logo

నేను సైతం..

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లైన నేపధ్యంలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ పేరిట దేశమంతటా విభిన్న కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా వీడియోలు, గీతాలు, సందేశాలు కూడా

Published : 27 Jan 2022 05:34 IST

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ ప్రత్యేక గీతాన్ని

ఆవిష్కరించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌
తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే

ప్రత్యేక గీతం లోగో

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లైన నేపధ్యంలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ పేరిట దేశమంతటా విభిన్న కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా వీడియోలు, గీతాలు, సందేశాలు కూడా ప్రసారమవుతున్నాయి. వాటిని వీక్షించిన తెనాలికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఈమని వీరేంద్రప్రసాద్‌ ‘నేను సైతం..’ అంటూ దేశ గొప్పదనాన్ని 75 విశిష్టతల ద్వారా వివరిస్తూ గీతాన్ని రచించి దానికి దృశ్య రూపమిచ్చారు. ఆ గీతం ఇప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా దేశ మంతటా ఆదరణ పొందుతోంది. ఆవిష్కర్తతో ‘న్యూస్‌టుడే’ మాట్లాడింది.

* ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా అంతర్జాలం వేదికగా వివిధ రాష్ట్రాల నుంచి వీడియోలు, చర్చా వేదికలు, కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి. దేశవ్యాప్త ఈ వేడుకలో తెలుగు రాష్ట్రాలకు భాగస్వామ్యం కల్పించడానికి ప్రత్యేక గీతాన్ని వీరేంద్రప్రసాద్‌ రాశాడు. ‘భగవద్గీత ఇండియా - భరత నాట్యం ఇండియా’ పేరిట సాగే ఈ గీతంలో దేశం గొప్పదనాన్ని 75 అంశాలుగా చూపిస్తూ ఈ వీడియో గీతాన్ని రూపొందించారు. కేవలం తెలుగు వారికి మాత్రమే కాకుండా భాషతో సంబంధం లేకుండా దేశంలోని ప్రజలందరికీ అర్థమయ్యేలా దీనికి రూపకల్పన చేశారు. ‘వ్యాస్‌ మ్యూజిక్‌ వీరేంద్ర’ పేరిట కొత్తగా ఒక యూ ట్యూబ్‌ ఛానల్‌ను పెట్టి, దాని ద్వారా ఈ పాటను అంతర్జాలంలో విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ వెబ్‌సైట్కు కూడా దీన్ని పంపించారు. ఈ పాట ఇప్పుడు చక్కటి ఆదరణను పొందడం సంతోషానిచ్చిదని ఆయన పేర్కొన్నారు.
విలువలున్న పాటలే జనంలోకి..
రానున్న రోజుల్లో సామాజిక సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను సూచిస్తూ విలువలతో కూడిన పాటలను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని వీరేంద్రప్రసాద్‌ స్పష్టం చేశారు. ఉద్యోగ రంగంలో తన లక్ష్యాలను పూర్తిచేసుకొంటూ, ఉన్నతి కోసం కృషిచేస్తూ, మిగిలిన సమయమంతా సాహిత్యం, విభిన్న ఆవిష్కరణల కోసం కేటాయిస్తానన్నారు. ఈ తరహా ఆలోచనలున్న వ్యక్తులతో ఓ బృందం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.



నా పేరు ఈమని వీరేంద్రప్రసాద్‌. మాది తెనాలి. హైదరాబాద్‌ విప్రో సంస్థలో సీనియర్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నా. నా తల్లిదండ్రులు సామ్రాజ్య లక్ష్మి, ఈఎల్‌వీ అప్పారావులు ప్రభుత్వ బడుల్లో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. అందువల్ల నాకు తొలి నుంచి సాహిత్యమంటే మక్కువ ఏర్పడింది.
* నేను బీటెక్‌, ఎంబీఏ చదివి 2005లో సాఫ్ట్‌వేర్‌ రంగంలో కెరియర్‌ ప్రారంభించా. 2007, 2008 సంవత్సరాల్లో అమెరికాలో పనిచేశా. 2010 నుంచి విప్రోలో పనిచేస్తున్నా.
* బీటెక్‌ చదువుతున్న సమయం నుంచే కథలు, కవితలు రాస్తూ ఉండేవాడ్ని. దైనందిన జీవితంలో సాధారణ వ్యక్తి పడుతున్న ఇబ్బందులను సామాజిక కోణంలో చెబుతూ ‘సామాన్యుడు’ కవితా సంపుటిని రాశా. సుమారు 6 సంవత్సరాల క్రితం తెనాలిలో దీని ఆవిష్కరణ వేడుక జరిగింది. దీనికి విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి. ‘మిస్‌ లీలావతి’, ‘లక్కున్నోడు’ తదితర పది సినిమాలకు పాటలు కూడా రాశా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని