logo

ఓటు.. భవితకు చోటు

భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శం. ప్రజాస్వామ్యానికి మూలస్తంభం ఎన్నికల వ్యవస్థ. భారత రాజ్యాంగం ఓటుహక్కుతో ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసే అవకాశాన్ని పౌరులందరికీ కల్పించింది. ఐదేళ్లకోసారి

Published : 25 Jan 2022 03:51 IST

సమర్థులను ఎన్నుకునేందుకు మనకున్న హక్కు

నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం

న్యూస్‌టుడే, చెరుకుపల్లి గ్రామీణ, సత్తెనపల్లి

భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శం. ప్రజాస్వామ్యానికి మూలస్తంభం ఎన్నికల వ్యవస్థ. భారత రాజ్యాంగం ఓటుహక్కుతో ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసే అవకాశాన్ని పౌరులందరికీ కల్పించింది. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవడంతో తాము కోరుకున్న పాలనను ప్రజలే తెచ్చుకోవచ్చు. మన తలరాతలను మార్చే నాయకులను ఓటునే వజ్రాయుధంగా చేసుకొని ఎన్నుకోవచ్చు. స్వేచ్ఛగా, బాధ్యతగా పౌరులే ఓటుహక్కుకు దరఖాస్తు చేసుకొని విజ్ఞతతో వినియోగించుకునే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించింది. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందనే విషయాన్ని ఓటు చాటుతుంది. జిల్లాలోని ఓటర్లను పరిశీలిస్తే మహిళలే ముందంజలో ఉన్నారు. ఎన్నికల్లో వారి పాత్ర కీలకంగా మారింది. ఓటుపై ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు ఏటా జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రజాస్వామ్య క్రతువులో ప్రతిఒక్కరూ భాగస్వాములైతేనే దీనికి సార్థకత ఉంటుందని విద్యావేత్తలు చెబుతున్నారు.

ఈ ధ్రువపత్రాలు ఉంటే..: 18 ఏళ్లు నిండిన పౌరులందరూ ఓటు హక్కు పొందేందుకు అర్హులు. ధ్రువపత్రాలన్నీ ఉంటే పది నిమిషాల్లో నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. ఫారం-6 దరఖాస్తు, పాస్‌పోర్టు సైజు ఫొటో, 18 ఏళ్లు నిండినట్లు వయసు ధ్రువీకరించే విద్యార్హత ధ్రువపత్రం.., అది లేకుంటే రేషన్‌ కార్డుతోపాటు ఆధార్‌ నకలు సమర్పిస్తే సరిపోతుంది. వాటిని తీసుకుని గ్రామంలో ఉండే బూత్‌ లెవల్‌ అధికారి(బీఎల్‌వో)కు అందజేయవచ్చు. తహశీల్దారు, పురపాలక సంఘ కార్యాలయాలు దగ్గర్లో ఉంటే అక్కడ ఓటుహక్కు కోసం దరఖాస్తు అందజేసి నిశ్చింతగా పొందవచ్చు.

ఒక్కో దేశంలో ఒక్కోలా..
ఆస్ట్రేలియాలో పౌరసత్వం ఉన్న 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు ఇస్తారు. ముందుగా ఆయా రాష్ట్రాల్లో ఓటు నమోదు చేసుకుని వినియోగించుకున్నాకే జాతీయ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతిస్తారట.

బెల్జియంలో జనాభా లెక్కల్లో పేరు నమోదు చేస్తే 18 ఏళ్లకు ఓటు హక్కును అధికారులే నమోదు చేస్తారు. ‌్ర ప్రాన్స్‌లో 2009 నుంచి ఆన్‌లైన్‌లో ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. 99 శాతం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకుంటారట.


మన చేతుల్లోనే భవిష్యత్తు
- పి.మురళీకృష్ణ, యువకుడు

ఓటు రూపంలో భవిష్యత్తుకు మనమే బాట వేసుకునే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించింది. ఓటు విలువపై విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. సమర్థులనే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునే మహత్తర అవకాశం ఎవరూ వదులుకోవద్దు. అర్హులందరూ ఓటు హక్కు పొంది, వినియోగించుకుంటే ప్రజాస్వామ్యం మరింత పటిష్ఠమవుతుంది. నేను ఓటు హక్కు పొందాను. ఎన్నికలు ఎప్పుడు జరిగినా రాజ్యంగాన్ని గౌరవిస్తూ ఓటు హక్కు వినియోగించుకుంటాను.  


ప్రజాస్వామ్యంలో పవిత్రమైంది
- పోలీసురావు, రెడ్‌క్రాస్‌ విభాగం కర్లపాలెం శాఖ ఛైర్మన్‌

ప్రజాస్వామ్యంలో ఓటు చాలా పవిత్రమైంది. సమాజాభివృద్ధికి మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటే వజ్రాయుధం. ఓటు హక్కు.. జన్మ హక్కు అని ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి. 18 ఏళ్లు నిండిన వారంతా ఓటు నమోదు చేసుకుంటే విశ్వసనీయత ఉన్న నేతను ఎంచుకునే అవకాశం ఉంది. పోలింగ్‌ రోజు ఓటు లేదని బాధపడటం కంటే ముందుగానే నమోదు చేసుకుని ఉంటే రానున్న ఎన్నికల్లో ఓ మంచి ప్రజాప్రతినిధిని ఎన్నుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని