logo

పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా దావోస్‌ పర్యటన..

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఉన్న అవకాశాలు వివరించి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా దావోస్‌ పర్యటన ఉంటుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు.

Updated : 19 May 2022 12:57 IST

రాజధానిగా ఇప్పుడేముందో అదే అక్కడ చెబుతాం

పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఉన్న అవకాశాలు వివరించి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా దావోస్‌ పర్యటన ఉంటుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు.

బుధవారం విశాఖలోని ప్రభుత్వ అతిథిగృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశం చివర్లో గతంలో జరిగిన దావోస్‌ సదస్సులో ‘అమరావతి’ని పెట్టుబడుల కేంద్రంగా ప్రమోట్‌ చేశారని, మీరు కూడా అలాగే చేస్తారా అని విలేకర్లు ప్రశ్నించగా ‘మేం అమరావతిని కాదు.. ఆంధ్రప్రదేశ్‌ మొత్తాన్ని ప్రమోట్‌ చేస్తా. విద్యుత్తు సమస్య తాత్కాలికమైనదే తప్ప పారిశ్రామిక వర్గాలను ఆకర్షించడంలో అది అడ్డంకి కాబోదు’ అని మంత్రి పేర్కొన్నారు. ఇదే క్రమంలో రాష్ట్ర రాజధాని పేరడిగితే ఏం చెబుతారని ఓ విలేకరి అడగ్గా... ‘ఇప్పుడు ఏమున్నదో అదే చెబుతాం’ అని సమాధానం దాటవేయడం గమనార్హం.

10 అంశాల్లో పాల్గొంటున్నాం: ‘వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం’ ఆహ్వానం మేరకు ఈ నెల 22 నంచి 26 వరకు దావోస్‌లో ముఖ్యమంత్రితో పాటు పర్యటిస్తున్నట్లు మంత్రి అమర్‌నాథ్‌ తెలిపారు. ఈ సదస్సును 18 అంశాల్లో నిర్వహిస్తున్నారని, అందులో 10 అంశాల్లో మన రాష్ట్రం పాల్గొంటుందన్నారు. ‘రాష్ట్రంలో 974 కి.మీ. పొడవునా సముద్రతీరం ఉంది. నాలుగు పోర్టులు పనిచేస్తున్నాయి. మరో మూడు పోర్టులను నిర్మించాలని తలపెట్టాం.

కాకినాడలోని ఏంకరేజ్‌ పోర్టును పునఃనిర్మించేందుకు మారిటైం బోర్డు ద్వారా రూ.50 కోట్లు, కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.50 కోట్లు ఖర్చుచేస్తున్నాం. రాష్ట్రంలో ఇప్పటికే ఆరు విమానాశ్రయాలున్నాయి. నెల్లూరు జిల్లాలో కొత్తగా ప్రైవేటు ఎయిర్‌పోర్టు నిర్మిస్తున్నాం. ఈ అవకాశాలన్నింటిని ప్రపంచ ఆర్థిక సదస్సులో వివరించబోతున్నాం. మన దగ్గర పెట్టుబడులు పెడితే దక్కే ప్రయోజనాలపై ఒక పెవిలియన్‌ కూడా ఏర్పాటు చేయబోతున్నాం’ అని మంత్రి వివరించారు.

వరల్డ్‌ ఎనమిక్‌ ఫోరం వ్యవస్థాపకుడు క్లాస్‌క్వాబ్‌తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమవుతారన్నారు. ‘గత ప్రభుత్వం ఇలాంటి సదస్సులకు వెళ్లి రూ.లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని ప్రచారం చేసుకోవడమే తప్ప అందులో వాస్తవం లేదు. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం అనేది కేవలం పారిశ్రామిక అవకాశాలను వివరించడం, ఆకట్టుకునేందుకే. తర్వాత మనతో కలిసి ప్రయాణించేవారితో ఒప్పందాలు చేసుకుని బయటకు చెబుతాం’ అని అన్నారు. విశాఖలో ‘బీచ్‌ ఐటీ’కి ఉన్న అవకాశాలను విస్తృతంగా వివరిస్తామన్నారు. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడానికి హెచ్‌ఎస్‌బీసీ విశాఖ నుంచి తరలిపోయిందని ఆ కంపెనీ స్థానంలో మరో ఎమ్‌ఎన్‌సీ వచ్చిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని