ఆరోగ్య సర్వేలో ఆమె కీలకం
కరోనా కట్టడి.. వ్యాక్సినేషన్లో భాగస్వామ్యం
మెట్పల్లి, న్యూస్‌టుడే
మెట్పల్లిలో ఐసోలేషన్ కిట్ అందిస్తున్న వైద్యురాలు
కొవిడ్ మహమ్మారికి వెరవకుండా.. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా.. వైద్యసేవలు అందించడంలో జిల్లాలోని ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ ఉపాధ్యాయులు ముందుంటున్నారు. గత 22 నెలలుగా వైరస్ నియంత్రణ, టీకా, మందుల పంపిణీ, ఇతర ఆరోగ్య సమస్యలపై వారు అందిస్తున్న సేవలు అమూల్యం. కొవిడ్ రెండో దశలో క్షేత్రస్థాయిలో కట్టడి చేయడానికి సర్వే చేసి విజయవంతం అయ్యారు. ప్రస్తుతం మూడో దశ వైరస్ విజృంభిస్తుండడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు మళ్లీ జ్వర సర్వేకు సిద్ధమయ్యారు. ఓ వైపు ఇంటింటి సర్వే, మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 21 నుంచి 25 వరకు కొనసాగుతున్న సర్వే సందర్భంగా పలువురు ఆరోగ్య కార్యకర్తల సేవలపై ‘న్యూస్‌టుడే’ కథనం..
ఇంటింటికీ వెళ్తూ..
జిల్లాలో 18 మండలాలు, 5 పురపాలక సంఘాలు, 380 గ్రామపంచాయతీలు, 2.63 లక్షల నివాసాలున్నాయి. ఇంటింటా జ్వర సర్వే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లాలోని 234 మంది ఏఎన్ఎంలు, 1065 మంది అంగన్వాడీ ఉపాధ్యాయులు, 248 మంది ఆశా కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు మూడు రోజులుగా గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఆరోగ్య సమాచారం సేకరిస్తున్నారు. వివరాలు నమోదు చేస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు ఉంటే ఐసోలేషన్ కిట్లు ఇవ్వడంతోపాటు అవసరమైన సలహాలు, ఆరోగ్య సూచనలు అందిస్తున్నారు. మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా దాదాపు 30 వేలకు పైగా నివాసాల్లో సర్వే నిర్వహించారని తెలుస్తోంది.
మనో ధైర్యాన్ని కల్పిస్తున్నాం.. -లావణ్య, ఏఎన్ఎం, జగ్గాసాగర్
కరోనాపై అవగాహన, స్వీయ నియంత్రణతోనే అరికట్టగలం. చాలా మంది సరైన అవగాహన లేకపోవడంతో మొదటి, రెండో దశలో వైరస్ బారినపడ్డారు. గతేడాది ఆరోగ్య సర్వేలో ఇంటింటికి తిరిగి ఔషధాలు పంపిణీ చేయడంతోపాటు ప్రజల్లో భయాన్ని పోగొట్టి మనో ధైర్యాన్ని కల్పించి కొవిడ్ నుంచి బయటపడేలా చేశాం. కుటుంబానికి దూరంగా ఉంటూ సేవలు అందించాం. మళ్లీ ఇప్పుడు తిరుగుతున్నాం. స్వల్ప లక్షణాలు ఉంటే ఐసోలేషన్ కిట్లు అందిస్తున్నాం. వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పిస్తూ టీకాలు తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. లనిత్యం ఉదయం 8 గంటల నుంచి సాయత్రం 5 గంటల వరకు విధుల్లో ఉంటున్నాం. రాత్రి ఇంట్లో ఆన్లైన్ పనులు చేస్తున్నాం.
ఫోన్‌కాల్స్‌కు స్పందిస్తున్నాం..
- బూరం రాజమణి, ఆశా కార్యకర్త, గోదూర్
ఒక్కోసారి భయం వేసినా కరోనా జాగ్రత్తలు తీసుకుటూ ఉదయం నుంచి రాత్రి వరకు విధుల్లోనే ఉంటున్నాం. ఏ సమయంలో, ఎలాంటి ఫోన్‌కాల్స్ వచ్చినా స్పందించి వైద్య సేవలు అందిస్తున్నాం. టీకాలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసి చైతన్యపరుస్తున్నాం. ఇబ్బందులు ఉన్నా పనిచేస్తున్నాం. మూడో సర్వేలో చాలా మందికి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇంటింటికీ వెళ్లి జ్వర లక్షణాలు ఉన్న వారికి కిట్ అందిస్తున్నాం.
నిర్లక్ష్యం చేయవద్దని చెబుతున్నాం..
-జాజాల గంగలక్ష్మి, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు మెట్పల్లి
గతంలో చేసిన ఇంటింటి సర్వే అనుభవంతో మూడో విడత సర్వే చేస్తున్నాం. మొదటి, రెండో దశ కొవిడ్ వచ్చిపోయిన తర్వాత చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. మాస్కులు ధరించడంలేదు. ఇప్పుడున్న పరిస్థితిలో నిర్లక్ష్యం చేయవద్దని చెబుతున్నాం. మీ వల్ల ఇతరులు నష్టపోతారని అవగాహన కల్పిస్తున్నాం. గుంపుగుంపులుగా ఉండవద్దని సూచిస్తున్నాం. సర్వేలో ఎక్కువగా జలుబు, జ్వరం లక్షణాలు ఉన్న వారు కనిపిస్తున్నారు. ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలతో కలిసి సర్వేలో హోం ఐసోలేషన్ కిట్లు అందిస్తున్నాం.