logo

నగరపాలకకు చిక్కిన రూ.8కోట్ల ఆస్తి

రెండున్నర దశాబ్దాల నుంచి ఒక వ్యక్తి చేతిలో ఉన్న రూ.కోట్ల విలువైన భూమిని ఎట్టకేలకు నగరపాలక సంస్థ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం అక్కడ ఉన్న మార్కెట్‌ ధర ప్రకారం చూస్తే దాని విలువ సుమారు రూ.8 కోట్లు ఉంటుందని అంచనా.  ఆ భూమిలో వెంటనే పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడేలా అదనపు తరగతి గదుల నిర్మాణాలు చేపట్టాలని మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు ఇంజినీరింగ్‌ అధికారులను సోమవారం ఆదేశించారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వాటిని అధిగమించి  ఆ భూమిలో

Published : 25 Jan 2022 03:51 IST

ఈనాడు-అమరావతి

స్వాధీనం చేసుకున్న స్థలాన్ని డిప్యూటీ మేయర్లతో కలిసి పరిశీలిస్తున్న మేయర్‌ కావటి

రెండున్నర దశాబ్దాల నుంచి ఒక వ్యక్తి చేతిలో ఉన్న రూ.కోట్ల విలువైన భూమిని ఎట్టకేలకు నగరపాలక సంస్థ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం అక్కడ ఉన్న మార్కెట్‌ ధర ప్రకారం చూస్తే దాని విలువ సుమారు రూ.8 కోట్లు ఉంటుందని అంచనా.  ఆ భూమిలో వెంటనే పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడేలా అదనపు తరగతి గదుల నిర్మాణాలు చేపట్టాలని మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు ఇంజినీరింగ్‌ అధికారులను సోమవారం ఆదేశించారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వాటిని అధిగమించి  ఆ భూమిలో ఉన్న షెడ్లను కూల్చేసి నగరపాలకకు దక్కేలా చేయటంలో మేయర్‌ క్రియాశీలకంగా వ్యవహరించారు. గతంలో అధికార యంత్రాంగం దృష్టిపెట్టకపోవడంతో ఆక్రమిత వ్యక్తి అందులో వానపాముల కేంద్రం ఏర్పాటు,  స్వచ్ఛంద సంస్థలకు శిక్షణ ఇచ్చే కార్యకలాపాలు నిర్వహించారని తెలుస్తోంది. అధికారుల నిర్లక్ష్యంపై వివరణ కోరాలని డిప్యూటీ మేయర్‌ వజ్రబాబు మేయర్‌ను కోరారు. ఆ స్థలంలో ఉన్న భవనాలకు సైతం నగరపాలక నుంచే కరెంటు బిల్లులు చెల్లింపులు చేసినట్లు తన దృష్టికి వచ్చిందని, వాటన్నింటిపై పరిశీలన చేస్తున్నామని కావటి చెప్పారు.  ఈ స్థలంలోకి ఇతరులు ప్రవేశించి భారీగా కట్టడాలు నిర్మించుకుని ఏళ్ల తరబడి అనుభవిస్తున్నా పట్టించుకోని ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని మేయర్‌ కావటి తెలిపారు.

ఆ భూమి కేటాయింపునకు కౌన్సిల్‌ ఆమోదం లేదు
నగరంలోని కేవీపీ కాలనీలో కొల్లి శారద మున్సిపల్‌ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాల పక్కనే సుమారు 4500 గజాల  స్థలం ఉంది  దాన్ని 1996-97లో అప్పటి నగరపాలక అధికారి ఒకరు ఓ వ్యక్తికి తాత్కాలికంగా కార్యకలాపాలు చేసుకోవటానికి అనుమతిచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కౌన్సిల్‌ తీర్మానాలు లేవు. అంత పెద్ద స్థలం కేటాయించాలంటే కచ్చితంగా దానికి కౌన్సిల్‌ ఆమోదం ఉండాలి. న్యాయపరమైన సలహా తీసుకుని మూడు రోజుల క్రితం మేయర్‌  తెల్లవారుజామున 5 గంటలకు ఆ స్థలం వద్దకు చేరుకున్నారు. ముందే మందీమార్భలంతో వెళితే దాని నిర్వాహకులు కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటారని గోప్యత పాటించారు. ముగ్గురు అధికారులను పిలిపించుకుని, పక్కనే ఉన్న వెహికల్‌ షెడ్‌ నుంచి జేసీబీలు, పొక్లెయిన్లను రప్పించి కేవలం గంటన్నరలోనే వానపాముల కేంద్రం షెడ్లు, అతిథిగృహం కట్టడాలను నేలమట్టం చేయించారు. ఇది నగరపాలక ఆస్తి అని దీనిలోకి ఎవరైనా అనధికారికంగా ప్రవేశిస్తే శిక్షార్హులవుతారని నోటీసు బోర్డు పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఓ ప్రైవేటు వ్యక్తి కబంధ హస్తాల్లో స్థలం ఉంటే ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని మేయర్‌ను ఒకరిద్దరు కార్పొరేటర్లు కౌన్సిల్‌లో ప్రశ్నించడంతో చర్యలకు ఉపక్రమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని