logo

ఆటలకు అవకాశం లేదాయె..

కనిపించని శత్రువు కరోనా ఆటలపై పెను ప్రభావం చూపించింది. గత రెండుదశల కరోనా నుంచి బయటపడి పూర్తిస్థాయిలో పాఠశాలలు నడుస్తున్న తరుణంలో ఈ ఏడాది స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌(ఎస్‌జీఎఫ్‌) పోటీలు ఉంటాయని అందరూ భావించారు.

Published : 27 Jan 2022 05:34 IST

సత్తెనపల్లి, న్యూస్‌టుడే

కనిపించని శత్రువు కరోనా ఆటలపై పెను ప్రభావం చూపించింది. గత రెండుదశల కరోనా నుంచి బయటపడి పూర్తిస్థాయిలో పాఠశాలలు నడుస్తున్న తరుణంలో ఈ ఏడాది స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌(ఎస్‌జీఎఫ్‌) పోటీలు ఉంటాయని అందరూ భావించారు. అయితే గత కొన్ని రోజులుగా నమోదవుతున్న కరోనా కేసులతో ఆ అవకాశం లేనట్లేనని తేలిపోయింది. .

ఎస్‌జీఎఫ్‌ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా అన్ని క్రీడల్లో అండర్‌-14, 17 విభాగంలో క్రీడా పోటీల్ని ఏటా నిర్వహిస్తున్నారు. కళాశాలస్థాయి విద్యార్థులకు అండర్‌-19 పోటీలు జరుగుతాయి. రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 36 క్రీడలకు గుర్తింపు ఉన్నప్పటికి ఎస్‌జీఎఫ్‌ క్యాలెండర్‌లో 100కు పైగా క్రీడాంశాల్లో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలు ఏటా నిర్వహిస్తారు. చివరిసారి 2019-20 విద్యా సంవత్సరంలో ఎస్‌జీఎఫ్‌ క్రీడల్ని గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నిర్వహించారు. జిల్లాస్థాయి పోటీలకు వచ్చేసరికి 5 వేల మంది, రాష్ట్రస్థాయికి వందల్లో.. జాతీయస్థాయికి వచ్చేసరికి 120 నుంచి 150 మంది క్రీడాకారులు పాల్గొనేవారు.

* ప్రస్తుత విద్యా సంవత్సరం కొవిడ్‌ ప్రభావంతో ఆలస్యంగా ప్రారంభమైంది. ఎస్‌జీఎఫ్‌ క్రీడా క్యాలెండర్‌ ప్రకారం జులై, ఆగస్టు, సెప్టెంబరు నాటికి జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించి జాతీయస్థాయి పోటీలకు జట్లను ప్రకటించాల్సి ఉంటుంది. ఎస్‌జీఎఫ్‌ క్యాలెండర్‌ షెడ్యూలు విడుదల చేయకపోవడానికి కొవిడ్‌ వ్యాప్తి కారణమని వ్యాయోమోపాధ్యాయులు చెబుతున్నారు.

* జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో రాణించిన క్రీడాకారులకు క్రీడా కోటా ఉన్నత చదువులు, ఉపాధి, ఉద్యోగ కల్పనలో వర్తిస్తుంది. 2 శాతం రిజర్వేషన్‌ను ప్రస్తుతం ఇస్తున్నారు. కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో అండర్‌-14, 17, 19 పోటీలు జరగక ఉన్నత విద్యలో క్రీడా కోటాకు క్రీడాకారులు దూరం కావాల్సి వస్తోంది. రోజూ సాధన, వ్యాయామం, శిక్షణ ద్వారానే క్రీడల్లో రాణింపు సాధ్యమవుతోంది. కొన్ని రోజుల తేడాలో ప్రతిభావంతులైన క్రీడాకారులు సైతం పోటీల్లో పాల్గొనేందుకు వయో పరిమితి పెరిగి దూరమవ్వాల్సి ఉంటుంది. ఇవన్ని ప్రతిభావంతులపై ప్రభావం చూపించే అంశాలుగా ఉన్నాయి.

* గత నెలలో శాప్‌ ఆధ్వర్యంలో ఏపీ సీఎం కప్‌ మండల, నియోజకవర్గస్థాయి పోటీల్ని గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నిర్వహించారు. జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలు జరగాల్సి ఉంది. ఈ పోటీల్లో పాఠశాల, కళాశాల విద్యార్థులతోపాటు బయట నుంచి ఎవరైనా పాల్గొనే అవకాశముంది. కరోనా ఉధృతి నేపథ్యంలో ఏపీ సీఎం కప్‌ పోటీల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుత 2021-22 విద్యా సంవత్సరంలోనూ ఎస్‌జీఎఫ్‌ పోటీలకు అవకాశం లేకుండా పోయిందని ఆ విభాగం కార్యదర్శి పి.మస్తాన్‌రెడ్డి అన్నారు.  ప్రతిభావంతులైన క్రీడాకారులు రిజర్వేషన్లు కోల్పోకుండా ప్రత్యామ్నాయ విధానాలు చూడాలని వ్యాయామోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు ఎల్‌.పిచ్చయ్య కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని