logo

పోలీసు దెబ్బలు తాళలేక.. స్టేషన్‌ పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్యాయత్నం

పోలీసులు కొట్టిన దెబ్బలు తాళలేక ఓ యువకుడు ఏకంగా పోలీసు స్టేషన్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించిన ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి గ్రామీణ పోలీసు స్టేషన్‌ వద్ద గురువారం సాయంత్రం జరిగింది. సత్తెనపల్లికి చెందిన చల్లా

Updated : 28 Jan 2022 06:19 IST

ఘటనపై భిన్న వాదనలు వినిపిస్తున్న పోలీసులు

గాయపడిన సుబ్బారావును ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు

గ్రామీణ సత్తెనపల్లి, న్యూస్‌టుడే: పోలీసులు కొట్టిన దెబ్బలు తాళలేక ఓ యువకుడు ఏకంగా పోలీసు స్టేషన్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించిన ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి గ్రామీణ పోలీసు స్టేషన్‌ వద్ద గురువారం సాయంత్రం జరిగింది. సత్తెనపల్లికి చెందిన చల్లా సుబ్బారావు వంట పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొమిరపూడి వద్ద ఓ మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లినట్లు అనుమానించి సుబ్బారావును విచారణ నిమిత్తం రెండు రోజుల క్రితం స్టేషన్‌కు తీసుకొచ్చారు. నిందితుని నుంచి సరైన సమాధానం రాకపోవటంతో స్టేషన్‌పైన ఉన్న డార్మెటరీలోకి తీసుకెళ్లి తమదైన శైలిలో విచారించినట్లు సమాచారం. విచారణ పేరుతో తనను పోలీసులు చావబాదారని, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని చెప్పినా వినిపించుకోకుండా కొట్టడంతో దూకేశానని బాధిత యువకుడు సుబ్బారావు తెలిపారు. పై నుంచి దూకి తీవ్ర గాయాలపాలైన ఆ యువకుడిని  పోలీసులు హుటాహుటిన సత్తెనపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. దీనిపై పోలీసులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. స్టేషన్‌ కింద భాగంలో ఫిర్యాదుదారులు చాలా మంది ఉండటంతో సౌకర్యం కోసం పై అంతస్తులోకి విచారించాలనుకున్నామన్నారు. అందులో భాగంగా మెట్లమార్గంలో తీసుకెళ్తుండగా తమ కానిస్టేబుల్‌ను నెట్టేసి పై నుంచి దూకి పోలీసులను బ్లాక్‌మెయిల్‌ చేయటంలో భాగంగానే ఇలా వ్యవహరించారని చెప్పారు. కొమెరపూడిలో కళ్లం సామ్రాజ్యమ్మ అనే మహిళ మెడలో బంగారు గొలుసు తెంచుకొని వెళ్లిన సంఘటనలో ఆయువకుడ్ని అరెస్టు చేశామని ఎస్‌ఐ బాలకృష్ణ చెప్పారు. కుటుంబ సభ్యులు తెచ్చిన భోజనాన్ని తింటానంటూ నిందితుడు పైకి వెళ్లాడని, పారిపోయే యత్నంలో అంతస్తు నుంచి దూకి గాయాలపాలయ్యాడని వివరించారు. పెదకూరపాడు, కొమెరపూడిల్లో జరిగిన గొలుసు దొంగతనం కేసుల్లో సుబ్బారావు నిందితుడని పేర్కొన్నారు. గతంలో అతనిపై గుంటూరు రూరల్‌, అర్బన్‌, ప్రకాశం జిల్లాల్లో మొత్తం ఐదు కేసులు ఉన్నాయన్నారు. ఓసారి అద్దంకి పోలీసు స్టేషనులోనూ ఓ కేసులో అదుపులోకి తీసుకోగా ఇలానే తప్పించుకుని పారిపోవటానికి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని గుర్తు చేశారు. ఆయువకుడికి కాలు విరిగిందని ప్రాణపాయం ఏమీ లేదని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని