logo

రద్దీనియంత్రణపై దృష్టి

‘పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్లు విజయవాడ నగరంలోని రోడ్లు విస్తరణకు నోచుకోలేదు. దీనికి తోడు సొంత వాహనాలు కూడా ఇబ్బడిముబ్బడిగా పెరిగాయ. ఫలితంగా చాలా చోట్ల ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇది నగరవాసులకు ఇబ్బందిగా పరిణమిస్తోంది.

Published : 24 Jan 2022 05:25 IST
2, 3 నెలల్లో ట్రాఫిక్‌ సమస్యలు కొలిక్కి
‘ఈనాడు’తో నగర పోలీసు కమిషనర్‌ కాంతిరాణా టాటా
ఈనాడు, అమరావతి

‘పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్లు విజయవాడ నగరంలోని రోడ్లు విస్తరణకు నోచుకోలేదు. దీనికి తోడు సొంత వాహనాలు కూడా ఇబ్బడిముబ్బడిగా పెరిగాయ. ఫలితంగా చాలా చోట్ల ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇది నగరవాసులకు ఇబ్బందిగా పరిణమిస్తోంది. నియంత్రించడం పోలీసులకు కష్టసాధ్యంగా మారుతోంది. వీలైనంత వరకు ఈ కష్టాలను తీర్చేందుకు అన్ని మార్గాలనూ అన్వేషిస్తున్నాం.’ అని నగర పోలీసు కమిషనర్‌ కాంతి రాణా టాటా చెప్పారు. పనిచేయని సిగ్నళ్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు, ట్రాఫిక్‌ నియంత్రణ, సిబ్బందికి శిక్షణ, పక్కా పర్యవేక్షణ, తదితర బహుళ అంచెల వ్యూహంతో ముందుకు సాగుతామని ‘ఈనాడు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముఖాముఖి విశేషాలు ఆయన మాటల్లోనే...

తంతో పోలిస్తే నగరంపై వాహనాల ఒత్తిడి విపరీతంగా పెరిగింది. ప్రముఖుల రాకపోకలు కూడా హెచ్చాయి. బైపాస్‌ మార్గం లేకపోవడంతో విజయవాడలోకి వచ్చే వాటిని నియంత్రించడం కష్టంగా మారింది. బెజవాడలో 30కి పైగా ప్రధాన కూడళ్లు ఉన్నాయి. అన్నింటికీ ఒకే ప్రణాళిక కాకుండా, అవసరాలు, స్థానిక పరిస్థితుల మేరకు ఒక్కో కూడలికి ఒక్కో విధమైన వ్యహాన్ని సిద్ధం చేసుకున్నాం. ఈ మేరకు ప్రణాళికాబద్ధంగా సాగుతున్నాం. అక్కడి ప్రజల అవసరాలకు తగ్గట్లుగా ఆయా సర్కిళ్లలో మార్పులు, చేర్పులు చేస్తున్నాం. మహానాడు కూడలిపై అధిక రద్దీ పడుతోంది. నిర్మల, రమేష్‌ సర్కిళ్లలో తగ్గింది. ఆటోనగర్‌కు రాకపోకలు సాగించే భారీ వాహనాలను వివిధ మార్గాల్లో మళ్లించడం ద్వారా రద్దీని నియంత్రిస్తాం. రామవరప్పాడు కూడలి వద్ద వాహనాల రాకపోకల కోసం పలు మార్పులు చేస్తున్నాం.

బెంజి సర్కిల్‌లో ఆధునిక సిగ్నలింగ్‌ వ్యవస్థ

2016 - 17 కాలంలో నేను ట్రాఫిక్‌ డీసీపీగా పనిచేశా. ఆ సమయంలో చాలా మార్పులకు శ్రీకారం చుట్టా. ఆ అనుభవం.. ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దేందుకు ఉపయోగపడుతోంది. నగరపాలక సంస్థ కమిషనర్‌తో మాట్లాడి సిగ్నలింగ్‌ వ్యవస్థను ఆధునికీకరిస్తున్నాం. ఇప్పటికే పలుచోట్ల పనులు పూర్తయ్యాయి. మిగిలిన చోట్ల పురోగతిలో ఉన్నాయి. ప్రధాన కూడలి అయిన బెంజి సర్కిల్‌లో ఆధునిక సాంకేతిక సొబగులతో సిగ్నళ్లను ఏర్పాటు చేయనున్నాం. దీనికి రూ.20లక్షల నుంచి రూ.25లక్షల వరకు వ్యయం అవతుంది. ఈ డిజైన్లకు డీజీపీ గౌతం సవాంగ్‌ ఆమోదం తెలిపారు. ఇది పూర్తి అయితే ఐకానిక్‌ కూడలిగా నిలుస్తుంది. మొత్తం నెల రోజుల వ్యవధిలో అన్నింటినీ వినియోగంలోకి తెస్తాం.

* బందరు, ఏలూరు రోడ్ల వెంబడి అనేక వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. చాలా వాటికి పార్కింగ్‌ సదుపాయం లేదు. దీని వల్ల కొనుగోలుదారులు రోడ్లపైనే వాహనాలను నిలుపుతున్నారు. ఇటువంటి వాటికి నోటీసులు ఇవ్వనున్నాం. త్వరలో వారితో సమావేశం ఏర్పాటు చేస్తాం. పార్కింగ్‌కు యజమానులు చర్యలు తీసుకునేలా చూస్తాం.


ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగిస్తే మేలు

రోడ్లపై వాహనాల రద్దీ నియంత్రణ విషయంలో పోలీసులకు నగరవాసుల నుంచి సహకారం అవసరం. నగరం మధ్య నుంచి జాతీయ రహదారి వెళ్తోంది. అవసరమైతేనే దీనిపైకి రావాలి. వీలైనంత వరకు దీనికి రెండు వైపులా సమారతరంగా ప్రత్యామ్నాయ రహదారులు ఉన్నాయి. వీటిని ఎక్కువ ఉపయోగించుకుంటే అనవసరమైన సమస్యలు ఎదురుకావు. మొగల్రాజపురం నుంచి అమ్మ కల్యాణమండపం - ఈఎస్‌ఐ రోడ్డు, గుణదల మీదుగా వెళ్తే.. నేరుగా రమవరప్పాడు రింగ్‌ వద్ద జాతీయ రహదారి ఎక్కొచ్ఛు పటమట నుంచి జాతీయ రహదారి ఎక్కేందుకు బెంజి సర్కిల్‌ రాకుండానే హైటెన్షన్‌ రోడ్డును వినియోగించుకోవచ్ఛు ఇందుకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో అందరికీ తెలిసేలా సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయనున్నాం. అనుకున్న విధంగా మార్పులు కొలిక్కి వస్తే.. ఐదు నిమిషాల కంటే ఎక్కువ సేపు జామ్‌ కాకుండా చూడొచ్ఛు ట్రాఫిక్‌పై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నా. పలు కూడళ్లలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నా. వచ్చే రెండు, మూడు నెలల్లో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని