logo

నిలిచిన థైరాయిడ్‌ పరీక్షలు

గుంటూరు ప్రాంతీయ ప్రయోగశాలలో (రీజనల్‌ లేబొరేటరీ) నాలుగు రోజుల నుంచి థైరాయిడ్‌ పరీక్షలు నిలిచిపోయాయి. వాటి నిర్వహణకు అవసరమైన ఉపకరణాలు అందుబాటులో లేవు. అధికారులు శాంపిళ్లు తీసుకోవటం లేదు. థైరాయిడ్‌ ఉన్న వారికి

Published : 28 Jan 2022 02:37 IST

ఈనాడు-అమరావతి

గుంటూరు ప్రాంతీయ ప్రయోగశాలలో (రీజనల్‌ లేబొరేటరీ) నాలుగు రోజుల నుంచి థైరాయిడ్‌ పరీక్షలు నిలిచిపోయాయి. వాటి నిర్వహణకు అవసరమైన ఉపకరణాలు అందుబాటులో లేవు. అధికారులు శాంపిళ్లు తీసుకోవటం లేదు. థైరాయిడ్‌ ఉన్న వారికి ఇక్కడ ప్రయోగశాలలో టీఎస్‌4, టీఎస్‌హెచ్‌ పరీక్షలు చేస్తారు. నివేదికలు బాగుంటాయని, కచ్చితత్వంతోకూడిన పరీక్షలు చేస్తారని జిల్లా వ్యాప్తంగా బాధితులు ఇక్కడికి వస్తారు. ప్రైవేటు ల్యాబ్‌ల్లో కొందరు ఇచ్చే నివేదికలు చాలా వ్యత్యాసాలు ఉంటున్నాయని, పాత రిపోర్టుల్లో ఉన్న అంకెలను  కొంచెం అటుఇటుగా మార్చి ఇస్తున్నారనే విమర్శలు ఉండటంతో చాలా మంది ఈ ల్యాబ్‌కు వస్తున్నారు. సగటున రోజుకు 30 నుంచి 40 చొప్పున నెలకు వెయ్యికి పైగా పరీక్షలు జరుగుతాయి. సెమీ ఆటోమెటిక్‌ యంత్రంపై థైరాయిడ్‌ మోతాదు ఎంతో ఉందో నిర్ధారిస్తారు. ఈ యంత్రానికి కిట్లు తప్పనిసరి. ఈ ఉపకరణాలు లేకుండా ఆటోమెటిక్‌గానే థైరాయిడ్‌ స్థాయిలు తెలుసుకునే అధునాతన యంత్రాలు వచ్చాయి. అది ఒక్కో యంత్రం ఖరీదు రూ.12 నుంచి 15 లక్షలు ఉండటంతో దాన్ని కొనుగోలు చేయకుండా గత  కొన్నాళ్ల నుంచి సెమీ ఆటోమెటిక్‌ యంత్రంమీదే పరీక్షలు చేస్తున్నారు. ప్రివెంటివ్‌ మెడిసిన్‌ డిపార్టుమెంట్‌ కిందకు వచ్చే ఈ ల్యాబ్‌కు ఏం చేయాలన్నా కలెక్టర్‌ నుంచి ప్రతిపాదనలు వెళ్లాలి. కిట్లు సరఫరా నిలిచిపోవటంతో వాటిని స్థానికంగా కొనుగోలు చేయాలంటే నిబంధనల ప్రకారం కనీసం కొటేషన్‌ అయినా తీసుకుని వాటిని  సమకూర్చుకోవాలి.  ఇదంతా చాలా కాలాతీతంతో కూడుకున్నదని డిపార్టుమెంట్‌ నుంచి కిట్లు ఎప్పుడొస్తే అప్పుడే పరీక్షలు చేద్దామనే యోచనలో అధికారులు ఉన్నారు. గుంటూరు ప్రభుత్వ బోధనాసుపత్రిలో గర్భిణులకు సైతం కిట్లు లేక ఈ పరీక్షలు చేయటం లేదు. గర్భిణులు నెలవారీ పరీక్షలకు వచ్చినప్పుడు కచ్చితంగా థైరాయిడ్‌ చూసుకోవాలి. ప్రత్యేకించి దీని కోసం వారు బయటకు వెళ్లలేరనే ఉద్దేశంతో గతంలో ఉన్న ఆస్పత్రి సూపరింటెండెంట్లు వీరికి ఉచితంగానే ఆ పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేశారు.  గర్భిణియేతరులు ఎవరైనా రీజనల్‌ ల్యాబ్‌కు వెళ్లి నిర్దేశిత రుసుములు చెల్లించి ఆ పరీక్షలు చేయించుకోవాలి. ప్రస్తుతం నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని