సామాజిక మాధ్యమాల్లో చూసి.. చోరీలు చేసి..

సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చూసి చోరీలకు పాల్పడిన ఐదుగురు విద్యార్థులు నందిగామ పోలీసులకు చిక్కారు. మంగళవారం స్థానిక పోలీసుస్టేషన్లో సీఐ కనకరావు వెల్లడించిన

Updated : 26 Jan 2022 06:00 IST

పోలీసులకు చిక్కిన ఎనిమిదో తరగతి విద్యార్థులు

 నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను చూపిస్తున్న సీఐ
కనకారావు, ఎస్సై పండుదొర, సిబ్బంది

నందిగామ, న్యూస్‌టుడే: సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చూసి చోరీలకు పాల్పడిన ఐదుగురు విద్యార్థులు నందిగామ పోలీసులకు చిక్కారు. మంగళవారం స్థానిక పోలీసుస్టేషన్లో సీఐ కనకరావు వెల్లడించిన వివరాల ప్రకారం... నందిగామలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఐదుగురు ఎనిమిదో తరగతి విద్యార్థులు పాఠశాల సెలవు రోజుల్లో తాళాలు వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నారు. చోరీలు ఎలా చేయాలి... పోలీసుల నుంచి ఎలా తప్పించుకోవాలనే విషయాలను అంతర్జాలంలో చూసి తెలుసుకున్నారు. ఈనెల 22న కాకానినగర్‌లోని నల్లాని శ్రీనివాసరావు ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇంతలో మరో ఇంట్లో దొంగతనం చేస్తుండగా.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివరాలు రాబట్టారు. మొత్తం ఐదు ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీలు చేసినట్లు తేల్చారు. చోరీ చేసిన నగదును పంచుకున్నారు. ఒకరు రూ.పది వేలతో సెల్‌ఫోన్‌ కొన్నాడు. మిగిలినవారు చిరు తిండ్లు బాగా తిన్నారు. బంగారం గాజులు, ఉంగరాలను ఎలా అమ్మాలో తెలియక దాచిపెట్టారు. విద్యార్థుల నుంచి రూ.2,49,000 విలువ చేసే 4 బంగారం గాజులు, 3 ఉంగరాలు, వెండి పట్టీలు, 2 సెల్‌ఫోన్లు రికవరీ చేశారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లు ఆర్‌.నవీన్‌, పి.గోపాల్‌కు సీఐ కనకరావు రివార్డులు ఇచ్చి సత్కరించారు. ఎస్సై పండుదొర, ఏఎస్సై సామినేని నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని