logo

ఐక్య ఉద్యమానికి కార్యాచరణ

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సీపీఎస్‌ ఉద్యోగులు, పెన్షనర్లు, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు తీవ్ర నష్టం చేకూర్చే పీఆర్‌సీని రద్దు చేసి కొత్తది ప్రకటించేలా రూపొందించిన ఉద్యమ కార్యాచరణను

Published : 24 Jan 2022 04:34 IST

గుంటూరులో ఉద్యోగ సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం


నినాదాలు చేస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులు

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సీపీఎస్‌ ఉద్యోగులు, పెన్షనర్లు, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు తీవ్ర నష్టం చేకూర్చే పీఆర్‌సీని రద్దు చేసి కొత్తది ప్రకటించేలా రూపొందించిన ఉద్యమ కార్యాచరణను ఉద్యోగులు జయప్రదం చేయాలని ఏపీ జేఏసీ జిల్లా ఛైర్మన్‌, ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని ఏపీ ఎన్జీవోల సంఘం కల్యాణ మండపంలో ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఇతర ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాల నాయకులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఆదివారం జరిగింది. శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర పీఆర్‌సీ సాధన సమితి పిలుపు మేరకు పీఆర్‌సీ 2022 జీవోలను ప్రభుత్వం రద్దు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగించేందుకు సహకరించాలని కోరారు. ఈనెల 25వ తేదీ నుంచి జరగనున్న ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు, ర్యాలీల్లో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పాల్గొనేలా చూడాలన్నారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి చేపట్టనున్న నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఐక్యంగా పోరాటంలో పాల్గొనాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్‌డీ చాంద్‌బాషా మాట్లాడుతూ చీకటి జీవోలతో అందరికీ అన్యాయం జరిగినందున తమ సంఘం సభ్యులు పోరాటంలో పాల్గొంటారన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు భాస్కరరెడ్డి, ఏపీ జేఏసీ ఛైర్మన్‌ సంగీతరావు మాట్లాడుతూ పీఆర్‌సీలో ఫిట్‌మెంట్‌తో పాటు ఇంటి అద్దె భత్యం శ్లాబ్‌లను తగ్గించడంతో ఉద్యోగులకు అన్యాయం జరిగినందున ఉద్యమంలో పాల్గొంటామని వివరించారు. అనంతరం జిల్లాలో ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. సమావేశంలో ఎన్జీవోల సంఘం జిల్లా కార్యదర్శి సతీష్‌కుమార్‌, ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు.


* ఈనెల 25న ఉదయం పది గంటలకు నగరంలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి జిల్లా కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తారు. ● 26 మధ్యాహ్నం 3 గంటలకు ఎన్జీవో నుంచి లాడ్జి కూడలిలోని అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందజేస్తారు.

* 27, 28, 29, 30వ తేదీల్లో జిల్లా కలెక్టరు కార్యాలయం ఎదుట ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిలీ నిరాహార దీక్షలు చేయనున్నారు.

* జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల సహాయ నిరాకరణ కార్యక్రమం. ● ఫిబ్రవరి 3న జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు చలో విజయవాడ కార్యక్రమానికి వెళతారు. ● 7వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని