logo

ఆయువు తీసిన వేగం

జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం జరిగిన ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు.

Updated : 28 May 2022 03:39 IST

వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురి దుర్మరణం

నర్సీపట్నం అర్బన్‌, మాకవరపాలెం, న్యూస్‌టుడే

నర్సీపట్నం సమీపంలో ప్రమాదానికి గురై నుజ్జయిన కారు

జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం జరిగిన ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు.

జోరు వర్షం.. ఎదురుగా ఏ వాహనం వస్తుందో కనిపించడం లేదు. నెమ్మదిగా వెళ్లినా, కాసేపు ఆగి బయలుదేరినా.. మరో పది నిమిషాల్లో వారంతా క్షేమంగా ఇళ్లకు చేరుకునే వారు. ఈ క్రమంలోనే కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. పల్టీలు కొట్టుకుంటూ ఓ చెట్టుని బలంగా ఢీకొట్టింది. కారు వెనుక సీట్లో కూర్చున్న ముగ్గురు యువకులు ఎగిరిపడ్డారు. బలమైన గాయాలై అక్కడికక్కడే మరణించారు.

ఘోర రోడ్డు ప్రమాదం వారిని తిరిగిరాని లోకాలకు చేర్చడంతోపాటు ఆ కుటుంబాలను అంతులేని విషాదంలోకి నెట్టింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి..


మాకవరపాలెం మండలానికి చెందిన ఐదుగురు స్నేహితులు గురువారం రాత్రి కాకినాడ జిల్లా తునిలో తెలిసిన వారి ఇంట్లో పెళ్లికి బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో శుక్రవారం ఉదయం 5.16 గంటలకు అప్పన్నదొరపాలెం కూడలికి చేరుకునే క్రమంలో కారు అదుపుతప్పి పల్టీలు కొట్టుకుంటూ వెళ్లి చెట్టుని బలంగా ఢీకొట్టింది. తామరం గ్రామానికి చెందిన రాచూరి దుర్గాప్రసాద్‌ (22), మాకవరపాలెం బీసీ కాలనీకి చెందిన యల్లపు నాగేంద్ర (28), కన్నూరి రాజేష్‌ (25) అక్కడికక్కడే మరణించారు. డ్రైవర్‌ మైచర్ల గౌరీనాథ్‌ (23), గెడ్డం లక్ష్మణ్‌ (21) ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. తీవ్రగాయాలతో వీరిద్దరూ నర్సీపట్నంలో చికిత్స పొందుతున్నారు. గౌరీనాథ్‌ మాట్లాడుతూ.. నాన్న కాల్‌ చేసి వెంటనే రమ్మని చెప్పడంతో పెళ్లికి వెళ్లకుండానే కారు వెనక్కు తిప్ఫా వర్షం వల్ల చెట్టు విరిగిపడి ప్రమాదం జరిగిందని వివరించాడు.


మృతుడు ఆనంద్‌ జయశేఖర్‌ రెడ్డి (పాత చిత్రం

మరో రోడ్డు ప్రమాదంలో...

నక్కపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జె.ఆనంద్‌ జయశేఖర్‌రెడ్డి (20) అనే యువకుడు మృత్యువాత పడ్డాడు. బైకుపై టైర్‌ పేలి రోడ్డు పక్కన ఆగిన కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. ఆనంద్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. రాజశేఖర్‌కు తీవ్రగాయాలయ్యాయి.


పోసయ్య మృతదేహం

ఆటో నుంచి జారిపడి ప్రయాణికుడి మృతి

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: ఆటో నుంచి జారిపడి ఒకరు మృతిచెందిన అచ్యుతాపురం మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. స్థానిక ఎస్సై ఉపేంద్ర కథనం మేరకు.. యానాంకు చెందిన పోతాబత్తుల పోసయ్య (38) తాపీమేస్త్రీగా పనిచేస్తూ ఎలమంచిలి మండలం ఏటికొప్పాకలో నివాసం ఉంటున్నారు. పూడిమడకలో గురువారం జరిగిన గంటాలమ్మ పండగకు బంధువులతో కలిసి వచ్చారు. పండగ ముగియడంతో శుక్రవారం ఏటికొప్పాక వెళ్లడానికి ఆటోలో పూడిమడక నుంచి బయలుదేరారు. మరో రెండు నిమిషాల్లో అచ్యుతాపురం చేరుతారనగా ఆటో నుంచి జారికింద పడిపోయారు. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయమై సంఘటన స్థలంలోనే పోసయ్య మృతిచెందారు.


రమేష్‌బాబు, వెంకటేశ్వరమ్మ (పాత చిత్రాలు)

ఒడ్డిమెట్ట, నక్కపల్లిలో..

నక్కపల్లి, న్యూస్‌టుడే: అతి వేగం ముగ్గురి ప్రాణాలను హరించగా.. ఆరుగురు ఆసుపత్రి పాలయ్యారు. దైవ దర్శనానికి బయలుదేరిన రెండు కుటుంబాలు ప్రయాణిస్తున్న ఆటో, పుట్టిన రోజు వేడుక చేసుకునేందుకు బైక్‌పై ఇంటికి వెళ్తున్న ఇద్దరు యువకులు ఆగి ఉన్న వాహనాలను వేగంగా ఢీకొట్టారు. నక్కపల్లి ఎస్సై వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా ఉంగుటూరుకు చెందిన మరడ రమేష్‌బాబు (37), తలారి వెంకటేశ్వరమ్మ (41), సింహాచలం, మరడ అప్పలనాయుడు, మంగమ్మ, నవీన్‌, గొట్టపు నాగరాజు ఆటోలో సింహాచలం అప్పన్నను దర్శించుకునేందుకు ఉంగుటూరు నుంచి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న ఆటో శుక్రవారం తెల్లవారుజామున ఒడ్డిమెట్ట వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొంది. రమేష్‌బాబు, వెంకటేశ్వరమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారంతా గాయపడ్డారు. సాయం కోసం ఆర్తనాదాలు చేస్తుండగా.. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై, పోలీసు సిబ్బంది అంబులెన్స్‌లో తుని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

ఒడ్డిమెట్ట వద్ద ప్రమాదానికి గురైన వాహనం; మృతిచెందిన రమేష్‌బాబు


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని