Srinivas Goud: అవితప్పుడు ఆరోపణలు.. వారి పేర్లు త్వరలోనే బయటపెడతా: శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్: హైకోర్టు డిస్మిస్ చేసిన కేసులో కొందరు తనపై ఆరోపణలు చేస్తున్నారని తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తన ఎన్నికల అఫిడవిట్ వ్యవహారంపై కోర్టులో కేసు నడుస్తోందంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాజకీయంగా ఎదుర్కోలేని వారే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు.
తమకున్న ఆదరణ తట్టుకోలేకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలోనే తనపై కొందరు కుట్ర చేశారని చెప్పారు. తన పేరుతో ఉన్న మరో వ్యక్తితో నామినేషన్ వేయించారని.. కారు గుర్తును పోలి ఉన్న రోడ్డు రోలర్ గుర్తుతో పోటీ చేశారని మంత్రి ఆరోపించారు. బడుగు బలహీనవర్గాల నేతలంటే పెద్ద కులానికి చెందిన ఇద్దరు నేతలకు కంటగింపుగా ఉందని.. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారి పేర్లు త్వరలోనే బయటపెడతానని చెప్పారు.