logo

దోపిడీలో ఎత్తుగడ

‘అపరిచిత ఫోన్‌ నెంబర్ల నుంచి వచ్చిన లింక్‌లు క్లిక్‌ చేయవద్దు. బ్యాంకుల నుంచి ఓటీపీ చెప్పమని ఫోన్‌ చేసినా స్పందించ వద్దు..’ ఈ తరహాలో మోసాలపై ప్రజలకు అవగాహన పెరిగింది. సైబర్‌ నేరగాళ్లు తమ పంథా మార్చారు. అమాయకులను

Updated : 28 Jan 2022 04:55 IST

పంథా మార్చుతున్న సైబర్‌ నేరగాళ్లు

‘అపరిచిత ఫోన్‌ నెంబర్ల నుంచి వచ్చిన లింక్‌లు క్లిక్‌ చేయవద్దు. బ్యాంకుల నుంచి ఓటీపీ చెప్పమని ఫోన్‌ చేసినా స్పందించ వద్దు..’ ఈ తరహాలో మోసాలపై ప్రజలకు అవగాహన పెరిగింది. సైబర్‌ నేరగాళ్లు తమ పంథా మార్చారు. అమాయకులను మోసం చేసేందుకు రోజుకో కొత్త తరహా మోసాలకు తెర తీస్తున్నారు. రోజువారీ వడ్డీ, సిమ్‌ యాక్టివేషన్‌, బ్యాంకు ఖాతా బ్లాక్‌ అయిందంటూ ఎస్‌.ఎం.ఎస్‌.లు పంపి, అమాయకులను నమ్మించి రూ.లక్షల్లో ముంచేస్తున్నారు. వృద్ధులనే కాదు యువకులను సైతం మాటలతో బురిడీ కొట్టించేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఫోన్‌ చేస్తున్నామంటూ నమ్మిస్తున్నారు. తియ్యని మాటలతో ఆకర్షిస్తూ.. నగదు దోచుకున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. విజయవాడ సైబర్‌ క్రైం పోలీస్‌స్టేషన్లలో ఇలాంటి కేసులు అధికంగా నమోదవుతున్నాయి.

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే

రామరాజ్యనగర్‌కు చెందిన పాశ్వన్‌ రాజ్‌కుమార్‌ (30).. యూ ట్యూబ్‌లో అధిక వడ్డీ ఇస్తామంటూ ఉన్న ఒక ప్రకటన చూసి ఆకర్షితులయ్యాడు. అందులో చెప్పినట్లుగా ఒక యాప్‌ను 2021, జూన్‌ 6న డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. యాప్‌లో సూచించినట్లుగా 3 బ్యాంకు ఖాతాలను లింక్‌ చేశాడు. మూడు ఖాతాల నుంచి  రూ.2.85 లక్షలు చెల్లించాడు. జూన్‌ 14న అతని ఖాతాలోకి రూ.33,507 జమయ్యాయి. ఆ తర్వాత నుంచి డబ్బులు జమ కాకపోవటంతో మోసపోయినట్లు గ్రహించాడు. అధిక వడ్డీ ఆశతో రూ.2,51,493లు పోగొట్టుకున్నాడు.

షేక్‌ ఫరీహ (50) ప్రైవేటు ఉపాధ్యాయురాలు. గురునానక్‌కాలనీకి చెందిన ఈమె చరవాణికి ఈ ఏడాది జనవరి 16వ తేదీ రాత్రి 7.20కి ఎస్‌బీఐ యూనో ఖాతాను బ్లాక్‌ చేస్తున్నామంటూ ఒక ఎస్‌.ఎం.ఎస్‌. వచ్చింది. పాన్‌ కార్డు నెంబరును అప్‌డేట్‌ చేసుకోమంటూ పంపిన లింక్‌ను క్లిక్‌ చేశారు. లింక్‌లో సూచించిన విధంగా ఎస్‌బీఐ ఖాతా ఇతర వివరాలను నమోదు చేసుకున్నారు. కొద్ది సేపట్లోనే ఆమె ఖాతా నుంచి రూ.4.90 లక్షలు సైబర్‌ నేరగాళ్లు లాగేశారు.
రామకృష్ణాపురానికి చెందిన మోరం రవిశంకర్‌ (61).. విశ్రాంత రైల్వే ఉద్యోగి. బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌. సిమ్‌ కేవైసీ పెండింగ్‌లో ఉందంటూ ఈ ఏడాది జనవరి 19న ఆయన చరవాణికి ఒక ఎస్‌.ఎం.ఎస్‌. వచ్చింది. కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేయాలని, లేకపోతే సిమ్‌ డీ యాక్టివేట్‌ అవుతుందంటూ సమాచారం ఉండటంతో కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేశారు. వారు చెప్పినట్లుగా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, దానికి సంబంధించిన ఐడీ నెంబరు చెప్పారు. రూ.10లు బీఎస్‌ఎన్‌ఎల్‌కు నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా కట్టమనటంతో అలాగే కట్టారు. కొద్ది సేపటికి అతని ఖాతా నుంచి 14 విడతల్లో రూ.3,27,882లు మాయమయ్యాయి.

బ్యాంకుకు వెళ్లటమే ఉత్తమం

ఎవరైనా పాన్‌కార్డు, ఆధార్‌కార్డును బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకోమని ఫోన్‌ చేస్తే వారి మాటలు నమ్మవద్దు. మీరు మీ బ్యాంకు శాఖకు వెళ్లి, అక్కడి సిబ్బంది ద్వారా బ్యాంకింగ్‌ కార్యకలాపాలు చేసుకోండి. పాన్‌కార్డు, ఆధార్‌కార్డులను బ్యాంకు అధికారులే కేవలం 10 నిమిషాల్లోనే మీ ఖాతాకు అనుసంధానం చేస్తారు. ఎవరైనా ఫోన్‌లో చేస్తామని చెబితే.. అవతలి వ్యక్తులు మోసగాళ్లని గుర్తించండి. సిమ్‌ కార్డు బ్లాక్‌ అవుతుందని సమాచారం వచ్చినా, ఆన్‌లైన్‌లో కాకుండా సదరు నెట్‌వర్క్‌ కార్యాలయానికి వెళ్లి కేవైసీ చేయించుకోండి. ఇలా చేస్తే బ్యాంకుల్లో ఉన్న మీ సొమ్ము భద్రంగా ఉంటుంది.

లింక్‌ క్లిక్‌ చేశారో.. మీ వివరాలన్నీ బహిర్గతం

అమాయకులను మోసం చేయాలనే లక్ష్యంతో కొంత మంది లింక్‌లను తయారు చేసి చరవాణులకు పంపిస్తారు. ఏటీఎం కార్డు బ్లాక్‌ అయిందని, సిమ్‌ కార్డు కేవైసీ చేసుకోవాలనో, బ్యాంకు ఖాతా బ్లాక్‌ చేయకుండా ఉండాలనో.. ఇలా ఏదో ఒకటి సదరు లింక్‌ల్లో పొందుపరుస్తారు. వీటిని నమ్మి ఎవరైనా క్లిక్‌ చేస్తే చాలు.. వారి వివరాలన్నీ అవతలి వ్యక్తులకు చేరిపోతాయి. ఒక్కోసారి రూ.10లు లేదా రూ.20లు నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా రుసుముగా కట్టమంటారు. మీరు నెట్‌ బ్యాంకింగ్‌ ఆన్‌ చేయగానే మీ యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ తదితర వివరాలన్నీ అవతలి వారికి తెలిసిపోతాయి. ఆయా వివరాలతో మీ ఖాతాలను ఖాళీ చేసేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని