logo

ప్రభుత్వ బడుల్లో సీబీఎస్‌ఈ బోధన

గ్రామీణ ప్రాంత విద్యార్థులు రానున్న విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ బోధన ఉచితంగా పొందనున్నారు. పిల్లలు సర్వతోముఖాభివృద్ధి సాధించే ఉద్దేశంతో ఈ విధానాన్ని తీసుకొస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని తొమ్మిది పాఠశాలలను ఎంపిక చేశారు.

Published : 27 Jan 2022 01:16 IST

జిల్లాలో తొమ్మిది పాఠశాలల ఎంపిక
న్యూస్‌టుడే, ఇబ్రహీంపట్నం గ్రామీణం

తరగతి గదిలో విద్యార్థులు

గ్రామీణ ప్రాంత విద్యార్థులు రానున్న విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ బోధన ఉచితంగా పొందనున్నారు. పిల్లలు సర్వతోముఖాభివృద్ధి సాధించే ఉద్దేశంతో ఈ విధానాన్ని తీసుకొస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని తొమ్మిది పాఠశాలలను ఎంపిక చేశారు. బడుల్లో బట్టీ విధానానికి, మూస పద్ధతికి స్వస్తి పలికి సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) సిలబస్‌ను అమలు చేయనున్నారు. 2022-23 విద్యా ఏడాది నుంచి ఎంపిక చేసిన చోట బోధన కొనసాగించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియపై జిల్లా విద్యాశాఖ, జడ్పీ వర్గాలు సంయుక్తంగా కసరత్తు ప్రారంభించాయి.
ఎంపికకు ప్రమాణాలు ఇవే..
సీబీఎస్‌ఈ అమలు చేయనున్న పాఠశాలకు సంబంధించి ముందుగా పది అంశాలను సిద్ధం చేసి కేంద్ర విద్యామండలికి నివేదించారు. పాఠశాలల గుర్తింపు, పది ఎకరాల స్థలం, భవన సముదాయం, ఫైర్‌ సేఫ్టీ ధ్రువపత్రం, పాఠశాల యాజమాన్య కమిటీ, ఈపీఎఫ్‌ గుర్తింపు సంఖ్య, ఎకో ఫ్రెండ్లీ వివరాలు, విద్యార్థుల సంఖ్య, బడిలోని గ్రంథాలయంలో ఉన్న పుస్తకాల వివరాలు, ఉపాధ్యాయుల విద్యా అర్హతలు, వెబ్‌సైట్‌ వివరాలు, రూ.50 వేలు దరఖాస్తు రుసుం తదితర వివరాలను కేంద్ర విద్యామండలికి తెలియజేయడంతో తొలి విడతగా తొమ్మిది పాఠశాలలను ఎంపిక చేశారు.
ప్రతిభకు ప్రోత్సాహం..
ప్రస్తుతం నడుస్తున్నది పోటీ ప్రపంచం.. ఈక్రమంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలంటే సీబీఎస్‌ఈ సిలబస్‌ చాలా అవసరం. అందుకోసమే దీన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు పాఠశాలల్లో అమలు చేయనున్నారు. గ్రామీణ పేద విద్యార్థులకు సైతం విశ్లేషనాత్మక బోధన అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్ని రకాల వనరులు ఉండి.. పిల్లలు సంఖ్య గణనీయంగా ఉన్న బడులను ఎంపిక చేసి అక్కడి వారికి ప్రతిభా పాఠవాలు నేర్పనున్నారు. మరోవైపు సీబీఎస్‌ఈ సిలబస్‌ వివరణాత్మకంగా ఉండటంతోపాటు.. 6వ తరగతిలో చేరిన విద్యార్థి ఇంటర్‌ వరకు చదువుకొనే అవకాశం ఉంటుంది. ఆయా విద్యాలయాల పర్యవేక్షణ కేంద్రం పరిధిలోకి వెళ్తుంది. విద్యార్థుల ఆసక్తి, అభిరుచిని గుర్తించి అన్ని రంగాల్లో వారిని ప్రోత్సహిస్తారు.
పేద విద్యార్థులకు వరం..
ఇప్పటి వరకు కార్పొరేట్‌, ఇతర ప్రత్యేక పాఠశాలల్లో అమలు చేస్తున్న సీబీఎస్‌ఈ సిలబస్‌ను రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లోకి తీసుకురావడం శుభపరిణామం. మరోవైపు పేద విద్యార్థులకు కూడా లభిస్తుంది. నిబంధనల మేరకు అన్ని వసతులున్న పాఠశాలల వివరాలను వైబ్‌సైట్‌లో నుంచే సీబీఎస్‌ఈ ఎంపిక చేసి సమాచారం అందించింది. పేద విద్యార్థులు జాతీయ స్థాయిలో పోటీపడటానికి అవకాశం ఏర్పడుతుంది. ఎంపిక చేసిన బడులను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. సబ్జెక్టుల వారీగా అవసరం మేరకు ఉపాధ్యాయులను నియమిస్తాం.

- తాహేరా సుల్తానా, జిల్లా విద్యాశాఖాధికారిణి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని