logo

భారీగా కట్టారు.. తాళాలు వేశారు

‘విజయవాడ దుర్గగుడికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం కొండ దిగువనే కనకదుర్గానగర్‌లో నిర్మించిన 40 మరుగుదొడ్లను అందుబాటులోనికి తీసుకురావడం అధికారులకు సాధ్యం కావడం లేదు. పురుషులు, స్త్రీలకు వేర్వేరుగా ఉండేలా నిర్మించిన ఈ మరుగుదొడ్లకు ప్రస్తుతం తాళాలు వేయడంతో భక్తుల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. వీటికి సంబంధించిన అవుట్‌లెట్‌ విషయంలో వచ్చిన సమస్యను పరిష్కరించాల్సిందిపోయి.. పూర్తిగా వాటిని మూసేసి.. అధికారులు చోద్యం చూస్తున్నారు. వాటి

Published : 25 Jan 2022 03:51 IST

ఈనాడు, అమరావతి

కనకదుర్గానగర్‌లో నిర్మించిన మరుగుదొడ్లకు తాళం వేసి వాటి దగ్గర తాత్కాలిక ఏర్పాట్లు ఇలా..

‘విజయవాడ దుర్గగుడికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం కొండ దిగువనే కనకదుర్గానగర్‌లో నిర్మించిన 40 మరుగుదొడ్లను అందుబాటులోనికి తీసుకురావడం అధికారులకు సాధ్యం కావడం లేదు. పురుషులు, స్త్రీలకు వేర్వేరుగా ఉండేలా నిర్మించిన ఈ మరుగుదొడ్లకు ప్రస్తుతం తాళాలు వేయడంతో భక్తుల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. వీటికి సంబంధించిన అవుట్‌లెట్‌ విషయంలో వచ్చిన సమస్యను పరిష్కరించాల్సిందిపోయి.. పూర్తిగా వాటిని మూసేసి.. అధికారులు చోద్యం చూస్తున్నారు. వాటి ముందు నాలుగు తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు. విజయవాడ నగరపాలక, దేవాదాయశాఖల సిబ్బంది మధ్య ఏర్పడిన సమన్వయలోపమే దీనికి ప్రధాన కారణం.’

రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద దేవాలయమైన విజయవాడ దుర్గగుడికి నిత్యం 30వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. శని, ఆది వారాల్లో ఈ సంఖ్య రెట్టింపు ఉంటుంది. భక్తులకు సౌకర్యాలను కల్పించే విషయంలో దుర్గగుడి అధికారుల తీరుపై ఎప్పుడూ విమర్శలు వెల్లువెత్తుతూనే ఉంటాయి. గత నెలలో జరిగిన భవానీదీక్షల సమయంలో నిత్యం లక్షల మంది భక్తులొచ్చినా తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేసి నెట్టుకొచ్చారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇవి తప్ప చుట్టుపక్కల ఎక్కడా సరైన మరుగుదొడ్లు లేవు. అందుకే.. మహామండపం పక్కనే వీటిని పెద్ద సంఖ్యలో నిర్మించారు. దుర్గాఘాట్‌లో మున్సిపల్‌ మరుగుదొడ్లున్నా.. వాటికి రూ.10 నుంచి రూ.20 ఛార్జీ వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం తప్పనిసరి పరిస్థితుల్లో భక్తులు డబ్బులు చెల్లించి వాటినే వినియోగిస్తున్నారు.

దర్గా వద్ద సమస్య రావడంతో..
2016 పుష్కరాల సమయంలో నిర్మించిన శాశ్వత మరుగుదొడ్లకు సంబంధించిన అవుట్‌లెట్‌ను నగరపాలక సంస్థకు చెందిన డ్రైనేజీకి కలిపారు. కొండ దిగువున ఉన్న రెండు దర్గాల మధ్యలో నుంచి ఈ డ్రైనేజీ పైప్‌లైన్‌ వెళ్లేది. కేశఖండనశాల, విజయేశ్వరాలయం నుంచి వచ్చే నీరు కూడా ఈ డ్రైయిన్‌కే కలిపారు. తమకు ఇబ్బందికరంగా ఉందంటూ ఈ డ్రైయినేజీ పైప్‌లైన్‌, మ్యాన్‌హోల్‌ను దర్గా నిర్వాహకులు మూసేయడంతో అప్పటినుంచి సమస్య మొదలైంది. మరుగుదొడ్లను కలుపుతూ ప్రత్యేకంగా మరో డ్రైనేజీ లైన్‌ను వేసి భూగర్భ డ్రైయినేజీకి కలపాలని ప్రణాళికలు రూపొందించినా ఆ పనులను చేపట్టడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన ఈ 40 శాశ్వత మరుగుదొడ్లను భవానీదీక్షల సమయానికి అందుబాటులోనికి తీసుకొచ్చేందుకు వెంటనే చర్యలు చేపట్టమంటూ రాష్ట్ర మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, జిల్లా కలెక్టర్‌ సహా ఉన్నతాధికారులంతా వచ్చి ఆదేశించినా సమస్య పరిష్కారం కాలేదు. భవానీదీక్షలకు ముందు మంత్రి, కలెక్టర్‌ నివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌, ఆలయ ఈవో సహా అధికారులంతా వచ్చి వీటిని పరిశీలించారు. ప్రత్యేకంగా లైన్‌ను వేసి.. యూజీడీకి కలపాలంటూ నగరపాలక సంస్థ ఈఈని మంత్రి ఆదేశించారు. కానీ.. ఆ పనులను భవానీదీక్షల సమయానికి పూర్తిచేయకపోగా.. ఎప్పటికి చేస్తారో కూడా తెలియని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. తాము ఎంతగా చెబుతున్నా.. మున్సిపల్‌ అధికారులు చొరవ తీసుకోవడం లేదంటూ దుర్గగుడి సిబ్బంది పేర్కొంటున్నారు. దేవస్థానంలో ఏ వేడుక నిర్వహించినా.. లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. వారికి.. ఇవి తప్ప.. మరోచోట సరైన మరుగుదొడ్లు లేవు. సాధారణ రోజుల్లో వచ్చే భక్తులే మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకే.. వీటిని కనకదుర్గానగర్‌లో నిర్మించారు. కానీ.. వాటిని ఓ చిన్న సమస్య ఎదురవ్వడంతో  మూసేసి వదిలేయడం అధికారుల తీరుకు ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని