logo

కృష్ణా ఇక రెండు జిల్లాలు

కొత్త జిల్లాల ఏర్పాటు కొలిక్కి వచ్చింది. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్‌లతో సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా జనాభా లెక్కలు సిద్ధం చేయాలని సూచించారు. ఆయా

Published : 26 Jan 2022 04:21 IST

ఈనాడు అమరావతి

కొత్త జిల్లాల ఏర్పాటు కొలిక్కి వచ్చింది. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్‌లతో సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా జనాభా లెక్కలు సిద్ధం చేయాలని సూచించారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల వివరాలు, ఆస్తుల వివరాలను ఇప్పటికే సమర్పించారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఒక్కో జిల్లాను పునర్విభజన చేయనున్నట్లు తెలిసింది. గతంలో దీనికి సంబంధించిన ప్రతిపాదనలను కలెక్టర్‌, సంయుక్త కలెక్టర్లు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. దీనిపై మరోసారి సీఎస్‌ చర్చించినట్లు తెలిసింది. భౌగోళిక స్వరూపంతో పాటు పాలనాపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నట్లు చెబుతున్నారు. మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లా, విజయవాడ కేంద్రంగా మరో జిల్లా ఆవిర్భవించనుంది.

భౌగోళిక స్వరూపం..!

ప్రస్తుతం కృష్ణా జిల్లా డెల్టా, సముద్ర తీర ప్రాంతం ఒకవైపు, మెట్టప్రాంతం మరోవైపు ఉంది. పశ్చిమకృష్ణా, తూర్పు కృష్ణాగా గుర్తింపు. కూచిపూడి నాట్యం పుట్టినిల్లు. కనకదుర్గమ్మ కొలువైన ప్రాంతం, జీవనది కృష్ణానది ప్రవహించి బంగారు పంటలు పండే ప్రాంతం. వ్యవసాయ రంగంలోనూ జిల్లా అగ్రగామి. కృష్ణా జిల్లా మొట్టమొదట 1859 ప్రాంతంలో ఏర్పడింది. నాడు రాజమండ్రి నుంచి విడిపోయి మచిలీపట్నం పేరుతో మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడింది. నాడు బందరు ఓడరేవుగా ప్రసిద్ధి చెందింది. తర్వాత 1904లో గుంటూరు జిల్లా నుంచి విడిపోయి కృష్ణా నది పేరుతో ఏర్పాటు అయింది. 1925లో కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రాంతాలను విడదీసి పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పాటు చేశారు. దీంతో మూడు సార్లు జిల్లా స్వరూపం మారిపోయింది.

జిల్లాలో మొత్తం 53 మండలాలు ఉన్నాయి. విజయవాడ గుడివాడ, నూజివీడు, బందరు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.

సర్వత్రా ఆసక్తి..!

విజయవాడ కేంద్రంగా జిల్లా ఏర్పాటైతే నగరాన్ని ఆనుకుని ఉన్న కొన్ని ప్రాంతాలు మచిలీపట్నం జిల్లాలోకి వెళ్లడం ఆసక్తి రేపుతోంది. పెనమలూరు నియోజకవర్గంలో ఉండే వైఎస్సార్‌ తాడిగడప పురపాలక సంఘం (కానూరు, యనమలకుదురు గ్రామ పంచాయతీలు) విజయవాడ నగరంలో భాగంగానే ఉంది. ఇవి మచిలీపట్నం జిల్లాలోకి చేరనున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం మచిలీపట్నం జిల్లా పరిధిలోకి వెళుతుంది. గన్నవరం నియోజకవర్గం గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు మండలాలతో పాటు విజయవాడ గ్రామీణ మండలం చేరింది. ఎనికేపాడు, గూడవల్లి, ప్రసాదంపాడు, నున్న పంచాయతీలు వాటి పరిధిలో ఉన్నాయి. దీంతో ఇవి మచిలీపట్నం జిల్లాలోకి వెళ్లనున్నాయి. విజయవాడ జిల్లా పరిధిలో తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, విజయవాడ నగరం పరిధిలోని తూర్పు, మధ్య, పశ్చిమ నియోజకవర్గాలు ఉన్నాయి.


స్వరూపం ఇలా!

మచిలీపట్నం జిల్లా

జిల్లా కేంద్రం : బందరు జనాభా: 17.35 లక్షలు

విస్తీర్ణం: 3775 చదరపు కిలోమీటర్లు

మండలాలు: 25 అసెంబ్లీ సెగ్మెంట్లు: గుడివాడ, పామర్రు, పెనమలూరు, గన్నవరం, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ

గుడివాడ డివిజన్‌: గతంలో 9 మండలాలు ఉండేవి. ప్రస్తుతం 13 మండలాలకు చేర్చారు. నూజివీడు నుంచి 5 మంలడలాలు కలిశాయి. నందివాడ, గుడ్లవల్లేరు, గుడివాడ, పెదపారుపూడి, ఉయ్యూరు, పమిడిముక్కల, బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు, విజయవాడ డివిజను నుంచి కంకిపాడు, పెనమలూరు, తోట్లవల్లూరు చేర్చారు. బందరు డివిజనులోని 12 మండలాలు యధాతథంగా ఉంచారు.


విజయవాడ జిల్లా

జిల్లా కేంద్రం: విజయవాడ జనాభా: 22.19లక్షలు

విస్తీర్ణం: 3316 చదరపు కిలోమీటర్లు

మండలాలు: 20 ప్రతిపాదిత రెవెన్యూ డివిజన్లు: నందిగామ, తిరువూరు అసెంబ్లీ సెగ్మెంట్లు: విజయవాడ తూర్పు, మధ్య, పశ్చిమ, తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట

మండలాలు: విజయవాడ రెవెన్యూ డివిజను: ప్రస్తుతం 18 ఉంటే ఆరుకి పరిమితం. ఇబ్రహీంపట్నం, విజయవాడతూర్పు, పశ్చిమ, ఉత్తర, సెంట్రల్‌, విజయవాడ గ్రామీణం

నందిగామ రెవెన్యూ డివిజను: ఏడు మండలాలు. నందిగామ వీరులపాడు, కంచికచర్ల, చందర్లపాడు, జగ్గయ్యపేట, వత్సవాయి. పెనుగంచిప్రోలు

తిరువూరు డివిజను: మైలవరం, జి.కొండూరు, రెడ్డిగూడెం, గంపలగూడెం, తిరువూరు. ఎ.కొండూరు


ఏలూరు జిల్లాలోకి..: కైకలూరు, నూజివీడు నియోజకవర్గాలు ఏలూరు జిల్లా పరిధిలోకి వెళ్లాయి.

కైకలూరు డివిజన్‌: గుడివాడ రెవెన్యూ డివిజనులోని మండలాలు మండవల్లి, కైకలూరు, కలిదిండి, ముదినేపల్లిలను ఏలూరు రెవెన్యూ డివిజనులో చేర్చారు. నూజివీడు రెవెన్యూ డివిజను అలాగే ఉంచి గతంలో 14 మండలాలు ఉన్నదాన్ని 6 మండలాలకు కుదించారు. అది ఏలూరు జిల్లా పరిధిలోకి వెళ్లింది. చాట్రాయి, ముసునూరు, నూజివీడు ఆగిరిపల్లిలను చేర్చారు. వీటితో పాటు ఏలూరు డివిజనులోని చింతలపూడి లింగమపాలెం మండలాలను చేర్చి ఆరు మండలాలతో సరిపెట్టారు.

విజయవాడ గ్రామీణ మండలంలో పరిధిలోని గూడవల్లి, నిడమానూరు, ఎనికేపాడు, ప్రసాదంపాడు, రామవరప్పాడు, నున్న, పాతపాడు, పి.నైనవరం, అంబాపురం పంచాయతీలు గన్నవరం అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో ఉన్నాయి. ఇవి మచిలీపట్నం లోక్‌సభ పరిధికిందకు వస్తాయి. వీటిని ఒక మండలంగా ప్రతిపాదించనున్నట్లు తెలిసింది. మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గొల్లపూడి, రాయనపాడు, పైడూరుపాడు, కొత్తూరు తాడేపల్లి, జక్కంపూడి పంచాయతీలు ఉన్నాయి. వీటిని ఇబ్రహీంపట్నం మండలంలోకి గానీ లేదా.. విజయవాడ గ్రామీణం మండలంగా ప్రతిపాదించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని