logo

అప్పుల బాధతో కౌలు రైతుల ఆత్మహత్య

పంట పోయింది, అప్పులు ఎక్కువయ్యాయన్న బాధతో అన్నదాత గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఫిరంగిపురం మండలంలో సోమవారం రాత్రి

Updated : 26 Jan 2022 04:22 IST

నారాయణరెడ్డి, రామచంద్రరావు (పాతచిత్రాలు)

ఫిరంగిపురం గ్రామీణం, న్యూస్‌టుడే: పంట పోయింది, అప్పులు ఎక్కువయ్యాయన్న బాధతో అన్నదాత గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఫిరంగిపురం మండలంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతానికి చెందిన పోలిరెడ్డి నారాయణరెడ్డి (62) 30 సంవత్సరాల క్రితం కుటుంబంతో ఫిరంగిపురం చేరుకొని కొత్తపేట కాలనీలో ఉంటున్నారు. నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇటీవల మిర్చి పంట వేశారు. అది తెగుళ్లు, వర్షాలకు దెబ్బతిని నష్టం వచ్చింది. పెట్టుబడులు, ఎరువులు, మందుల కోసం బ్యాంకులో బంగారం పెట్టి కొంత నగదు తీసుకున్నారు. బయటా కొంత అప్పు చేశారు. దాదాపు రూ.4 లక్షల వరకు అప్పులు చేరడంతో తీర్చడం ఎలాగన్న బాధతో సోమవారం ఉదయం గడ్డి మందు తాగారు. కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అదేరోజు రాత్రి ఆయన మరణించారు. మృతుడి కొడుకు అనిల్‌రెడ్డి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

సాగు కలిసిరాక..

గ్రామీణ సత్తెనపల్లి, న్యూస్‌టుడే: సాగు కలిసిరాక కౌలు రైతు బలవన్మరణం పొందిన ఘటన సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మారిశెట్టి రామచంద్రరావు (45) ఏడు ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి, పత్తి సాగు చేపట్టారు. నల్లి ఉద్ధృతితో మిర్చి, వరుస వర్షాలు, తేమతో పత్తికి పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి రాలేదు. వడ్డీతో కలిపి మొత్తం రూ.పది లక్షల వరకు అప్పులయ్యాయి. తీర్చే మార్గం లేక మనస్తాపానికి గురయ్యారు. సోమవారం రాత్రి పొలంలోనే గడ్డి మందు తాగి అచేతనంగా పడి ఉండగా కుటుంబ సభ్యులకు విషయం తెలిసింది. ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు. ఆయనకు భార్య శ్రీదేవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈమేరకు రామచంద్రరావు భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని