ఉపాధ్యాయ వర్గాల్లో విషాదం
నివాళి అర్పిస్తున్న రేవూరి
నర్సంపేట, న్యూస్‌టుడే: పుట్టి పెరిగిన గ్రామం, స్నేహితులు, బంధువులతో అనుబంధం తెగిపోతుందని మనస్తాపానికి లోనై ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకోవడం గ్రామంతోపాటు ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. నర్సంపేట మండలం చంద్రాయపల్లికి చెందిన ఉప్పుల కొమురయ్య, అనంతమ్మ దంపతుల కుమారుడైన రమేశ్‌కు(మృతుడు) ఉత్తమ ఉపాధ్యాయుడనే మంచి పేరుంది. ప్రస్తుతం ఖానాపురం మండలం ధర్మరావుపేట శివారు బాలుతండా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. మృతుడికి భార్య.. కుమారుడు.. కుమార్తె.. ఉన్నారు. ఇటీవల చేపట్టిన బదిలీల నేపథ్యంలో ఆయన పొరుగు జిల్లా ములుగు బదిలీ కావడం జీర్ణించుకోలేకపోయారు. సున్నిత మనస్తత్వం గల ఆయన మానసిక క్షోభకు గురయ్యారు. విధుల్లో అంకితభావంతో పని చేసే ఆయన ఉపాధ్యాయ వర్గాల్లో రమేశ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. బదిలీతో పుట్టిన గ్రామంతో సంబంధాలు తెగిపోతాయని, తోబుట్టవులు, బంధువులు, సన్నిహితులు, బాల్యమిత్రులతో ఉన్న సంబంధాలు దూరమవుతాయని భావించారు. ఇన్నాళ్లు కలిసిమెలిసి ఉన్న వారు దూరం అవుతున్నారని జీర్ణించుకోలేక బలవన్మరణానికి ఒడిగట్టడం అందరినీ కలిచివేసింది.సొంత గ్రామంలో మంగళవారం సాయంత్రం బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.