logo
Published : 26 Jan 2022 02:52 IST

ఇటుక బట్టీల్లో బూడిదవుతున్న చెట్లు!

వాల్టా చట్టానికి తూట్లు.. పర్యావరణానికి నష్టం..
భైంసా పట్టణం, న్యూస్‌టుడే

భైంసా-బాసర రహదారి పక్కన సరస్వతీనగర్‌ వద్ద కట్టెలతో కాల్చుతున్న ఇటుక బట్టీ

జిల్లాలో మట్టి ఇటుకల తయారీ పరిశ్రమలు జోరుగా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే వీటిలో నిబంధనలకు విరుద్ధంగా చెట్లను ఉపయోగించి ఇటుకలను కాలుస్తున్నారు. వాల్టా చట్టాన్ని అతిక్రమిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెట్లను ఇష్టానుసారంగా నరికి బట్టీలను కాల్చేందుకు వినియెగిస్తుండటంతో.. పర్యావరణానికి ముఖ్యంగా ప్రతిష్ఠాత్మక హరితహారం పథకానికి ముప్పుగా మారుతోంది. నానాటికి అంతరిస్తున్న అడవులను వృద్ధి చేసేందుకు రాష్ట్రప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించి మొక్కలను నాటిస్తూ ఆ పథకాన్ని కొనసాగిస్తున్న విషయం విదితమే. అయితే రెండు నెలల నుంచి బొగ్గు ధర భారీగా పెరగడంతో ఇటుక పరిశ్రమ యాజమాన్యాలు ప్రత్యామ్నాయంగా కట్టెల వినియోగం వైపు మొగ్గుచూపుతున్నాయి. దీంతో పెద్ద మొత్తంలో చెట్లను కొనుగోలు చేస్తూ వాటిని మొద్దులుగా కోసి బట్టీలకు వినియోగిస్తున్నారు.

దేగాం శివారులో ఇటుక బట్టీ వద్ద కాల్చేందుకు సిద్ధంగా ఉంచిన కట్టెలు

ముందస్తు అనుమతులు తప్పనిసరి
నిబంధనల ప్రకారం.. బట్టీ వ్యాపారులు ఇటుకలను బొగ్గుతో కాల్చాలి. కర్రను వినియోగించాల్సి వస్తే తుమ్మ, వేప చెట్లను మాత్రమే వాడాలి. అందుకు ముందస్తుగా ఇటుక పరిశ్రమల యాజమాన్యాలు తాము కొనుగోలు చేసే చెట్ల కోసం సంబంధిత భూ యజమానితో అవసరమైన చెట్ల సంఖ్య, పట్టాదారు పాసుపుస్తకం, లోకేషన్‌ మ్యాప్‌తో అటవీశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. వాల్టా చట్టం కింద ఒక్కో వృక్షానికి రూ.550 చొప్పున ప్రభుత్వానికి చలానా చెల్లించాలి. తదనంతరం అటవీ అధికారులు క్షేత్రస్థాయిలో.. వృక్ష పరిమాణం (పొడవు, వృత్తాకారం) పరిశీలించి దాని నుంచి లభించే మొత్తం కర్ర, తరలించే వాహన వివరాలతో 3-4రోజుల గడువుతో అనుమతి పత్రం జారీ చేస్తారు. జారీ పత్రం వస్తేనే.. నిర్ణీత గడువులోపే ఆ చెట్లను నరికి తరలించాలి.
కానీ జిల్లాలో నిబంధనల ప్రకారం జరగడం లేదు. బట్టీ యాజమాన్యాలు భూ యజమానుల వద్ద నామమాత్రపు ధరతో వివిధ రకాల చెట్లను కొనుగోలు చేసి ఇష్టానుసారంగా నరకివేస్తూ అక్రమంగా వినియోగిస్తున్నారు. 40-50సంవత్సరాల వయసు చెట్టుకు సుమారు ఏడు టన్నుల కర్ర లభిస్తుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే అవి లభించక అందుబాటులో ఉన్న 15-20 సంవత్సరాల చెట్లను యథేచ్ఛగా నరికివేస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కో బట్టీకి 10 చెట్లు కాలిబూడిదవుతున్నాయి. ఫలితంగా పర్యావరణానికి ముప్పు తప్పడం లేదు. అయితే జిల్లా వ్యాప్తంగా వృక్షాల నరికివేతకు అటవీశాఖ అధికారుల వద్ద 941 దరఖాస్తులు వచ్చినా.. అవి సామిల్లుల విక్రయం కోసం కావడం గమనార్హం. అందులోనూ చలాను చెల్లించి వృక్షాల నరికివేతకు అనుమతి పొందినవి 50శాతానికి మించలేదని అధికారులు పేర్కొంటున్నారు.

జిల్లాలో
* ఇటుకల పరిశ్రమలు : 150
* ఉత్పత్తిచేసే ఇటుకలు : సుమారు ఏడాదికి ఏడు కోట్లు
* బొగ్గుకు బదులు వాటి కోసం కాల్చుతున్న వృక్షాలు : సుమారు ఏడాదికి ఏడు వేలు
* ప్రభుత్వానికి వాల్టా చట్టం ప్రకారం చలానా కింద రావాల్సిన ఆదాయం : రూ. 38.50 లక్షలు
* వృక్షాల నరికివేతకు వచ్చిన దరఖాస్తులు : 941
* చలానా చెల్లించగా అనుమతి ఇచ్చినవి : 475
* వచ్చిన ఆదాయం : రూ.3.50 లక్షలు


నిరంతర తనిఖీలు
- రమేష్‌ రాఠోడ్‌, ఎఫ్‌ఆర్వో, భైంసా

ఇటీవల ఇటుక పరిశ్రమల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించాం. ఆరు బట్టీల వద్ద అనుమతి లేకుండా ఉన్న 162 బండ్ల నాన్‌టేక్‌ మొద్దులను పట్టుకుని రూ.లక్ష జరిమానా విధించాం. వృక్షాల నరికివేతకు అనుమతి పొంది నిర్ణీత గడువులోపు వినియోగించుకోవాలి. లేకుంటే కఠిన చర్యలు తప్పవు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని