logo

రేగిన రాజకీయ కక్షలు!

పల్నాడులో రాజకీయ గొడవలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి.  ఇటీవల పెదకూరపాడు, నరసరావుపేట, మాచర్ల నియోజకవర్గాల్లో చోటుచేసుకున్న పలు ఘటనలే అందుకు నిదర్శనం. ఆదివారం అమరావతి మండలంలో తెదేపా-వైకాపా నాయకులు

Published : 25 Jan 2022 03:51 IST

ఈనాడు, గుంటూరు

ల్నాడులో రాజకీయ గొడవలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి.  ఇటీవల పెదకూరపాడు, నరసరావుపేట, మాచర్ల నియోజకవర్గాల్లో చోటుచేసుకున్న పలు ఘటనలే అందుకు నిదర్శనం. ఆదివారం అమరావతి మండలంలో తెదేపా-వైకాపా నాయకులు సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుని బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఇరుపార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేసినా కొందరు మాత్రం తప్పించుకుని రహదారి మీదకు దూసుకొచ్చారు. ఈక్రమంలో తెదేపాకు చెందిన జానీ వర్గీయులను పోలీసులు అడ్డుకోవడం, వారు పోలీసులను నెట్టుకుని ముందుకెళ్లే క్రమంలో ఒక్కసారిగా పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు.. తమ కార్యకర్తలనే లక్ష్యంగా చేసుకుని పోలీసులు లాఠీలకు పని చెప్పారని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. ఇరుపార్టీలు నాయకులు మూడు, నాలుగు రోజుల నుంచి  సమావేశాలు పెట్టుకుని అభివృద్ధి, మైనింగ్‌ అక్రమ వ్యవహారాలపై ఎవరేం చేశారో బహిరంగంగా చర్చిద్దామని సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. దీనిపై పోలీసులు ముందే అప్రమత్తమై ఉంటే బాగుండేది.  

మూడు రోజుల క్రితం నరసరావుపేట మండలం కేశానుపల్లిలో ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన తెదేపా ఫ్లెక్సీని ఎవరో చింపేశారు. దీంతో గ్రామంలో రాజకీయంగా భగ్గుమంది. దీనికి కారకులైన వ్యక్తులను గుర్తించాలని, అరెస్టు చేయాలని తెదేపా నాయకులు కోరుతున్నారు. ఇదే విషయమై మరోసారి ఆ గ్రామంలో సోమవారం ఉదయం వైకాపా-తెదేపా శ్రేణులు బాహాబాహీకి దిగాయి. పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని రహదారులపై ఉన్న వారిని తరిమేశారు. దీంతో ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగినా గ్రామంలో ఎప్పుడు ఏ పరిణామాలు చోటుచేసుకుంటాయోనని స్థానికులు ఆందోళన  చెందుతున్నారు.  జొన్నలగడ్డలో వైఎస్‌ఆర్‌ విగ్రహం మాయమైంది. దీనిపై ఇరు పార్టీలు ఆందోళలు, ధర్నాలు, రాస్తారోకోలతో రెండు రోజుల పాటు నరసరావుపేట, జొన్నలగడ్డ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.  

మాచర్లలో ఇటీవల తెదేపా నాయకుడు తోట చంద్రయ్యను దారుణంగా హత్య చేశారు. అ ఘటన మరవకుండానే మాచర్ల పట్టణంలో తెదేపా నాయకుడికి చెందిన ఓ వాహనం ఇంటి ముందు నిలిపి ఉంచగా దాన్ని ధ్వంసం చేశారు. ఇది వైకాపా కార్యకర్తల దుశ్చర్య అని తెదేపా నాయకులు ఆరోపించారు. అయితే దాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి బాధితుడి బంధువేనని గుర్తించామని పోలీసులు చెబుతున్నారు. తాగిన మైకంలో దీనికి పాల్పడ్డారని, వైకాపాకు చెందినవారు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొనలేదని ఇది రాజకీయ గొడవ కాదని వివరిస్తున్నారు. ఈ కేసులో నిందితుడిని గుర్తించామని పరారీలో ఉన్నారని పట్టుకుని కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని