logo

మాకొద్దీ పీఆర్సీ

మాట తప్పారు.. మోసం చేశారంటూ ఉద్యోగులు నినదించారు. ఉద్యోగుల పీఆర్‌సీ, ఫిట్‌మెంట్‌, తదితర ప్రయోజనాల విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పీఆర్‌సీ సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం వివిధ సంఘాల నాయకులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికవర్గాలు పెద్దఎత్తున పాల్గొని బందరు బస్టాండ్‌ సెంటరు నుంచి జిల్లా కోర్టు, లక్ష్మీటాకీసు కూడలి మీదుగా

Updated : 26 Jan 2022 04:43 IST

కదం తొక్కిన ఉద్యోగులు

మంగళవారం విజయవాడ ధర్నా చౌక్‌లో చీకటి పీఆర్సీలను రద్దు చేయాలని

ప్లకార్డులను ప్రదర్శిస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులు, మద్దతుగా

వచ్చిన వివిధ ట్రేడ్‌ యూనియన్ల నాయకులు

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: మాట తప్పారు.. మోసం చేశారంటూ ఉద్యోగులు నినదించారు. ఉద్యోగుల పీఆర్‌సీ, ఫిట్‌మెంట్‌, తదితర ప్రయోజనాల విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పీఆర్‌సీ సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం వివిధ సంఘాల నాయకులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికవర్గాలు పెద్దఎత్తున పాల్గొని బందరు బస్టాండ్‌ సెంటరు నుంచి జిల్లా కోర్టు, లక్ష్మీటాకీసు కూడలి మీదుగా ధర్నాచౌక్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. సీపీఎస్‌ రద్దు చేయాలి.. పాత హెచ్‌ఆర్‌ఏనే కొనసాగించాలి.. సమానపనికి సమాన వేతనం ఇవ్వాలి తదితర నినాదాలతో ప్లకార్డులు చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఉద్యోగులు చేసిన ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో పరిసర ప్రాంతాలు ప్రతిధ్వనించాయి. కలెక్టరేట్‌కు వెళ్లే దారిలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహించారు.

భారం ఎందుకవుతుంది.. ??: ట్రెజరీ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శోభన్‌బాబు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వమే జాప్యం చేస్తూ సమ్మెవరకు తీసుకెళ్తోందని అన్నారు. ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ నెల్సన్‌పాల్‌ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం అర్ధరాత్రి ఇచ్చిన ఆమోదయోగ్యం కాని మూడు జీవోలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం కాబట్టే ఇబ్బందులు పడకుండా పాతజీతాలు ఇవ్వమని అడుగుతున్నామనీ, ఉన్న వాటిలో కోతలు పెట్టి రికవరీలు చేయడం ఎప్పుడూలేదని అన్నారు.

బందరు ర్యాలీలో పాల్గొన్న వివిధ సంఘాల నాయకులు, ఉద్యోగులు


దద్దరిల్లిన బెజవాడ

విజయవాడలో ర్యాలీగా వెళ్తున్న ఉద్యోగులు

విజయవాడ (అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన చీకటి జీవోలను రద్దు చేయాలని, అప్పటి వరకు ప్రభుత్వంతో చర్చలకు వచ్చేది లేదని పీఆర్సీ సాధన సమితి నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు తేల్చి చెప్పారు. మంగళవారం విజయవాడ ధర్నా చౌక్‌లో పీఆర్సీ సాధన సమితి పశ్చిమ కృష్ణా ఆధ్వర్యంలో రివర్స్‌ పీఆర్సీని వ్యతిరేకిస్తూ ధర్నా నిర్వహించారు. తొలుత విజయవాడ పాత బస్టాండ్‌ నుంచి ధర్నాచౌక్‌ వరకు భారీ ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వ తీరును ఖండించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన ఉద్యోగులంతా కలిసి పాత బస్టాండ్‌ నుంచి చల్లపల్లి బంగ్లా, జీవోహెచ్‌ఆర్‌ఏ పార్కు, అలంకార్‌ సెంటర్‌ మీదుగా ధర్నా చౌక్‌కు చేరుకున్నారు. ఇక్కడ నిర్వహించిన ధర్నాకు ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సి.హెచ్‌.బాబూరావు మాట్లాడుతూ... ఈ ప్రభుత్వం ఉద్యోగులను విభజించు పాలించూ అనే పద్ధతిని అవలంబిస్తోందని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఇచ్చిన హామీలు అడిగితే.. ఇప్పుడు గొంతెమ్మ కోరికలు అంటారా? అంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి తాను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను గుర్తుచేస్తుంటే... ప్రభుత్వ సలహాదారుడు బెదిరిస్తున్నారని ఆరోపించారు. అప్పుడు ఉద్యోగుల పీఆర్‌సీ లోతు తెలియక ఇచ్చిన హామీ అని, రాష్ట్ర బడ్జెట్‌ తక్కువగా ఉందంటూ కొంటె సాకులు చెప్పడం దారుణమన్నారు. ప్రజలు, ఉద్యోగుల మధ్య ఆయన అగాధం సృష్టిస్తున్నారంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కాగ్‌ లెక్కలు నమ్ముతారా? లేక అధికారులు చెప్పిన లెక్కలు నమ్ముతారా? అంటూ నిలదీశారు. ప్రభుత్వంలోని ఒక పెద్ద మనిషి ‘ఉద్యోగులు... మీ భాష జాగ్రత్త’ అంటూ హెచ్చరిస్తున్నారని, మా హక్కుల సాధన కోసం ఎంతటి పోరాటానికైనా తెగిస్తామని పేర్కొన్నారు. అరెస్టులకు తాము వెనుకాడమని, ఎస్మా చట్టాన్ని ప్రయోగించినా... వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్‌ మాట్లాడుతూ.. ఇప్పటికే ఉద్యోగులంతా రోడ్డు పైకి వచ్చారని, ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో ప్యాప్టో ఛైర్మన్‌ జోసఫ్‌ సుధీర్‌బాబు, యూటీఎఫ్‌ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ పాండురంగ వరప్రసాద్‌, ఏపీటీఎఫ్‌ జిల్లా సెక్రటరీ ఖాసీం, యూటీఎఫ్‌ నగర సహ అధ్యక్షుడు కొండలరావు, ఎన్జీవో నగర సెక్రటరీ సంపత్‌ కుమార్‌, యూటీఎఫ్‌ నగర సెక్రటరీ పూర్ణచంద్రరావుతో పాటు వివిధ సంఘాలకు చెందిన 28 మంది ప్రముఖులు పాల్గొన్నారు.

ర్యాలీకి విశేష స్పందన

పాత బస్టాండ్‌ వద్ద మొదలైన ర్యాలీకి విశేష స్పందన లభించింది. ర్యాలీ పొడవునా భారీ సంఖ్యలో ఉద్యోగులు పాల్గొనడంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా బందోబస్తు నిర్వహించారు. ధర్నాచౌక్‌ ఉద్యోగులతో కిటకిటలాడింది.


ఉద్యమం తీవ్రతరం: వుల్లి కృష్ణ, ఏపీ జేఏసీ ఛైర్మన్‌

ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేవరకు ఉద్యమం కొనసాగించడంతోపాటు మరింత తీవ్రతరం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం ఇచ్చిన జీవోలన్నింటినీ తక్షణం ఉపసంహరించుకోవాలి. పీఆర్‌సీ సాధనసమితి చెప్పిన అంశాలను పరిష్కరిస్తే తప్ప చర్చలు కూడా ఉండవు. ఉద్యమంలో వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని వైద్యులు, నర్సులు, ఆర్టీసీ, మున్సిపల్‌, న్యాయశాఖ ఉద్యోగులు ఇలా అందరూ పాల్గొంటున్నారు.


వెనకడుగు వేయం : పి.రాము, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తూర్పు కృష్ణా అధ్యక్షుడు

మేము ఎందుకు సమ్మెలోకి వెళ్తున్నాం...ఏం కోరుకుంటున్నామో ప్రభుత్వం ముందు ఉంచాం. దానికి అనుగుణంగా స్పందించకపోతే వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమే అంటున్న పాలకులు వారి బాగోగులు పట్టించుకోకుండా రోడ్డున పడేస్తారా అని ప్రశ్నిస్తున్నాం. ఎప్పుడో ఇవ్వాల్సిన పీఆర్‌సీని ఏళ్లతరబడి జాప్యం చేస్తూ ఇప్పుడు ఏదో మేలు చేసినట్లు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని