ప్రసవానికి ముందే పాప మృతి
హుజూర్‌నగర్: ఏరియా ఆసుపత్రి ఎదుట ఆందోళన చేస్తున్న పాప బంధువులతో మాట్లాడుతున్న ఎస్సై వెంకటరెడ్డి
హుజూర్‌నగర్, న్యూస్‌టుడే: ప్రసవానికి ముందే పాప మృతి చెందటానికి కారణం ఏరియా ఆసుపత్రి డాక్టరు నిర్లక్ష్యమే కారణమని మంగళవారం రాత్రి మృతి చెందిన పాప బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. చిలుకూరు మండలం జెర్రిపోతులగూడెంకు చెందిన పిండిప్రోలు లక్ష్మణ్ భార్య శ్రావణి గర్భవతి. శ్రావణి తల్లిదండ్రులది హుజూర్‌నగర్ కావటంతో ఏరియా ఆసుపత్రిలోనే మొదటి నుంచి పరీక్షలు చేయించుకుంటుంది. ప్రసూతి సమయం రావటంతో శ్రావణి సోమవారం ఆసుపత్రిలో చేరింది. మంగళవారం ఉదయం నుంచి నొప్పులు బాగా వస్తున్నాయని శ్రావణి ఆసుపత్రికి సిబ్బందికి చెప్పింది. ఆమెను పరీక్షించిన డాక్టర్ ఆమె ఆపరేషన్ అవసరం లేకుండా డెలివరీ అవుతుందని చెప్పి ఆమెను సముదాయించారు. సాయంత్రం వరకు నొప్పులు తీవ్రంగా ఉండటంతో తాము వేరే ఆసుపత్రికి పోతామని చెప్పి ఆసుపత్రి వారికి రాసిచ్చి పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి పోయారు. అక్కడ డాక్టర్ ఆమెకు శస్త్రచికిత్స కాకుండా ప్రసవం చేసి మృతి చెందిన పాపను బయటకు తీశారు. పాప చనిపోయిందని చెప్పటంతో పాప బంధువులు ఏరియా ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే చనిపోయిందని ఆందోళనకు దిగారు.
ఆసుపత్రి సూపరింటెండెంట్ వివరణ: శ్రావణికి మామూలు ప్రసూతి అయ్యే అవకాశం ఉండటంతో అందుకోసం ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే వారు తాము వేరే ప్రైవేటు ఆసుపత్రికి పోతామని చెప్పి రాసిచ్చి వెళ్లిపోయారని ఆసుపత్రి సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ తెలిపారు. ఆసుపత్రి నుంచి వారు బయటకు పోయేటప్పుడు కూడా పరీక్షించామని పాప గుండె చక్కగా కొట్టుకుంటుందని తెలిపారు. వారికి నచ్చచెప్పినా వినకుండా పోవటం వల్ల పాప చనిపోయింది.. ఆసుపత్రి డాక్టర్, సిబ్బంది నిర్లక్ష్యం ఏమి లేదని ఆయన స్పష్టం చేశారు.