logo

కొవిడ్‌ బారిన రైల్వే సిబ్బంది

విజయవాడ రైల్వే ప్రధాన ఆసుపత్రిలో కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 10 రోజుల వ్యవధిలో కేసులు అమాంతం పెరగడంపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా రైలు డ్రైవర్లు, గార్డులు, టీటీఈలు

Published : 25 Jan 2022 03:51 IST

ఆసుపత్రుల్లో  పెరుగుతున్న బాధితులు

రైల్వేస్టేషన్‌, న్యూస్‌టుడే : విజయవాడ రైల్వే ప్రధాన ఆసుపత్రిలో కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 10 రోజుల వ్యవధిలో కేసులు అమాంతం పెరగడంపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా రైలు డ్రైవర్లు, గార్డులు, టీటీఈలు, విద్యుత్తు, ఆపరేటింగ్‌ సిబ్బంది సుమారు 100మందికిపైగా వైరస్‌ బారిన పడ్డారు.
ప్రతి రోజూ పెద్ద సంఖ్యలో అనుమానితులు రైల్వే ఆసుపత్రిలోని ఫీవర్‌ వార్డులో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. పలువురు ఉద్యోగులు, కుటుంబసభ్యులు హోమ్‌ క్వారంటైన్‌లో ఉంటూ వైద్యుల సూచనతో మందులు వాడుతున్నారు. బీ కొవిడ్‌ విజృంభిస్తుండడంతో అన్ని రైల్వే కార్యాలయాలు, డిపోలలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కార్యాలయాల్లోకి మాస్కులు లేనిదే అనుమతించొద్దని స్పష్టం చేశారు.  బీ కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారు ఆందోళనకు గురికాకుండా రైల్వే ఆసుపత్రిలో ప్రత్యేక హెల్ప్‌లైన్‌తో పాటు అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచాలని, క్వారంటైన్‌లో ఉంటున్న ఉద్యోగులు, పింఛనర్లు వారి కుటుంబసభ్యులకు ఇంటికే మందులు పంపేలా ఏర్పాట్లు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. బీ 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని కార్మిక సంఘ నాయకులు డీఆర్‌ఎం షివేంద్ర మోహన్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.  బీ కరోనా సోకిన చిన్న పిల్లల కోసం సంబంధిత వైద్య నిపుణుల ఫోన్‌ నంబర్లు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. దీర్ఘకాలిక రోగులకు ఇబ్బందులు కలగకుండా గతంలో మాదిరిగా ప్రతి నెలా ఇంటికి మందులు పంపే ఏర్పాట్లు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.


చిన్న అవుటపల్లిలో..

గన్నవరం గ్రామీణం: గన్నవరం మండలం చిన్నఅవుటపల్లి డా.పిన్నమనేని కొవిడ్‌ ఆసుపత్రితో పాటు, గూడవల్లి జిల్లా కొవిడ్‌ సంరక్షణ కేంద్రంలో రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిన్నా మొన్నటి దాకా 30 లోపు ఉన్న కొవిడ్‌ బాధితులు సోమవారం ఒక్కసారిగా 50కి చేరువయ్యారు. పిన్నమనేని ఆసుపత్రిలో వైరస్‌ బారినపడి ఇప్పటి వరకు 95 మంది రోగులు చేరగా.. 38 మంది సంపూర్ణ ఆరోగ్యంతో ఇళ్లకు వెళ్లగా, ఇద్దరు చొప్పున బదిలీ, హోంఐసోలేషన్‌కు తరలి వెళ్లారు. ఒకరు మృతి చెందగా.. కొత్తగా చేరిన ఐదుగురితో ప్రస్తుతం ఆసుపత్రిలో 47(మగ 27, ఆడ 18, చిన్నారులు 2) మంది చికిత్స పొందుతున్నారు. గూడవల్లి క్వారంటైన్‌ నుంచి కొత్తగా ముగ్గురు చేరగా.. ఏడుగురు డిశ్ఛార్జ్‌ అయ్యారు. కేంద్రంలో 43 మంది రోగులు ఉన్నట్లు నోడల్‌ అధికారిణి సరళాదేవి వివరించారు. జిల్లాలో కొత్తగా రెండు నియోజకవర్గాల వారీ క్వారంటైన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఉన్న 14 కేంద్రాలకు అదనంగా నందిగామ, పెనమలూరులో అదనంగా మరొక వంద పడకల కొవిడ్‌ సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని