logo

జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయం

జిల్లా సమగ్రాభివృద్ధి సాధించడమే ధ్యేయంగా ముందుకు సాగుతామని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ పేర్కొన్నారు. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గుంటూరులో బుధవారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం చేశారు. అనంతరం జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై మాట్లాడారు.

Updated : 27 Jan 2022 05:38 IST

గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌


జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం వందనం చేస్తున్న జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్,
చిత్రంలో గ్రామీణ ఎస్పీ విశాల్‌గున్నీ, జేసీలు దినేష్‌కుమార్, రాజకుమారి, అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హాఫీజ్‌ తదితరులు 

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లా సమగ్రాభివృద్ధి సాధించడమే ధ్యేయంగా ముందుకు సాగుతామని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ పేర్కొన్నారు. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గుంటూరులో బుధవారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం చేశారు. అనంతరం జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై మాట్లాడారు. ‘జిల్లాలో కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు 84 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను గుర్తించి ఏడు వేల పడకలు ఏర్పాటు చేశామని కలెక్టర్‌ పేర్కొన్నారు.
వ్యవసాయం: వైఎస్సార్‌ రైతు భరోసా, ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పథకాల ద్వారా 6 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.748 కోట్లను అందించినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. ఉద్యాన శాఖలో వేర్వేరు పథకాల కింద రూ.19 కోట్లు పంటల అభివృద్ధికి కేటాయించామని, బ్యాంకుల ద్వారా ఖరీఫ్‌ సీజన్‌లో రూ.18 వేల కోట్లు రుణంగా ఇచ్చామన్నారు. నాబార్డు సహకారంతో నిజాంపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ రూ.450 కోట్లతో ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయన్నారు. 
రెవెన్యూ శాఖ: జిల్లాలో రూ.1240 కోట్ల విలువతో 6660 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూమిని సేకరించి లే అవుట్లు అభివృద్ధి చేసి మూడు లక్షల మందికి ఇంటి పట్టాలు అందజేశామన్నారు. విధి నిర్వహణలో చనిపోయిన వారి అర్హులైన కుటుంబ సభ్యులకు 115 మందికి ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించాం. 
గృహనిర్మాణ శాఖ: 586 వైఎస్సార్‌ జగనన్న కాలనీ లేఔట్లలో రూ.2280 కోట్ల ప్రాజెక్టుతో మంజూరు చేసిన 1.27 లక్షల గృహాలకు గాను 85 వేల గృహాల నిర్మాణం ప్రారంభించామని కలెక్టర్‌ తెలిపారు. జూన్‌ నాటికి నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. 


గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్యారోగ్యశాఖ
శకటం ముందు వైద్య సిబ్బంది వినూత్న ప్రదర్శన 

* ఉపాధి హామీ పథకం కింద ఇప్పటి వరకు 1.29 కోట్ల పనిదినాలను కల్పించి రూ.584 కోట్లను ఖర్చు చేశామని, 1214 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం ద్వారా 851 మంది రైతులు లబ్ధి పొందారన్నారు. 
సర్వే శాఖ: జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా జిల్లాలో ఐదు గ్రామాలను పైలెట్‌ గ్రామాలుగా ఎంపిక చేసి రీ-సర్వే పూర్తి చేసి అన్ని రికార్డులు తయారు చేసి ఎస్‌అండ్‌బీ చట్టం ప్రకారం 13వ నోటిఫికేషన్‌ను ప్రచురించామని పేర్కొన్నారు. 
జిల్లా పంచాయతీ శాఖ: జగనన్న స్వచ్ఛ సంకల్పం కింద రూ.19 కోట్లతో జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రమైన గ్రామాలుగా మార్పు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. 
* వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.1335 కోట్లతో ఐదు లక్షల మంది రోగులకు శస్త్రచికిత్సలు చేయించామని చెప్పారు. లక్ష మంది రోగులకు రూ.99 కోట్లతో కొవిడ్‌-19 చికిత్సలు అందించామని, ఆరోగ్య ఆసరా పథకం ద్వారా శస్త్ర చికిత్స అనంతరం రూ.56 కోట్లతో లక్షల మంది రోగులకు జీవనోపాధి భృతి అందించామని వివరించారు. 
*గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్యారోగ్యశాఖ శకటం ముందు వైద్య సిబ్బంది వినూత్న ప్రదర్శన
*పంచాయతీరాజ్‌ శాఖ: జిల్లాలో రూ.627 కోట్ల అంచనాతో 311 సచివాలయ భవనాలు, 138 రైతుభరోసా కేంద్రాలు, 346 పాఠశాలల ప్రహరీ గోడ పనులు, 96 వైఎస్సార్‌ క్లీనిక్‌లు పూర్తయ్యాయన్నారు.
*విద్యాశాఖ: నాడు నేడు కార్యక్రమం ద్వారా 1183 పాఠశాలల్లో రూ.289 కోట్లతో నూతన భవనాలు నిర్మాణం, పాఠశాల భవనాల ఆధునికీకరణ పనులు చేపట్టామని పేర్కొన్నారు.
* దివ్యాంగుల సంక్షేమ శాఖ ద్వారా విభిన్న ప్రతిభావంతుల బ్యాక్‌లాగ్‌ నియామకాల ద్వారా 22 మంది ఆఫీసు సబార్డినేట్లు, ఏడుగురు జూనియర్‌ సహాయకులుగా నియమించామని తెలిపారు. 
* వైఎస్సార్‌ పింఛను కానుక కింద పింఛను సొమ్మును రూ.2500కు పెంచడం ద్వారా నెలకు రూ.153 కోట్లను ఆరు లక్షల మంది పింఛనుదారులకు పంపిణీ చేశామని వెల్లడించారు. 
* జగనన్న తోడు పథకం ద్వారా 22 వేల మంది చిరువ్యాపారులకు రూ.10 వేలు చొప్పున రూ.22 కోట్ల రుణాలు అందించామని చెప్పారు.
* నెడ్‌క్యాప్‌ ద్వారా పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధిలో భాగంగా జిల్లాలో 244 గృహాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలకు 9.982 మెగావాట్ల సోలార్‌ రూఫ్‌ టాప్‌ సిస్టంలు నెలకొల్పామన్నారు. 
* ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా జిల్లాలో కొత్తగా నాలుగు లక్షల బియ్యం కార్డులు మంజూరు చేశామన్నారు. 901 మొబైల్‌ వాహనాలతో 15 లక్షల మంది బియ్యం కార్డుదారులకు ఇంటి వద్దకే నాణ్యమైన స్వర్ణరకం సార్టెక్స్‌ బియ్యం సరఫరా చేస్తున్నామన్నారు. జిల్లాలోని 739 రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 11 వేల మంది రైతుల నుంచి 70 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించామని వివరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని