logo

పెరిగింది కట్టాల్సిందే..!

కరోనాతో కుదేలై ఇంకా కోలుకోకముందే ఆస్తిపన్ను వడ్డన రూపంలో సామాన్యులపై భారం పడుతోంది. గడచిన ఏడాది ఏప్రిల్‌ 1వ తేది నుంచి ఆస్తిపన్నుపై 15 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్నుల భారం భవిష్యత్తులో ఉండబోతుంది. ఇప్పుడు చెల్లించే పన్నులతోపాటు రాబోయే రోజుల్లో పెరిగే పన్నులపై భవన యజమానులు ఆందోళన చెందుతున్నారు. కొన్నిచోట్ల పన్ను నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తొలి త్రైమాసికానికి పన్ను

Published : 25 Jan 2022 03:51 IST

ఏకంగా 15 శాతం పెంపుదల
యజమానులకు తాఖీదులు
న్యూస్‌టుడే- హిందూకాలేజీ కూడలి

రోనాతో కుదేలై ఇంకా కోలుకోకముందే ఆస్తిపన్ను వడ్డన రూపంలో సామాన్యులపై భారం పడుతోంది. గడచిన ఏడాది ఏప్రిల్‌ 1వ తేది నుంచి ఆస్తిపన్నుపై 15 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్నుల భారం భవిష్యత్తులో ఉండబోతుంది. ఇప్పుడు చెల్లించే పన్నులతోపాటు రాబోయే రోజుల్లో పెరిగే పన్నులపై భవన యజమానులు ఆందోళన చెందుతున్నారు. కొన్నిచోట్ల పన్ను నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తొలి త్రైమాసికానికి పన్ను చెల్లించిన వారికి ప్రత్యేకంగా మరో డిమాండ్‌ నోటీసు ఇస్తుండగా ఇప్పటివరకు అసలు పన్ను చెల్లించని వారికి కొత్తగా నిర్ణయించిన నోటీసు అందజేస్తున్నారు. ఎన్నికలు జరగాల్సిన తాడేపల్లి, మంగళగిరి, పొన్నూరు, బాపట్ల, నరసరావుపేట పట్టణాల్లో ఈ పెంపుదల నిర్ణయం ప్రస్తుతానికి పక్కనపెట్టారు. పాత విధానంలో వాటిలో పన్ను వసూలు చేస్తున్నారు. మిగిలినచోట ఈ నెలాఖరుకు డిమాండ్‌ నోటీసులు జారీచేసి మార్చి నెలాఖరుకు శతశాతం వసూళ్ల లక్ష్యాల్ని అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు.

గతేడాది జూన్‌ 5వ తేదికి గుంటూరు నగరంతోపాటు 12 పట్టణాల్లో 3,94,691 అసెస్‌మెంట్లు ఉండగా వాటి నుంచి ఆస్తిపన్ను రూపంలో  రూ.188.39 కోట్ల ఆదాయం పొందేలా డిమాండ్‌ నోటీసులు జారీ అయ్యాయి.

ఈ నెల 22వ తేది వరకు చూస్తే మంగళగిరి, తాడేపల్లి మినహాయించి మిగిలిన 10 పట్టణాలు, ఒక నగరంలో కలిపి 3,77,133 అసెస్‌మెంట్లు ఉండగా పన్ను వసూళ్ల లక్ష్యం రూ.185.78 కోట్లుగా ఉంది. దాచేపల్లి, గురజాల నగర పంచాయతీల్ని కలుపుకుంటే రూ.250 కోట్ల మేరకు ఆస్తిపన్ను రూపంలో ఆదాయం వస్తుందనే అంచనా ఉంది.

సత్తెనపల్లికి చెందిన శ్రీనివాసరావు ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు తన ఇంటికి రూ.1480 ఆస్తిపన్నుగా చెల్లించారు. తొలి, రెండో త్రైమాసికంలో కలిపి చెల్లించాల్సిన అదనపు పన్ను 15 శాతానికి నోటీసు అందింది.

గుంటూరుకు చెందిన రాము జీ+2 భవనం ఆస్తి మూలధన విలువ రూ.1.10 కోట్లుగా నిర్ణయించారు. ప్రస్తుతం ఆయన రూ.3,300 పన్ను చెల్లిస్తున్నారు. పెంచిన 15 శాతం కలుపుకుంటే రూ.3,786 చెల్లించాల్సి ఉంది. అయితే మూలధన విలువ ఆధారంగా పెంచిన పన్ను రూ.13,253కి చేరుకునే వరకు ఉంటుందంటే ఆందోళన పడుతున్నారు.

గుంటూరు నగరంతోపాటు తెనాలి, సత్తెనపల్లి, చిలకలూరిపేట, పిడుగురాళ్ల, రేపల్లె, మాచర్ల, వినుకొండలో డిమాండ్‌ నోటీసుల జారీ ముమ్మరంగా సాగుతోంది. సత్తెనపల్లిలో ఇప్పటికే 85 శాతం మందికి కొత్త పన్ను నోటీసులు అందజేశారు.

కొత్తగా నగర పంచాయతీలైన దాచేపల్లి, గురజాల వాసులకు పన్ను పోటు తప్పదు. నూతన పన్ను విధానంలోకి వారు రాబోతుండటంతో మొన్నటివరకు పదులు, వందల్లో ఉన్న ఆస్తిపన్ను ఇక నుంచి రూ.వేలల్లో ఉండబోతుంది.

2002 సంవత్సరం నుంచి నివాసగృహాలు.. 2007 నుంచి వాణిజ్య భవనాలకు పన్నుల పెంపుదల లేదు.  ఇక నుంచి ఏటా పన్నులు పెంచుకునే అవకాశాన్ని పురపాలక సంఘాలకు ప్రభుత్వం కల్పించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని