logo

సంక్షిప్త వార్తలు

అఫిడవిట్‌లో న్యాయమూర్తి సంతకం ఫోర్జరీ చేసిన న్యాయస్థానం జూనియర్‌ అసిస్టెంట్‌ కె.కన్నారావుపై గవర్నర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. గత ఏడాది జులై 24న మండల్‌ లీగల్‌ సర్వీసెస్‌ కమిటీలో ప్రీలిటిగేషన్‌ కేసు విచారణ జరుగుతోంది

Updated : 28 Jan 2022 02:20 IST

న్యాయమూర్తి సంతకం ఫోర్జరీ
న్యాయస్థానం గుమస్తా నిర్వాకం

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే : అఫిడవిట్‌లో న్యాయమూర్తి సంతకం ఫోర్జరీ చేసిన న్యాయస్థానం జూనియర్‌ అసిస్టెంట్‌ కె.కన్నారావుపై గవర్నర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. గత ఏడాది జులై 24న మండల్‌ లీగల్‌ సర్వీసెస్‌ కమిటీలో ప్రీలిటిగేషన్‌ కేసు విచారణ జరుగుతోంది. సదరు కేసును విచారిస్తున్న 6వ అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి ఒక అఫిడవిట్‌పై ఉన్న 4వ స్పెషల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు న్యాయమూర్తి సంతకాన్ని అనుమానించారు. 4వ స్పెషల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు న్యాయమూర్తి తన భర్త కావటంతో, ఆ సంతకం తన భర్తది కాదని, ఆమె వెంటనే గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే భర్త దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై విచారణ చేపట్టిన అనంతరం 4వ స్పెషల్‌ మేజిస్ట్రేట్‌ న్యాయస్థానంలో.. జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కె.కన్నారావు దీనికి ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. అతడు న్యాయమూర్తి సంతకాన్ని ఫోర్జరీ చేసి, న్యాయస్థానం స్టాంపును కూడా సదరు అఫడివిట్‌పై వేశారని విచారణలో తేలింది. దీనిపై 4వ స్పెషల్‌ మేజిస్ట్రేట్‌ పి.ఆదినారాయణ గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


కొనసాగుతున్న హత్య కేసు దర్యాప్తు

మచిలీపట్నంక్రైం, న్యూస్‌టుడే: నగరంలో సంచలనం రేకెత్తించిన ఎమ్మార్పీఎస్‌ నాయకుడు వినోదరావు హత్యకేసులో దర్యాప్తు కొనసాగుతోంది. నగరంలోని వివిధ రాజకీయ పక్షాలతో సన్నిహిత సంబంధాలు ఉండటంతోపాటు వివాదాలకు దూరంగా ఉండే ఆయన హత్య పలు అనుమానాలకు తావిస్తోంది. ఆర్థికపరమైన ఇబ్బందులు, ఇతరులతో వివాదాలు లేకపోయినా కక్షపూరితంగా చేతులు, కాళ్లు, నోరు కట్టేసి హత్యచేసి ఇంటి సమీపంలోనే ఉరితీయడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. అత్యంత సన్నిహితులైన వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారన్న అనుమానాల నేపధ్యంలో డీఎస్పీ మాసుంబాషా నేతృత్వంలో చిలకపూడి సీఐ అంకబాబు అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు నిర్వహిస్తున్నారు.


బౌలింగ్‌లో మెరిసిన హరికృష్ణ

విజయవాడ క్రీడలు: యంగ్‌ బుల్లెట్స్‌ జట్టుకు చెందిన సి.హరికృష్ణ (5/30) బౌలింగ్‌లో నిప్పులు చెరిగి ప్రత్యర్థి జట్టును కట్టడి చేశాడు. జిల్లా క్రికెట్‌ సంఘం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్‌ మైదానంలో జరుగుతున్న కేడీసీఏ ‘బి’ డివిజన్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీలో గురువారం జరిగిన మ్యాచ్‌లో యంగ్‌ బుల్లెట్స్‌ సీసీ జట్టు ఆరు వికెట్ల తేడాతో పీపుల్‌ క్రికెట్‌ క్లబ్‌ జట్టుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పీపుల్‌ క్రికెట్‌ క్లబ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. జట్టులో కేఎస్‌ఎన్‌ శ్రీనిశ్ఛయ్‌ 83 పరుగులతో రాణించాడు. ప్రత్యర్థి బౌలర్‌ సి.హరికృష్ణ అయిదు వికెట్లు కూల్చాడు. బదులుగా బ్యాటింగ్‌కు దిగిన యంగ్‌ బుల్లెట్స్‌ జట్టు 16.5 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 133 పరుగులతో విజయకేతనం ఎగురవేసింది.


బందరు యువ కవి రచనకు ‘వింగ్స్‌’ గుర్తింపు

పెడన గ్రామీణం: కృష్ణా జిల్లా బందరుకు చెందిన యువ కవి కోపూరి శ్రీకాంత్‌ రాసిన ‘పోయమ్స్‌ ఆఫ్‌ ది వాయిడ్‌’ ఆంగ్ల కవితా సంకలనానికి వింగ్స్‌ ప్రచురణ సంస్థ 2022 సంవత్సరానికి ‘గోల్డెన్‌ బుక్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును ప్రకటించింది. వచ్చే నెల పుణెలో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారం ప్రదానం చేయనుంది. ఇదే పుస్తకానికి 2019లో గ్రీస్‌ దేశం ‘ఐల్యాండ్‌ బుక్‌’ అవార్డును అందజేసింది. శ్రీకాంత్‌ అమెరికా నుంచి వెలువడుతున్న ‘కిచెన్‌ సింక్‌’ మ్యాగజైన్‌ కవిత్వ విభాగానికి సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయంగా పనోరమా సంస్థ ఇటీవల నిర్వహించిన ఆన్‌లైన్‌ కవిత్వ పండగలో ద్రావిడ భాషల నుంచి తెలుగులో పాల్గొనటానికి శ్రీకాంత్‌ అవకాశం పొందారు.


రైతుల ఘర్షణ.. కేసుల నమోదు

బాపట్ల, న్యూస్‌టుడే:  బాపట్లలోని ఇమ్మడిశెట్టివారిపాలేనికి చెందిన ఇమ్మడిశెట్టి రాజశేఖర్‌, కొలసాని వేణు మధ్య జమ్ములపాలెంలోని పొలంలో నీరు బయటకు వదిలే విషయంపై వివాదం ఏర్పడి పరస్పరం దాడి చేసుకున్నట్లు బాపట్ల గ్రామీణ ఎస్సై వెంకటప్రసాద్‌ తెలిపారు. పరస్పర దాడుల్లో గాయపడిన రైతులు ప్రాంతీయ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందినట్లు చెప్పారు.


కౌలు రైతు బలవన్మరణం

ధరణికోట(అమరావతి), న్యూస్‌టుడే: ఆర్థిక బాధలు, కుటుంబ కలహాల నేపథ్యంలో కౌలు రైతు బలవన్మరణం చెందిన ఘటన అమరావతి మండలం ధరణికోటలో బుధవారం రాత్రి జరిగింది. ఎస్సై కోటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. ధరణికోట మసీదు సెంటర్‌కు చెందిన షేక్‌ అహ్మద్‌బాషా(28) కూలి పనులు చేస్తూ ఈ ఏడాది రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని మిర్చి పంట సాగు చేశాడు. ఏటా సాగు కలిసిరాకపోవడం, చేసిన అప్పు తీర్చే మార్గం లేకపోవడంతో మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగడంతో భార్య పుట్టింటింకి వెళ్లింది. తీవ్ర మనస్తాపం చెంది బుధవారం సాయంత్రం ఇంటి నుంచి పంట పొలానికి వెళ్లిన అహ్మద్‌ బాషా పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు వెతకగా పొలంలో అచేతన స్థితిలో పడి ఉన్నాడు. ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి భార్య రేష్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అతడి మృతదేహానికి అమరావతి సీహెచ్‌సీలో శవపంచనామా నిర్వహించి గురువారం కుటుంబ సభ్యులకు అందజేశారు.


మళ్లీ మధ్యాహ్న భోజన మెనూ మార్పు

తాడేపల్లి, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం మెనూలో విద్యా శాఖ మళ్లీ మార్పు చేసింది. పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన తాడేపల్లి మండలంలో నూతన మెనూను నిర్ణయించింది. ఇందులో భాగంగా తాడేపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు మధ్యాహ్నం కట్టె పొంగలి, సాంబారు వడ్డించారు. గతంలో ప్రతి గురువారం కిచిడి, టమాటా చట్నీ, ఉడికించిన గుడ్డు ఇచ్చేవారు. ఈనెల 20న తొలిసారి ప్రయోగాత్మకంగా భోజనానికి బదులు ఇడ్లీ, సాంబారు అందజేశారు. వీటివల్ల ఆకలి తీరడం లేదని ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని విద్యా శాఖకు దృష్టికి తేవడంతో మరోసారి మెనూలో మార్పు చేసి మండలంలోని 17 పాఠశాలల్లో కట్టె పొంగలి, సాంబారు వడ్డించారు. దీనిపై విద్యాశాఖ విద్యార్థుల నుంచి అభిప్రాయ సేకరణ చేయనుంది. ఈమేరకు మధ్యాహ్న భోజన పథకం జిల్లా అసిస్టేంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు నూతన మెనూ ప్రారంభించారు. ఇది విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా ఇకపై ప్రతి గురువారం మెనూలో కట్టె పొంగలి, సాంబారు ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు.


ఇతర దేశాల నుంచి 88 మంది రాక

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: ఇతర దేశాల నుంచి గురువారం జిల్లాకు 88 మంది వచ్చారు. వారందరినీ గుర్తించి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 6,368 మందికి పరీక్షలు నిర్వహించగా 30 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ రిపోర్టు వచ్చినట్లు వైద్యులు ప్రకటించారు. వారికి సన్నిహితంగా మెలిగిన వారిలో ఏడుగురికి కరోనా వైరస్‌ నిర్ధారణ జరిగింది. ఇప్పటివరకు 13 మందికి కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని