logo

తల్లిని పలకరించి వెళ్తూ ఆర్‌ఎంపీ దుర్మరణం

తల్లి యోగ క్షేమాలు తెలుసుకుని.. ఆమెకు జాగ్రత్తలు చెప్పి తిరిగి విధులకు బయలుదేరిన కొడుకు దుర్మరణం చెందిన ఘటన తుళ్లూరు మండలం రాయపూడి పరిధి ఎమ్మెల్యే క్వార్టర్స్‌ సముదాయం పక్కనే ఉన్న సీడ్‌యాక్సిస్‌ రోడ్డులో చోటుచేసుకుంది.

Published : 27 Jan 2022 05:15 IST

లక్ష్మణస్వామి (పాత చిత్రం)

పెదకూరపాడు, తుళ్లూరు, న్యూస్‌టుడే: తల్లి యోగ క్షేమాలు తెలుసుకుని.. ఆమెకు జాగ్రత్తలు చెప్పి తిరిగి విధులకు బయలుదేరిన కొడుకు దుర్మరణం చెందిన ఘటన తుళ్లూరు మండలం రాయపూడి పరిధి ఎమ్మెల్యే క్వార్టర్స్‌ సముదాయం పక్కనే ఉన్న సీడ్‌యాక్సిస్‌ రోడ్డులో చోటుచేసుకుంది. అమరావతి మండలం ఎనికేపాడు గ్రామానికి చెందిన దేవరపల్లి లక్ష్మణస్వామి (41) విజయవాడలో ఆర్‌ఎంపీగా పని చేస్తున్నారు. స్వగ్రామంలో ఉంటున్న తల్లి మరియమ్మ వద్దకు ఆమె పెద్ద కుమారుడైన లక్ష్మణస్వామి వారానికి ఒకసారి వస్తుంటారు. అవసరమైన వైద్య సేవలు అందించి వెళ్తారు. మంగళవారం ఉదయం మాతృమూర్తి వద్దకు వచ్చిన ఆయన రాత్రి వేళ తిరిగి విజయవాడకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. సీడ్‌యాక్సిస్‌ రోడ్డులో వాహనం అదుపుతప్పి సిమెంట్‌ పైపును ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తుళ్లూరు ట్రాఫిక్‌ పోలీసులు బుధవారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తల్లడిల్లిన మాతృమూర్తి హృదయం: ‘అమ్మా..సమయానికి మందులు వేసుకో.. నేను, తమ్ముడు దగ్గర లేమని దిగులు చెందొద్దు..కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి.. ఇంట్లోనే జాగ్రత్తగా ఉండు’ అంటూ చెప్పి వెళ్లిన కుమారుడు మృతి చెందాడని తెలుసుకున్న ఆయన తల్లి కన్నీరుమున్నీరయ్యారు. ఆమె వేదనను చూసిన వారు కంట తడి పెట్టారు. లక్ష్మణస్వామికి భార్య జ్యోతి, కురురుడు, కుమార్తె ఉన్నారు. అమరావతి సామాజిక ఆరోగ్య కేంద్రంలో శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అందరితో కలివిడిగా ఉండే ఆయన మృతితో ఎనికేపాడు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని