logo

నల్లపాడు సబ్‌రిజిస్ట్రార్‌పై అట్రాసిటీ కేసు

ఓ ఆస్తి రిజిస్ట్రేషన్‌ వ్యవహారమై చోటుచేసుకున్న స్వల్ప వివాదం పోలీస్‌స్టేషన్‌లో కేసుల నమోదు వరకు వెళ్లింది. ఈ వ్యవహారంలో ఇద్దరు అధికారులపై కేసులు నమోదయ్యాయి. రేఖ

Published : 26 Jan 2022 04:21 IST

ప్రకాశం జిల్లా పోలీసు అధికారిపైనా..

ఈనాడు, అమరావతి: ఓ ఆస్తి రిజిస్ట్రేషన్‌ వ్యవహారమై చోటుచేసుకున్న స్వల్ప వివాదం పోలీస్‌స్టేషన్‌లో కేసుల నమోదు వరకు వెళ్లింది. ఈ వ్యవహారంలో ఇద్దరు అధికారులపై కేసులు నమోదయ్యాయి. రేఖ ఆమె భర్త ముద్రబోయిన మాధవ్‌ ఆస్తి రిజిస్ట్రేషన్‌ కోసం ఇటీవల నల్లపాడు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లారు. రేఖ స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. ఆమె భర్త మాధవ్‌ నగరపాలకలో ఉద్యోగిగా ఉంటూ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని గుంటూరు ఏసీబీ అధికారులు 2018లో కేసు నమోదు చేసింది. దీంతో వారికి చెందిన ఆస్తులను ఏసీబీ కోర్టు ఎటాచ్‌చేసుకుంది. వాటి క్రయ, విక్రయాలకు తావు లేకుండా నిషేధం విధించింది. అయితే కోర్టు ఎటాచ్‌మెంట్‌లో లేని ఓ ఆస్తి రిజిస్ట్రేషన్‌ కోసం వెళితే సబ్‌రిజిస్ట్రార్‌ సుమలత తమను డబ్బులు డిమాండ్‌ చేశారని, ఇవ్వకపోవటంతో కక్షపూరితంగా రిజిస్ట్రేషన్‌ చేయలేదని ఈనెల 19న రేఖ, మాధవ్‌లు రిజిస్ట్రేషన్‌ డీఐజీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకుని సుమలత తామిచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని, లేకపోతే ఏసీబీ కేసు తిరగదోడించి బెయిల్‌ రద్దు చేయిస్తామని ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న ఓ పోలీసు అధికారితో ఫోన్‌లో తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారని పేర్కొన్నారు. తాము ఒత్తిళ్లకు తలొగ్గకుండా సాక్ష్యాధారాలతో సహా సౌత్‌ డీఎస్పీ జెస్సీ ప్రశాంతిని కలిసి అందజేశామని బాధితులు రేఖ, మాధవ్‌లు తెలిపారు. ఈ నెల 20న రాత్రి 6-7 గంటల మధ్య పదేపదే ఫోన్లు చేసినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. రేఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రాథమికంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశామని సౌత్‌ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి ‘ఈనాడు’కు తెలిపారు. పోలీసు అధికారిపై కేసు విషయమై అడగగా అందుకు సంబంధించి ఫిర్యాదుదారు అందజేసిన ఆధారాలను పరిశీలించాల్సి ఉందని, దర్యాప్తులో తేలిన అంశాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నల్లపాడు సబ్‌రిజిస్ట్రార్‌ ఇచ్చిన ఫిర్యాదుపైన కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని