Republic Day: ఏపీలో అన్నివర్గాల అభివృద్ధే లక్ష్యంగా పాలన: గవర్నర్ బిశ్వభూషణ్
విజయవాడ: ఏపీ వ్యాప్తంగా 73వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసు దళాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన శకటాల ప్రదర్శన జరిగింది. మొత్తం 16 శాఖలకు సంబంధించిన శకటాలను ప్రదర్శించారు.
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ‘నవరత్నాలు’ అమలు చేస్తోందని చెప్పారు. ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేరుస్తున్నామన్నారు. రైతు భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని.. వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలిచామని వివరించారు. అన్నివర్గాల అభివృద్ధే లక్ష్యంగా పాలన జరుగుతోందని చెప్పారు. మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్లు, ఆక్వా హబ్‌లు ఏర్పాటు చేశామని.. వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద నిధులు అందిస్తున్నామన్నారు. నాడు-నేడు కింద పాఠశాలలు, కళాశాలలను అభివృద్ధి చేస్తున్నామని.. పాఠశాలల్లో విద్యార్థులకు జగననన్న విద్యాకానుక కిట్లు అందజేస్తున్నామని గవర్నర్ వివరించారు.