నిరాడంబరంగా గణతంత్ర దినోత్సవం
ఈనాడు డిజిటల్, కామారెడ్డి: కొవిడ్ నేపథ్యంలో బుధవారం గణతంత్ర దినోత్సవాన్ని జిల్లా యంత్రాంగం సాదాసీదాగా నిర్వహించనుంది. ఏటా ఇందిరాగాంధీ స్టేడియంలో అట్టహాసంగా జరిగే కార్యక్రమాలను ఈసారి జిల్లా సమీకృత కార్యాలయాల భవనంపై నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లావ్యాప్తంగా కార్యాలయాలు, వ్యాపార సముదాయాల వద్ద కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకలు నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాలు జారీ చేశారు.
సభలు, సమావేశాలు రద్దు.. కొవిడ్ వైరస్ రోజురోజుకు వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో గణతంత్ర వేడుకల సందర్భంగా సభలు, సమావేశాలు నిర్వహించవద్దని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల భాగస్వామ్యం ఉండకూడదని నిర్దేశించారు. తేనీటి విందులు, అల్పాహారాలు వంటివి ఏర్పాటు చేయొద్దన్నారు.
కలెక్టరేట్లో.. ప్రభుత్వ ఆదేశాల మేరకు సమీకృత అధికారుల కార్యాలయం భవనంపై ఉదయం గం.10లకు జాతీయ పతాకాన్ని కలెక్టర్ ఆవిష్కరించనున్నారు. కేవలం జిల్లా అధికారులను మాత్రమే ఆహ్వానించారు.