logo

పెద్ద జిల్లాపల్నాడు

కొత్తగా ఏర్పాటవుతున్న మూడు జిల్లాల్లో నరసరావుపేట కేంద్రంగా ఏర్పాటవుతున్న పల్నాడు పెద్ద జిల్లాగా అవతరించనుంది. విస్తీర్ణపరంగా చూస్తే గుంటూరు, తెనాలి రెండు జిల్లాల కంటే పల్నాడు జిల్లా విస్తీర్ణం ఎక్కువ. బాపట్ల, పల్నాడు జిల్లాల కంటే

Published : 27 Jan 2022 05:34 IST

జనాభాలో గుంటూరు ప్రథమ స్థానం

అధికారికంగా వెలువడిన ప్రభుత్వ ప్రకటన

కొత్తగా ఏర్పాటవుతున్న మూడు జిల్లాల్లో నరసరావుపేట కేంద్రంగా ఏర్పాటవుతున్న పల్నాడు పెద్ద జిల్లాగా అవతరించనుంది. విస్తీర్ణపరంగా చూస్తే గుంటూరు, తెనాలి రెండు జిల్లాల కంటే పల్నాడు జిల్లా విస్తీర్ణం ఎక్కువ. బాపట్ల, పల్నాడు జిల్లాల కంటే గుంటూరు జిల్లా విస్తీర్ణం తక్కువగా ఉన్నా జనాభా ఎక్కువగా ఉంది. గుంటూరు నగరపాలక సంస్థతోపాటు తెనాలి, పొన్నూరు మున్సిపాలిటీలు, మంగళగిరి, తాడేపల్లి నగరపాలకసంస్థలు ఉండటంతో జనాభా ఎక్కువగా ఉంది. గుంటూరు జిల్లా పరిధిలో విద్యా, వైద్య, వాణిజ్య కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి. పల్నాడు జిల్లాలో సిమెంటు పరిశ్రమలు, సున్నం గనులు, గ్రానైట్‌, గ్రావెల్‌, కంకర క్రషర్లు, స్పిన్నింగ్‌ పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ ప్రధాన వాణిజ్య పంటలైన పత్తి, మిర్చి సాగు ఎక్కువ. బాపట్ల జిల్లాలో ఎక్కువగా తీర ప్రాంతం కావడంతో ఆక్వాసాగు, ఆక్వా అనుబంధ పరిశ్రమలు, పర్యటకంగా అభివృద్ధి చెందింది. ప్రకాశం జిల్లా నుంచి కలిసిన చీరాల సముద్రతీర ప్రాంతం కాగా అద్దంకి, పర్చూరు నియోజకవర్గాలు మెట్ట ప్రాంతం.


30 రోజుల్లో అభ్యంతరాల స్వీకరణ : కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం బుధవారం ప్రకటన విడుదల చేసింది. గుంటూరు, బాపట్ల, నరసరావుపేట కేంద్రంగా మూడు జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అభ్యంతరాలు ప్రకటన వచ్చిన రోజు నుంచి 30రోజుల్లోపు జిల్లా కలెక్టర్‌కు తెలియజేయాలి. కొత్తగా ఏర్పాటుచేసే రెవెన్యూ డివిజన్లు, ప్రస్తుతం ఉన్న రెవెన్యూ డివిజన్ల నుంచి కొన్ని మండలాలు వేరుచేసి మరో డివిజన్‌లో కలపడం వంటి అంశాల్లో అభిప్రాయబేధాలు తెలియజేయవచ్చు. సూచనలు అందించవచ్చు.


బాపట్లలోని ఏపీహెచ్‌ఆర్డీ భవనం

భవనాలు, స్థలాలపై నివేదికలు : గుంటూరు కేంద్రంగా ఏర్పాటు చేసే జిల్లాకు అవసరమైన భవనాలు, ఇతర వసతులు సరిపోతాయని నివేదిక ఇచ్చారు. బాపట్ల కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తున్నందున స్థానిక ఏపీహెచ్‌ఆర్డీలో తాత్కాలిక కలెక్టరేట్‌ కార్యాలయం పెట్టాలన్న యోచనలో ఉన్నారు. ఇక్కడ 20వేల చదరపు అడుగులు కలిగిన మూడంతస్థుల భవనాలు నాలుగు ఉన్నాయి. సమావేశ మందిరాలు రెండు అందుబాటులో ఉన్నాయి. జిల్లా ఎస్పీ కార్యాలయం కూడా ఇక్కడే ఏర్పాటుకు చూస్తున్నారు. కోర్టు మాత్రం పట్టణంలోనే మరో ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు. కర్లపాలెం రోడ్డులో వ్యవసాయ ఇంజినీరింగ్‌ కళాశాల ఎదురుగా 18 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. దీనికి అనుకునే ఆక్రమణకు గురైన ఐదెకరాల ప్రభుత్వభూమిని తీసుకునే విషయం పరిశీలనలో ఉంది. ఇక్కడ శాశ్వత భవనాలు నిర్మించాలనేది ప్రణాళిక. దీనికి ఒకవైపు బాపట్ల-కర్లపాలెం రహదారి, మరోవైపు 216 జాతీయ రహదారి బైపాస్‌ ఉంటుంది. స్టూవర్టుపురంలోని ప్రభుత్వభూమిలో ఎస్పీ కార్యాలయం, పరేడ్‌ మైదానం ఏర్పాటుచేయనున్నారు. పట్టణంలోని ఎంపీడోవో, తహశీల్దారు, సబ్‌ట్రెజరీ, ఆర్‌అండ్‌బీ డీఈ, అబ్కారీశాఖ, డీఎస్పీ కార్యాలయం, పోలీసు అతిథి గృహాలు 15 ఎకరాల్లో ఉన్నాయి. వీటిని తొలగించి మూడు బహుళఅంతస్థుల భవనాలు నిర్మించి డివిజన్‌ కార్యాలయాలు పెట్టాలనేది ప్రణాళిక. నరసరావుపేట పార్లమెంటు పరిధిలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఏర్పాటుకు సబ్‌కలెక్టర్‌, తహశీల్దారు కార్యాలయాలు ఉన్న ప్రాంగణం, రాజీవ్‌ స్వగృహ సముదాయం, ఎన్నెస్పీ కార్యాలయాలోల తాత్కాలింగా కార్యాలయాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. 


ప్రకటనలు.. సూచనలు

కొత్తగా ఏర్పాటయ్యే పల్నాడు జిల్లాకు గురజాల గాని, పిడుగురాళ్లలో జిల్లా కేంద్రం పెట్టాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. గురజాలను కేంద్రంగా చేయకుంటే పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే యరపతినేని ప్రకటించారు.
కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా పెదకూరపాడు నియోజకవర్గంలోని మండలాలను గురజాల రెవెన్యూ డివిజన్‌లో కలపడాన్ని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. గుంటూరు నుంచి విడదీసే క్రమంలో సత్తెనపల్లి,
పెదకూరపాడు కలిపి కొత్త డివిజన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామన్నారు.

* పల్నాడు జిల్లాకు కవికోకిల గుర్రం జాషువా పేరు పెట్టాలని సీపీఐ వినుకొండ డివిజన్‌ కమిటీ డిమాండ్‌ చేసింది.

* కొత్త జిల్లాల ఏర్పాటుపై కొంత చర్చ జరగాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. పల్నాడు జిల్లాకు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు కన్నెగంటి హనుమంతు పేరు పెట్టాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. ఈమేరకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని