logo

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతుల దుర్మరణం

ఆర్టీసీ బస్సు, బొలెరో పికప్‌ (సరకు రావాణా వాహనం) ఢీకొని ఇద్దరు రైతులు దుర్మరణం పాలైన ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలంలో మంగళవారం చోటు చేసుకుంది..

Published : 26 Jan 2022 04:40 IST

సత్యన్న, జయారెడ్డి

దేవరక్రద గ్రామీణం, మరికల్‌, న్యూస్‌టుడే : ఆర్టీసీ బస్సు, బొలెరో పికప్‌ (సరకు రావాణా వాహనం) ఢీకొని ఇద్దరు రైతులు దుర్మరణం పాలైన ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలంలో మంగళవారం చోటు చేసుకుంది.. దేవరక్రద ఎస్సై భగవంతరెడ్డి కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లా మరికల్‌ మండలం రాకొండ గ్రామానికి చెందిన పాతర్‌చెడ్‌ సత్యన్న(49), అతడి తమ్ముడి కుమారుడు భరత్‌ మంగళవారం ఉదయం దేవరకద్ర మండలం డోకూరు సమీపంలో ఉన్న రైస్‌మిల్లుకు ధాన్యాన్ని బియ్యంగా మర ఆడించేందుకు బొలెరో వాహనంలో వెళ్లారు. తర్వాత బియ్యంతో రాకొండకు తిరుగు ప్రయాణమయ్యారు. దేవరక్రదలో సిలిండర్‌ తీసుకెళ్లేందుకు వచ్చిన రాకొండ గ్రామానికే చెందిన మిత్రుడు జయారెడ్డి(47)ని కూడా వాహనంలో ఎక్కించుకున్నారు. మార్గమధ్యంలోని దేవరకద్ర మండలం పెద్దగోప్లాపూర్‌ సమీపంలో ఎదురుగా వస్తున్న టీఎస్‌ ఆర్టీసీ బస్సును.. వీరి బొలెరో వాహనం ఢీకొంది. బొలెరో ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. బొలెరోలో ప్రయాణిస్తున్న రైతులు జయారెడ్డి, సత్యన్న అక్కడికక్కడే మృతిచెందారు. వాహనంలో వెనుక ఉన్న భరత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు భరత్‌ను చికిత్స నిమిత్తం 108 వాహనంలో మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. సత్యన్నకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు, జయారెడ్డికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు రైతులు చనిపోవటంతో రాకొండలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని