logo

అమ్మేశాక అనుగ్రహమెందుకు?

 చుండూరు మండలం వలివేరుకు చెందిన టి.శివారెడ్డి ఖరీఫ్‌లో 30 ఎకరాల్లో వరిసాగు చేశారు. పంట నిలువు మీద ఉండగానే ‘కంబైన్డ్‌ హార్వెస్టర్‌’తో కోత, నూర్పిడి ఒకేసారి చేయించారు. ఎకరాకు 30 బస్తాల చొప్పున 900 బస్తాల మేర దిగుబడి వచ్చింది.

Published : 24 Jan 2022 04:34 IST

ధాన్యం తేమ శాతం సడలింపులో తీవ్ర జాప్యం

భారీగా నష్టపోయిన అన్నదాతలు

వేమూరు, న్యూస్‌టుడే: చుండూరు మండలం వలివేరుకు చెందిన టి.శివారెడ్డి ఖరీఫ్‌లో 30 ఎకరాల్లో వరిసాగు చేశారు. పంట నిలువు మీద ఉండగానే ‘కంబైన్డ్‌ హార్వెస్టర్‌’తో కోత, నూర్పిడి ఒకేసారి చేయించారు. ఎకరాకు 30 బస్తాల చొప్పున 900 బస్తాల మేర దిగుబడి వచ్చింది. ఏ క్షణంలోనైనా వర్షం కురిసేలా వాతావరణం ఉండడంతో వెంటనే అమ్ముకోవాలని ఆర్బీకేకు వెళ్లారు. అక్కడి సిబ్బంది అప్పట్లో తేమ శాతం 17 కంటే ఎక్కువ ఉంటే ఆరబెట్టి, ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. దీంతో ఆయన చేసేది లేక ప్రైవేటు వ్యాపారులకు 75 కిలోల బస్తా రూ.1050 చొప్పున అమ్మేశారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.1470 మద్దతు ధరతో పోల్చుకుంటే ఈ రైతు బస్తాకు రూ.420 చొప్పున నష్టపోయారు. ఈ పరిస్థితి శివారెడ్డి ఒక్కరిదే కాదు.. జిల్లాలోని వందలాది మంది రైతులది. అనేక మంది అన్నదాతలు ఇప్పుడు ఈ విషయం తలుచుకొని ఖిన్నులవుతున్నారు.

* వ్యవసాయాధికారులు అందించిన వివరాల ప్రకారం జిల్లాలో 2.22 లక్షల హెక్టార్లలో వరిసాగు చేశారు. ఎకరాకు 27 బస్తాల చొప్పున దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ లెక్కన మొత్తం మీద 11.23 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుంది. అయితే సాగైన వరి విస్తీర్ణంలో 70 వేల హెక్టార్లలో పంటను కంబైన్డ్‌హార్వెస్టర్‌తో నిలువు మీదే నూర్పిడి చేయగా, మిగతాది సాధారణ పద్ధతిలో కోసి వరికుప్పలు వేసినట్టు రైతులు చెప్తున్నారు. అయితే యంత్రం సాయంతో నూర్పిడి చేసిన 90 శాతం ధాన్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు రూ.1000 నుంచి రూ.1050కి అమ్మేశారు.

బస్తాకు రూ.352 మేర కోల్పోయారు

వరిసాగు చేసిన 2.22 లక్షల హెక్టార్లలో 70 వేల హెక్టార్ల వరకు పంటను ‘కంబైన్డ్‌ హార్వెస్టర్‌’తో నూర్పిడి చేయగా, 3.54 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చింది. ఇందులో 10 శాతం ధాన్యాన్ని ఆరబెట్టి, 90 శాతం నూర్పిడి చేసిన వెంటనే ప్రైవేటు వ్యక్తులకు 75 కిలోల బస్తాను రూ.1020 చొప్పున విక్రయించారు. వీటిలో 22 శాతం తేమ ఉందనుకున్నా, అయిదు కిలోల చొప్పున తరుగు తీసినా రూ.98 తగ్గుతాయి. ఈ లెక్కన చూసుకున్నా బస్తాకు రూ.352 చొప్పున అన్నదాతలు నష్టపోయారు.


తాత్సారమే కొంపముంచింది

వాస్తవానికి గత ఏడాది డిసెంబరు మొదటి వారంలోనే కంబైన్డ్‌ హార్వెస్టర్‌తో నూర్పిళ్లు ప్రారంభమయ్యాయి. అయితే ఆర్బీకేల ద్వారా కొనుగోళ్లు మాత్రం డిసెంబరు నాలుగో వారంలో మొదలయ్యాయి. అప్పటికే యంత్రాల ద్వారా నూర్పిడి చేసిన కొందరు రైతులు గత్యంతరం లేని పరిస్థితిలో ప్రైవేటు వ్యాపారులకు సరకు అమ్ముకున్నారు. అంతేకాదు కొనుగోళ్లు ప్రారంభమైన తరవాత కూడా సిబ్బంది 17 శాతం కన్నా తేమ ఎక్కువగా ఉంటే ధాన్యం ఆరబెట్టుకుని తీసుకురావాలని అన్నదాతలకు సూచించడం, దీనికి తోడు మబ్బులు పట్టిన వాతావరణం రైతులను భయపెట్టింది. కళ్లాల్లో ధాన్యం ఉంచలేని పరిస్థితుల్లో దాదాపు అందరూ ప్రైవేటు వ్యక్తులకు పంటను విక్రయించారు. అయితే 17 శాతం కంటే తేమ ఎక్కువగా ఉంటే ఒక్కొక్క శాతానికి కిలో చొప్పున ధాన్యం కోతబెడుతూ, 22 తేమ శాతం వరకు 5 కిలోల తరుగుగా తీసివేసి కొనుగోలు చేయొచ్చని అధికారులు ఆలస్యంగా ఆదేశాలిచ్చారు. ధాన్యం అమ్మేసుకున్న తరవాత తేమ శాతంపై సడలింపు ఇచ్చారంటూ అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని