లంతయ్యారు. సమాచారం తెలిసి డీఎస్పీ రాంబాబు, సీఐ అంకమ్మరావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. విపత్తు నివారణ దళం సిబ్బంది వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు 4 గంటలకు పైగా శ్రమించిన తర్వాత బాలుర మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను ఎన్‌ఆర్‌ఐ జనరల్‌ ఆస్పత్రికి శవపరీక్ష కోసం తరలించారు.

రెండు కుటుంబాల్లో విషాదం

బాలుర మృతి పాత మంగళగిరిలోని రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. తమ పిల్లలు ఈత సరదాతో కాలువకు వెళ్లి తిరిగి రాని లోకానికి వెళ్లిపోయారంటూ తల్లిదండ్రులు రోదించారు.

కారు మెకానిక్‌గా పనిచేసే షేక్‌ తాజుకు ఇద్దరు మగపిల్లలు. ఆ కుటుంబం ఇటీవలే నవులూరు నుంచి వచ్చి పాతమంగళగిరిలో అద్దె ఇంటిలో ఉంటోంది. షేక్‌ మస్తాన్‌ 8వ తరగతి చదువుతున్నాడు. ఇటీవలే పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకున్న మస్తాన్‌ ఊహించని రీతిలో మృతి చెందడంతో తల్లి కన్నీరుమున్నీరైంది. వస్త్ర దుకాణం గుమస్తా అయిన షేక్‌ ఈసాకు ఇద్దరు కుమారులు. చిన్నకుమారుడైన మున్సూర్‌అక్మల్‌ 7వ తరగతి చదుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు