Andhra News: ఆ రూ.48వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?: యనమల

ఏపీ ప్రభుత్వ ఆర్థిక అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు కోరారు.

Updated : 26 Mar 2022 13:07 IST

అమరావతి: ఏపీ ప్రభుత్వ ఆర్థిక అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు కోరారు. రూ.48వేల కోట్లను ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆయన ఆరోపించారు. దీనిపై కేంద్ర విచారణ జరిపించాలని కోరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో యనమల మీడియాతో మాట్లాడారు. రూ.1.78 లక్షల కోట్లను ప్రభుత్వం ప్రజల కోసం ఖర్చు పెడితే రూ.48వేల కోట్లకు లెక్కల్లేవన్నారు. లెక్కలు చెప్పకపోతే ఎవరి జేబుల్లోకి వెళ్లిందో తేల్చాలని డిమాండ్‌ చేశారు. స్పెషల్‌ బిల్లుల పేరుతో ఖర్చు పెట్టామని ప్రభుత్వం చెబుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఆర్టికల్‌ 360 ప్రయోగించి ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించాలని యనమల కోరారు.

‘‘స్పెషల్‌ బిల్లులనేవి ట్రెజరీ కోడ్‌లోనే లేవు. రాష్ట్ర ఆదాయాన్ని ప్రభుత్వ పెద్దలు దిగమింగుతున్నారు. కేంద్రం ఆదుకోకుంటే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది. జగన్‌ ప్రభుత్వంలో పీఏసీ వ్యవస్థ ఎందుకు సరిగ్గా పని చేయట్లేదు. వైకాపా ప్రభుత్వం పీఏసీ జరగనివ్వకుండా వ్యవహరిస్తోంది. చట్టాలు చేసే అధికారం లేదని కోర్టులు చెప్పకున్నా.. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చట్టాలు చేసే హక్కు చట్ట సభలకు లేదని కోర్టు చెప్పలేదు. 3 రాజధానులపైనే చట్టం చేసే అధికారం లేదని కోర్టు చెప్పింది’’ అని యనమల అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని