logo

తెరపైకి 3 జిల్లాలు

కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ మళ్లీ తెరపైకి వచ్చింది. జిల్లాలో గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాలు జిల్లాల కేంద్రాలుగా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర

Published : 26 Jan 2022 04:21 IST

కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ మళ్లీ తెరపైకి వచ్చింది. జిల్లాలో గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాలు జిల్లాల కేంద్రాలుగా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర ఉన్నతాధికారులు మంగళవారం జిల్లా అధికారులతో కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చించారు. దీంతో ఈ విషయమై అధికారవర్గాల్లో చర్చ మొదలైంది. జిల్లా కేంద్రాల ఏర్పాటుపై కొంత స్పష్టత రావడంతో ఆయా జిల్లాల పరిధిలో రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై చర్చలు మొదలయ్యాయి.

ఈనాడు, అమరావతి

జిల్లా పరిధిలోని మూడు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో మూడు జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టరుతో రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు సమీక్షించారు. బాపట్ల, నరసరావుపేట, గుంటూరు కేంద్రాలుగా మూడు జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. బాపట్ల జిల్లాలో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లు రానున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న రెవెన్యూ డివిజన్ల పరిధి కుదింపు, పెంచడం జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ప్రతిపాదిత వివరాలు ఇలా ఉన్నాయి.

గుంటూరు జిల్లా.. గుంటూరు జిల్లా పరిధిలో ప్రస్తుతం ఉన్న గుంటూరు, తెనాలి కేంద్రంగా రెవెన్యూ డివిజన్లు కొనసాగిస్తారు. అయితే ఆయా డివిజన్ల పరిధిలో ఉన్న మండలాలు తగ్గనున్నాయి. రెండు డివిజన్లను 18 మండలాలతో ఏర్పాటు చేయనున్నారు. 2443 చదరపు కిలోమీటర్లతో ఏర్పడనుంది. ఇందులో 2011 జనాభా లెక్కల ప్రకారం 20.91 లక్షల మంది నివసిస్తున్నారు

పల్నాడు జిల్లా.. నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని 7 ఆసెంబ్లీ నియోజకవర్గాలతో కొత్తగా నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ఏర్పాటుచేయనున్నారు. 28 మండలాల పరిధిలో 7298 చదరపు కిలోమీటర్ల విసీ్తీర్ణంలో 20.42 లక్షల జనాభాతో జిల్లా ఏర్పాటుకానుంది. ఇక్కడ ఉన్న సబ్‌కలెక్టర్‌ కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాల భవనాలు పరిపాలనా కార్యాలయాలకు అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని పెదకూరపాడు, సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రస్తుతం గుంటూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఉన్నాయి. పెదకూరపాడులోని అన్ని మండలాలను గురజాల రెవెన్యూ డివిజన్‌ కిందకు తీసుకువస్తారు. అదే విధంగా గుంటూరు డివిజన్‌లోని సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్న మూడు మండలాలను నరసరావుపేట రెవెన్యూ డివిజన్‌లో కలుపుతారు.

బాపట్ల జిల్లా.. గుంటూరు, ప్రకాశం జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 మండలాలతో 3829 చదరపు కిలోమీటర్ల విసీ్తీర్ణంతో 15.87లక్షల జనాభాతో బాపట్ల కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయనున్నారు. బాపట్ల పార్లమెంటు పరిధిలోని సంతనూతలపాడు నియోజకవర్గాన్ని బాపట్ల జిల్లాలో కలపకుండా మినహాయించారు. సంతనూతలపాడు ఒంగోలు పట్టణానికి 20 కి.మీ.లోపలే ఉండటం, బాపట్లకు 83 కి.మీ. దూరంలో .ఒంగోలు జిల్లాలో కలపనున్నారు. బాపట్ల పార్లమెంటు పరిధిలో ఒక్క రెవెన్యూ డివిజన్‌ కూడా ప్రస్తుతం లేనందున బాపట్ల, చీరాల కేంద్రంగా రెండు డివిజన్లు ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదన ఉంది. తెనాలి డివిజన్‌లో ఉన్న వేమూరు, రేపల్లె, బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గాల మండలాలతో బాపట్ల డివిజన్‌, పర్చూరు, అద్దంకి, చీరాల అసెంబ్లీ నియోజకవర్గాలను ఒంగోలు నుంచి వేరుచేసి చీరాల డివిజన్‌ ఏర్పాటుచేసే అవకాశముంది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని